చాలా మంది కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నొప్పి రాకుండా వివిధ రకాల ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మందు ప్రభావం తగ్గిన వెంటనే, నేనున్నానంటూ మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి నివారణ చిట్కాల సహాయంతో పాదాల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
మడమల నొప్పులు ఏ సీజన్‌లో అయినా రావచ్చు కానీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. ఈ నొప్పులకు కారణాలు అనేకం. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు లేదా చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం వంటివి ముఖ్య కారణాలు.
అల్లం
మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించడం వల్ల వల్ల చీలమండల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.
చేప
ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి.
రాక్‌సాల్ట్
మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్‌సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10–15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు ఉపశమిస్తాయి.
ఐస్ క్యూబ్స్
మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఐస్‌క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
లవంగ నూనెతో మసాజ్
మడమ నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగ నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
పసుపు
మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపునీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్
మడమల నొప్పి. వాపు వంటి సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కాసిని వేడినీళ్లలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment