పాదానికి దేహానికి మధ్య సంధాన కర్త యాంకిల్ (చీలమండ). కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల, నడిచేటప్పుడు కాలు మడత పడడం వంటి చిన్న కారణాలకే యాంకిల్ పెయిన్ వస్తుంటుంది. ప్రమాదవశాత్తూ జారిపడినప్పుడు ఆ దుష్ప్రభావానికి మొదటగా గురయ్యేది యాంకిల్ మాత్రమే. అలాగే ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితుల్లోనూ దేహంలోని తొలి బాధిత భాగం ఇదే.
యాంకిల్ పెయిన్ వస్తే దైనందిన జీవనం దాదాపుగా స్తంభించిపోతుంది. ఈ నొప్పికి తక్షణం చికిత్స తీసుకోవాల్సిందే. అయితే యాంకిల్ పెయిన్‌కి దారి తీసిన కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మొదటగా ఇంట్లో తీసుకోగలిగిన జాగ్రత్తలను చూద్దాం. అలాగే డాక్టర్‌ను సంప్రదించాల్సిన పరిస్థితులను తెలుసుకుందాం.
►యాంకిల్ పెయిన్ చికిత్సలో రైస్ మెథడ్ ప్రధానమైనది. రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ పదాల మొదటి ఇంగ్లిష్ అక్షరాలతో రూపొందించిన చికిత్స విధానం ఇది.
►పూర్తిగా విశ్రాంతినివ్వాలి. పాదం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు మోపకూడదు, బాత్‌రూమ్ వంటి స్వయంగా చేసుకోవాల్సిన పనులకు క్రచెస్ సహాయంతో నడవాలి.
►గాయం తగిలిన మూడురోజుల వరకు రోజుకు ఐదు సార్లు గాయం మీద ఐస్ పెట్టాలి.
►ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో పాదాన్ని చీలమండను కలుపుతూ కట్టుకట్టాలి. అయితే ఈ కట్టును రక్తప్రసరణకు అంతరాయం కలిగేటంత గట్టిగా కట్టకూడదు.
►రెండు దిండ్ల సహాయంతో యాంకిల్‌ను గుండెకంటే ఎత్తులో ఉంచాలి.
►కండరాలు ఒత్తిడికి గురైన కారణంగా వచ్చిన నొప్పి అయితే తగ్గిపోతుంది.
► ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, దీర్ఘకాల సయాటికా కారణంగా నరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో అడ్డంకులు, కీళ్లలో ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చిన యాంకిల్ పెయిన్ అయితే వైద్యుల సూచనతో చికిత్స చేయించుకోవాలి. అనారోగ్య కారణాన్ని బట్టి మందులు మారుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment