ప్రత్యామ్నాయ కవిత్వం.. పరిపూర్ణ కవిత్వం | Article Of Gurram Jashuva | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ కవిత్వం.. పరిపూర్ణ కవిత్వం

Published Mon, Sep 28 2020 12:59 AM | Last Updated on Mon, Sep 28 2020 12:59 AM

Article Of Gurram Jashuva - Sakshi

జాషువా 125వ జయంతిని కరోనా కాలంలో జరుపుకుంటున్నాం. ఇదొక అనుభవం. ఇన్నేళ్ళుగా ఆయన కవిత్వం ‘ప్రజల నాల్కల యందు’ జీవిస్తూనే ఉంది. తరం తరువాత తరం మీద పరిమితులు లేని ప్రభావాన్ని వేస్తూనే ఉంది. జాషువా కేవలం గొప్ప భావాల్ని మాత్రమే వ్యక్తం చేసి ఊరుకోలేదు. అవి ప్రజల నాల్కల మీద ఆడే రీతిలో రాశాడు.

తనకాలంలో వస్తున్న కవిత్వానికి ప్రత్యామ్నాయ కవిత్వాన్ని రాసి మెప్పించినవాడు జాషువా. తన కవితా ప్రస్థానంలో ఎన్ని అడ్డంకులూ, అవమానాలూ ఎదుర్కొన్నాడో అన్ని నీరాజనాలూ అందుకున్నాడు. తాను రంగంలోకి దిగేసరికి తెలుగు కవిత్వంలో మూడు ధోరణులు ప్రధానంగా నడుస్తున్నాయి. కృష్ణశాస్త్రి, రాయప్రోలు నాయకత్వంలో భావకవిత్వం ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. విశ్వనాథ సత్యనారాయణ నాయకత్వంలో హిందూ సనాతన కవిత్వం మరోపక్క సవ్వడి చేస్తోంది. శ్రీశ్రీ నాయకత్వంలో అభ్యుదయ కవిత్వమూ ఉద్యమంలా వస్తో్తంది. ఈ మూడు ధోరణులకు భిన్నంగా రాస్తూ ప్రత్యామ్నాయ కవిత్వాన్ని సృష్టించాడు జాషువా. ప్రేమనూ, విరహాన్నీ ఊహించి విలపించే భావకవిత్వం వాస్తవానికి దూరంగా ఉందని విమర్శించాడు. విశ్వనాథ సనాతన హిందూ ధర్మాన్నీ ఎండగట్టాడు. ‘ప్రణయ కవి యొకండు, పాషాణ కవి యొక్కడు’ అని పై రెండు ధోరణుల కవుల్ని అధిక్షేపించాడు. ‘నేనాచరించని నీతులు బోధించి/ రాని రాగము తీయగలేను నేను’ అంటూ అభ్యుదయ కవుల మీదా చురకలు వేశాడు.

తన కాలపు కుల, మత వాస్తవికతనూ, అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీల పీడననీ శక్తిమంతమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీదా, పిల్లల మీదా, ప్రేమా, కరుణల వంటి విలువల మీదా, కళల మీదా, మానవ అశాశ్వతత్వం మీదా, మరణం మీదా– ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు. వివిధ తరహాల పాఠకులు కనెక్ట్‌ కాగలిగే వస్తు విస్తృతి జాషువాది. విభిన్నత నుంచి విశ్వజనీనతను చేరుకున్న కవిత్వం రాయడం ద్వారా ‘విశ్వ నరుడ్ని నేను’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగాడు. ‘గబ్బిలం’, ‘పిరదౌసి’, ‘అనాథ’, ‘నేతాజీ’, ‘క్రీస్తు చరిత్ర’ ‘ముసాఫరులు’తో సహా 38 కవిత్వ గ్రంథాలను అందించాడు. ఇవి కాక వ్యాసాలూ, జాబులూ తదితర రచనలూ చేశాడు.

ఒకపక్క రాయప్రోలు ‘పొగడరా నీదు తల్లి భూమి భారతిని /నిలపరా నీ జాతి నిండు గౌరవము’అని దేశభక్తిని గానం చేస్తుంటే జాషువా ఈ దేశాన్ని విమర్శించాడు. కులవ్యవస్థతో పంచముల్ని పీక్కుతినే ఈ దేశం భయంకరమైనదని అన్నాడు:
‘ఇది భయంకర దేశము
వర్ణభేదముల్‌ గూడలు గట్టినవనరాదు పంచమ జాతివారికిన్‌
కూడు హుళక్కి, మానవత గూడ హుళక్కి, హుళక్కి జన్మమున్‌’.
నిచ్చెనమెట్ల కుల సమాజంతో మనుషుల్ని ఎక్కువ తక్కువలుగా విభజించి, పంచములకు ఆహారాన్నీ, ఆత్మగౌరవాన్నీ, మనిషితనాన్నీ నిరాకరించిన ఈ దేశం భయంకరమైనదని బాధతో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చాడు. ‘లేదురా ఇటువంటి భూమి ఎందులేదురా/మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్‌ సోకునందాక’, అని ఈనేలనూ, ప్రజల్నీ వైభవీకరించటాన్ని జాషువా తప్పు పట్టాడు. ఈ భూమి నీచమైనదనీ, ఈ పౌరులు కులోన్మాదులై దళితుల శ్రమను దోచుకునేవారనీ రాశాడు.
‘నేను చిందులాడి నేను డప్పులు గొట్టి
యలసి సొలసి సత్తి కొలువు గొలువ
ఫలితమెల్ల నొరులు భాగించుకొనిపోవు
నీచమైన భూమి జూచినావె?’
అని అందుకే నిలదీశాడు. దళితుల గురించి దేశమూ, దళితేతరులూ ఏమనుకుంటున్నారనేది కాదు, దేశాన్ని గురించీ, తమను నిత్యం పీడిస్తున్న కులాల పౌరుల గురించీ దళితులు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశాడు కవి. అందుకే ఈయన దృక్కోణం ప్రత్యామ్నాయ దృక్కోణమయ్యింది.
ఈ వ్యవస్థ గురించి సంప్రదాయ కవులూ, మేధావులూ, నాయకులూ అల్లిన పవిత్ర భ్రమల్నీ,  కట్టుకథల్నీ భగ్నంచేసి వాటి వెనకవున్న నిజాల్ని వెల్లడిచేయటంలోనే జాషువా ప్రత్యామ్నాయ దృక్కోణం ఉంది. విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగలు’ పేరుతో హిందూమతాన్ని వైభవీకరిస్తే, జాషువా దానికున్న కుల స్వభావాన్ని బయటపెట్టాడు. దళితుల్ని అంటరాని వాళ్లుగా కసరి కొడుతూ ఆకలితో అలమటింపజేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభివ్యక్తిలో పట్టుకున్నాడు:
‘ఆ అభాగ్యుని రక్తమునాహరించి
ఇనుపగజ్జలతల్లి నర్తనము చేయు
కసరి బుసకొట్టు నాతని గాలిసోక
నాల్గు పడగల హైందవ నాగరాజు’
మనిషిని పశువుకన్నా హీనంగా జూసిన, చూస్తున్న చరిత్రను ఇంతకన్నా బలంగా ఎవరు చెప్పగలరు!
శ్రమ గురించీ, దోపిడీ గురించీ, అసమానతల గురించీ రాసినప్పటికీ, శ్రీశ్రీ వాటి ముఖ కవళికల గురించీ, నిర్దిష్ట రూపురేఖల గురించీ రాయలేదు. ఆ పని జాషువా చేశాడు. ఈదేశ వర్గ దోపిడీ కుల పెత్తనంలో భాగంగా ఉందీ, ఇక్కడ వర్గాలు కులాలలో మనుగడ సాగిస్తున్నాయనే అంబేడ్కరిస్టు అవగాహనను జాషువా సమర్థంగా పలికించాడు.
‘వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్య రమ పండి పులకింప సంశయించు
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టు వానికి భుక్తి లేదు’
అని ఈ దేశంలో దోపిడీ యొక్క నిర్దిష్ట రూపాన్ని స్పష్టంగా పట్టుకున్నాడు. ‘కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి/స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు’ అని దళితుడి చేత చెప్పించాడు.
కులవ్యవస్థ కారణంగా దేశాన్ని విమర్శించినప్పటికీ, తన దేశప్రేమను జాషువా దాచుకోలేదు. బుద్ధుడినీ, గాంధీనీ, అంబేడ్కర్నూ ప్రేమిస్తూ పద్యాలు రాశాడు. నేతాజీ, శివాజీల మీద కావ్యాలు రాశాడు. దేశ స్వాతంత్య్ర అవసరాన్ని ఆకాంక్షించాడు. ‘స్వీయ రథము’ వస్తుంది కనుక వెరపు వలదని తన జనానికి ధైర్యం చెప్పాడు. దళితుల్ని అగ్రకులస్తులు పీడించటాన్ని విమర్శించి ఊరుకోకుండా దళితుల్లో సఖ్యత లేనితనాన్ని కూడా ఎద్దేవా చేశాడు. 
‘వాని గుడిసె మీద వాలిన కాకి నా గుడిసె మీద వాలగూడదెప్పుడు
కాకులందు మాలకాకి మాదిగ కాకి
రూఢిసేయు మా విరోధములను’
అంటూ మాలమాదిగల విభేదాల్ని బయటపెట్టాడు. ‘దేవుడొక్కడు మాకు దేవళంబులు రెండు/ దేశమొకటి మాకు తెగలు రెండు’ అంటూ విమర్శించాడు. స్వతంత్ర భారతం దళితులకు రాజ్యాధికార భాగాన్ని తీసుకువస్తుందని విశ్వాసం వెలిబుచ్చాడు.
‘వెరపు వలదు నీకు హరిజన సోదరా
స్వీయ రథము వెడలి వచ్చె
లాగికొమ్ము నీకు భాగంబు కలదంచు
పాడుచుండె రత్న భరతమాత’
ఇలా ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించాడు. తన తరవాత రాబోయే దళిత కవులకు మార్గం చూపాడు.
కులమతాల విమర్శతోనూ వేదనతోనూ ఆగిపోకుండా స్త్రీల పీడననూ ఎత్తిచూపాడు. స్త్రీలకు ‘ఎదిరింప జాలని చిలుకల చదువు నేర్పి’ బానిసలుగా పడుండే స్థితిని తెచ్చిన పురుష స్వామ్యాన్ని గట్టిగా ఎండగట్టాడు. శ్మశానం మీద రాసిన పద్యాలతో మానవ జీవితాన్నీ, మరణాన్నీ తాత్వీకరించాడు. ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ లాంటి బలమైన భావాల్ని శ్మశానానికి ఆపాదించాడు. పలనాటిని ప్రస్తావిస్తూ, ‘గడ్డి మొలిచెను పులి చారల గద్దెమీద’ అంటాడు. ఇంత గంభీర కవిత్వం రాస్తూనే, మరొకపక్క జీవితంలోని అందాల్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కవిత్వంలో సున్నితంగా ప్రతిభావంతంగా పండించాడు. గిజిగాడినుద్దేశించి– 
‘తేలిక గడ్డిపోచలను దెచ్చి రచించెదవీవు 
తూగుటుయ్యేల గృహంబు మానవుల కెరీకి సాధ్యము కాదు’
అంటాడొకచోట. పసి బాలుడ్ని ‘గానమాలింపక కన్నుమూయని రాజు/అమ్మ కౌగిటి పంజరమ్ము చిలక’ అని అద్భుతంగా వర్ణిస్తాడు. 
ఇంత గొప్పగా  జీవితంలోని  పలు పార్శా్వలను పదునైన వ్యక్తీకరణతో సాధికారికంగా, సజీవంగా చిత్రించాడు జాషువా. నిండైన కవిగా పరిణమించాడు. అతి సామాన్యమైన మాటలూ, అంతకు ముందు కవులెవ్వరూ వాడని పదాలూ, పదబంధాలూ, నిత్యం జనం వాడుకలో ఉన్న పలుకుబడీ ప్రయోగించి కవిత్వానికి సరికొత్త జీవశక్తిని ప్రసాదించాడు. అవమానించిన వారినుంచే అభినందనలు పొందాడు. రాసింది పద్యాలైనప్పటికీ వాటిలో   ఆధునిక కవితా వ్యూహాల్ని ప్రదర్శించి అబ్బురపరిచాడు. చదువరుల్ని మంత్రముగ్ధు్దల్ని చేసే వ్యక్తీకరణను సాధించగలిగాడు.
జాషువా సృజించిన కవిత్వాన్ని మొత్తంగా చూసినప్పుడు, ఆయన ప్రత్యామ్నాయ కవే కాదు పరిపూర్ణ కవి కూడా అనిపిస్తాడు. రవీంద్రనా«థ్‌ టాగూర్‌లా, సుబ్రమణ్య భారతిలా జాతీయ స్థాయి కవని అనిపిస్తాడు. తెలుగు జనం, తెలుగు కవిత్వం గర్వించదగ్గ కవి శిఖరం జాషువా. 
-జి.లక్ష్మీనరసయ్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement