తెలుగు పంచాంగం ప్రకారం రోజులో కొంత సమయాన్ని ‘అమృత ఘడియలు’ అంటారు.కొందరికి మాత్రం ఆత్మీయులు దగ్గర ఉంటే ఎప్పుడూ అమృత ఘడియలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌కు అమృత భార్య మాత్రమే కాదు... ఆత్మీయ నేస్తం. ప్రముఖ రాజకీయ నాయకుడి భార్యగానే కాదు...‘మల్టీ టాలెంటెడ్ స్టార్’గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది అమృత ఫడ్నవీస్...
‘మీరు ఎప్పుడూ ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారో మాకు తెలుసు’ అంటారు సన్నిహితులు దేవేంద్ర ఫడ్నవీస్‌తో సరదాగా. ఆ రహస్యంలో ‘అమృత’ పేరు దాగి ఉంది. దేవేంద్ర భార్య అయిన అమృత మల్టీటాలెంట్‌కు మారుపేరు. నిత్య ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్. ఫైనాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్పోర్ట్స్... పలు రంగాల్లో ప్రతిభ చాటుకున్న అమృత ఫడ్నవీస్ సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది.
నాగ్‌పూర్‌కు చెందిన అమృత డిగ్రీ వరకు అక్కడే చదువుకుంది. పుణేలో ఎంబీఏ చేసింది. యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అమృతకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. తన గానంతో శ్రోతల ప్రశంసలు అందుకునేది. ప్రకాష్ ఝా సినిమా ‘జై గంగా జల్’లో ఒక పాట కూడా పాడింది. సామాజిక సందేశంతో కూడిన పాటలను రూపొందించడంలో ముందు ఉండే అమృత నది కాలుష్యం నుంచి గృహహింస వరకు ఎన్నో అంశాలపై పాటలు ఆలపించింది. స్త్రీ సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక పాటలు రూపొందించింది. ఆపదలో ఉన్న ప్రజలు, అణగారిన వర్గాల పిల్లల సహాయం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.
అమృత ప్రతిభలో పాటే కాదు ఆట కూడా ఉంది. స్టేట్–లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా అండర్–16 టోర్నమెంట్స్‌లో ఆడింది. ‘సోషల్ మీడియా స్టార్’గా కూడా బాగా పాపులర్ అయిన అమృతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్‌ల ఫాలోవర్‌లు ఉన్నారు. సామాజిక కోణంలో ఆమె ఇన్‌స్పైరింగ్ పోస్ట్‌లకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కెరీర్, కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న అమృత దేవేంద్ర ఫడ్నవీస్‌కు అక్షరాలా ఆత్మీయ బలం.
పెళ్లికి మొదట్లో భయపడింది!
దేవేంద్ర–అమృత వివాహం ప్రేమ వివాహం అనుకుంటారు చాలా మంది. కాని వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అమృత తండ్రి శరద్ రానడే, తల్లి చారులత... ఇద్దరూ వైద్యులే. అయితే తమలాగే కూతురు కూడా డాక్టర్ కావాలని వారు అనుకోలేదు. కుమార్తెకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇక పెళ్లి విషయానికి వస్తే... పెళ్లికి ముందు దేవేంద్ర, అమృత ఒకరికొకరు అపరిచితులు. వీరిని ఒక కామన్ ఫ్రెండ్ శైలేష్ జోగ్లేక్ ఇంట్లో పెళ్లి కోసం తీసుకువచ్చారు పెద్దలు. అప్పటికే దేవేంద్ర శాసనసభ్యుడు అయ్యాడు.
‘రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకోవడం గురించి మొదట్లో భయపడ్డాను. అయితే ఆయన నిరాడంబర వ్యక్తిత్వంతో నాలో భయం ఎగిరిపోయింది. నా అభిప్రాయం మారిపోయింది’ అని భర్త దేవేంద్ర గురించి చెబుతుంది అమృత.
చాలామంది రాజకీయనాయకులలాగే దేవేంద్ర కూడా గంభీరంగా కనిపిస్తాడు. ఆయన సరదాగా ఉండేలా, అదేపనిగా నవ్వేలా చేయడం అంటే ఆషామాషీ కాదు. అయిననూ... శ్రీమతి అమృత భర్త దేవేంద్రను నవ్విస్తూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన పెదాలపై కనిపించే నవ్వు... అమృత సంతకం!
Comments
Please login to add a commentAdd a comment