ప్రపంచానికి అత్యంత సుదూరాన మంచుదీవిలో నడుస్తున్న ఏకైక పోస్టాఫీసు ఇది. అంటార్కిటికాలోని పోర్ట్ లాక్రాయ్‌లో ఉన్న ఈ పోస్టాఫీసును యునైటెడ్ కింగ్‌డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఇది కేవలం పోస్టాఫీసు మాత్రమే కాకుండా, మ్యూజియమ్ కూడా. ప్రస్తుతం ఈ పోస్టాఫీసులో నాలుగు పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టాఫీసు ఏడాదిలో ఐదు నెలలు మాత్రమే పనిచేస్తుంది.
ఇక్కడి ఖాళీలపై ఉద్యోగ ప్రకటన ఇటీవల వెలువడగానే ప్రపంచం నలుమూలల నుంచి వందలాదిగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో పనిచేసేవారు పోస్టాఫీసు బాధ్యతలతో పాటు మ్యూజియం నిర్వహణను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటికి తోడు ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే పెంగ్విన్లను లెక్కించడం కూడా వారి బాధ్యతే!
పెంగ్విన్లను లెక్కించడంలో నైపుణ్యం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అదనపు అర్హత. సూదూరంగా ఏకాంత ప్రదేశంలో ఉన్న ఈ పోస్టాఫీసులో పనిచేయడం ఏమంత ఆషామాషీగా ఉండదని, ఏటా నవంబర్ నుంచి మార్చి వరకు పనిచేసే ఈ పోస్టాఫీసులో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటూ పనిచేయడమే కష్టమని యునైటెడ్ కింగ్‌డమ్ అంటార్కిటిక్ హెరిటేజ్ ట్రస్ట్ సీఈవో కామిలా నికోల్ తెలిపారు.
ఇక్కడ రోజుకు పన్నెండు గంటల సేపు పనిచేయాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు తమ ప్రకటనకు స్పందనగా రెండున్నర వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని పనిచేసే శారీరక దారుఢ్యం, శాస్త్ర పరిశోధనల కోసం ఇక్కడకు వచ్చే పర్యాటకులతో తగిన రీతిలో మెలిగే కలివిడితనం, ఓర్పు, సహనం ఉన్న అభ్యర్థుల కోసం చూస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment