మిద్దె తోటలు, చిన్న చిన్న బాల్కనీలోనే మొక్కల్ని పెంచడం ఇపుడు సర్వ సాధారణంగా మారింది. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు పచ్చని ఆకులు, పువ్వులతో కళ కళలాడుతూ ఉండే మొక్కలు, మనం కుండీలలోకి మార్చగానే పెద్దగా పూయవు. సరికదా ఎదుగుదల లేకుండా, ఉండిపోతాయి. ఇలా ఎందుకు ఉంటాయో తెలుసా? వాటికి సరైన పోషణ లేక పోవడమే ముఖ్య కారణం. మరి పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, మన ఇంట్లోనే సులభంగా దొరికే వాటితో చక్కటి ఎరువును తయారు చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం.
ఎలాంటి మొక్క అయినా దాని సహజ లక్షణం ప్రకారం పువ్వులు పూయాలన్నా,కాయలు కాయాలన్నా తగిన ఎండ, నీటితోపాటు పోషకాలు కూడా కావాలి. పొటాషియం,ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం పోషకాలు మొక్కల పునరుత్పత్తి సామర్థ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సందర్భంగా అరటి తొక్కల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి.
అరటి తొక్కల్లో ఇవన్నీ లభిస్తాయి. బనానా పీల్ ఫెర్టిలైజర్ ద్వారా మొక్కల్లో పూలు, పండ్లు ఎక్కువగా రావడమే కాదు, పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయి. తొక్కల్లోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది.
ఎలా వాడాలి?
అరటి పండు తొక్కలను నేరుగా మొక్కల మధ్య మట్టిలో పాతిపెట్టవచ్చు. ఇది కొన్ని రోజులకు కుళ్లి, ఎరువుగా మారి మొక్కకు చక్కటి పోషకాన్ని అందిస్తుంది.
అరటి పండు తొక్కలను వేడి నీటిలో బాగా మరిగించి,చల్లారిన తరువాత ఈ టీని కుండీకి ఒక గ్లాసు చొప్పున అందించాలి. ఇలా చేస్తు గులాబీ మొక్కలు నాలుగు రోజులకే మొగ్గలు తొడుగుతాయి.
అరటి పళ్ల తొక్కలను ఒక బాటిల్‌వేసి, నీళ్లు పోసి, 24 గంటలు పులిసిన తరువాత, దీనికి కొద్దిగా నీళ్లు కలుపుకొని నేరుగా ఆ వాటర్‌ను మొక్కలకు పోయవచ్చు.
లేదంటే బనానా తొక్కల్ని బాగా ఎండబెట్టి, పొడిగా చేసుకుని నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు.
అరటి తొక్కలతో తయారు చేసిన ద్రావణం, టీ లేదా ఫెర్టిలైజర్‌ను ప్రతీ 4-6 వారాలకు మొక్కలకు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రపంచంలోనే అరటి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మనదేశంలో అరటిపండు వ్యర్థాలను వినియోగించుకుంటే రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. సహజమైన సూక్ష్మజీవుల చర్యలు జరిగి నేలకూడా సారవంతమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన మొక్కలు ,దీర్ఘకాలిక స్థిరమైన పర్యావరణ వ్యవస్థ మన సొంతమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment