పిల్లల సక్రమ ఎదుగుదలకు సరైన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం కంటే జంక్‌ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. పోనీలే కదా అని తల్లిదండ్రులు చూసీ చూడనట్లు వదిలేస్తే పిల్లల ఆరోగ్యానికి అది చాలా హానికరం. అందువల్ల పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా నిరోధించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుందాం.
ముందుగా మనం ఒక విషయాన్ని నమ్మి తీరాలి. అదేమిటంటే మనం అంటే తల్లిదండ్రులు దేనిని ఆచరిస్తారో, పిల్లలు దానినే అనుసరిస్తారు. అంటే పెద్దవాళ్లు స్విగ్గీ, జొమాటోల్లో స్పైసీ ఫుడ్‌ను ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుని వాళ్ల కళ్లముందే లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే ఆటోమేటిగ్గా పిల్లలు కూడా అదే బాట పడతారు. అందువల్ల ముందుగా పెద్దవాళ్లకు గనక బయటి తిండి తినే అలవాటుంటే దానిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం బెటర్. చక్కగా ఇంట్లోనే చేసుకుని తింటూ ఉంటే పిల్లలు కూడా ఇంట్లో అమ్మ చేతి వంట తినడానికే మొగ్గు చూపిస్తారు.
►భలే చెప్పారులే, అలా ఇంట్లోనే తింటూ ఉంటే లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ తయారు చేసే కంపెనీలు దివాలా తీయవా? అని అడగొచ్చు కానీ అంతకంటే ముందు మన బడ్జెట్టు బజ్జీ అవడం, ఆ తర్వాత ఒళ్లు గుల్ల అవడం ఖాయం. అందువల్ల అలాంటి వాటిని తినడాన్ని వారానికో, పదిరోజులకో ఒకసారికి పరిమితం చేయడం ఉత్తమం.
►ఒకవేళ పిల్లలు పిజ్జా బర్గర్లు, నూడుల్స్ తప్ప తినేది లేదని మారాం చేస్తుంటే మాత్రం వాటిలో కూరగాయలను మిక్స్ చేయడం ద్వారా వారికి ఇష్టమైన ఆహారాన్ని కూడా హెల్తీగా మార్చుకోవచ్చు. దీంతో పిల్లలు కూడా ఇంటి ఆహారాన్ని ఎంజాయ్ చేసి బయటివి తినడం తగ్గించుకుంటారు.
►పిల్లలు చాలా త్వరగా అందమైన, రంగురంగుల వస్తువుల వైపు ఆకర్షితులవుతారు. అటువంటి పరిస్థితులలో, చిరుతిండిలో కూడా మీరు పిల్లలకు వివిధ రంగుల పండ్లను అలంకరించవచ్చు. దీనితో పాటు ప్లేట్‌లో అందంగా అలంకరించిన రంగురంగుల ఫ్రూట్ చాట్ కూడా పిల్లలకు నచ్చుతుంది.
►ఆరోగ్యంగానే తినడాన్ని అలవాటు చేయండి పిల్లలకు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలు జంక్ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. అందువల్ల, 3–4 సంవత్సరాల వయస్సు నుంచే పిల్లల ఆహారపుటలవాట్లను సరిచేయడం అవసరం. ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉండటం వల్ల వారికి కడుపు నిండి జంక్‌ఫుడ్ తినాలని పట్టుబట్టరు.
Comments
Please login to add a commentAdd a comment