సెలవుల్లో ఇలా ఎగిరిపోదామా? | Beautiful Places To Visit in 2021 Year | Sakshi
Sakshi News home page

సెలవుల్లో ఇలా ఎగిరిపోదామా?

Published Wed, Jan 6 2021 9:19 AM | Last Updated on Wed, Jan 6 2021 6:51 PM

Beautiful Places To Visit in 2021 Year - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మనిషి సోషల్‌ యానిమల్‌. మనసు ఫ్లయింగ్‌ బర్డ్‌! ఉండేందుకు ఒక చోటు లేకున్నా బతికేయొచ్చు. ఒకేచోట ఉండిపోతే... పంజరమే మానవజన్మ. 2020లో మానవపక్షులన్నీ నాలుగు గోడల మధ్యే ఉండిపోయాయి. 2021లో కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. బస్సెక్కి, రైలెక్కి, విమానమెక్కి.. నాలుగడుగులు వేస్తే ఎంత బాగుంటుంది! సెలవులున్నాయి. ఈవెంట్స్‌ ఉన్నాయి. బండి దిగొచ్చేవారి కోసం..పన్నెండు నెలలూ వేచి చూస్తున్నాయి.

రుతువులొచ్చాయి. మనిషి జాడ లేకనే వెళ్లిపోయాయి. ఎవరి కోసం పూయాలి? ఎవరి కోసం ‘కుహూ..’ మని కూయాలి? నిరుడంతా ప్రకృతికి నిరుత్సాహం. కరోనా కర్ర పట్టుకుని నిలుచుంటే బయటికేం వస్తాం? చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాడ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసాలు (పుష్య మాఘ పాల్గుణాల తర్వాతే కరోనా గృహ ప్రవేశం చేసింది), వసంత గ్రీష్మ వర్ష శరద్‌ హేమంతాలు (శిశిరం తర్వాతే కరోనా కుడికాలు పెట్టింది) మానవ స్పర్శ లేకనే నిష్క్రమించాయి. అప్పటికీ చైనా ధైర్యం చేసింది. శరత్‌ రుతువులో బయటికి వచ్చింది. ‘రివెంజ్‌ ట్రావెల్‌’ పేరుతో (కరోనాపై రివెంజ్‌) జాతీయ దినం అక్టోబర్‌ 1 నుంచి పది రోజులు నేషనల్‌ హాలిడే ప్రకటించుకుంది. ‘ప్రజలారా ఇళ్లలోంచి రండి. బయట విహరించండి. కరోనాను ధిక్కరించండి’ అని పిలుపునిచ్చింది. అప్పటి వరకు క్వారెంటైన్‌లతో, లాక్‌డౌన్‌లతో, రిస్ట్రిక్షన్‌లతో.. బయటి తిండి కోసం, బయట తిరగడం కోసం అలమటించి ఉన్నవారు కదా.. తక్షణం శృంఖలాలు తెంచుకున్నారు. పిల్లల్ని, ట్రావెల్‌ బ్యాగ్‌లను భుజాన వేసుకుని బయటికి వచ్చారు.

ఆ పది రోజుల్లో 55 కోట్ల మంది చైనావాళ్లు వాళ్ల దేశమంతటా విహంగాలై పర్యటించారు. ఆగస్టు నాటికి ఇండియాలో ‘తెగింపు’ వచ్చేసింది. ఒక బ్యాచ్‌ 70 రోజుల పాటు, 20 కి.మీ. దూరం ఢిల్లీ టు లండన్‌.. మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలెండ్, చెక్, జర్మనీ, బెల్జియం.. మొత్తం 18 దేశాల పర్యటనకు బయల్దేరింది! తైవాన్‌ రాజధాని తాయ్‌ పే లోనైతే జూలైలో సాంగ్షాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది. చెక్‌–ఇన్, పాస్‌ పోర్ట్‌ కంట్రోల్, సెక్యూరిటీ, బోర్డింగ్‌.. ప్రతి చోట.. విమానాలు బయలుదేరక ముందే ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కి లగేజ్‌లు, బ్యాగేజ్‌లు వేసుకొచ్చేశారు. ఫ్లయిట్‌ ఎక్కి కూర్చున్నారు. కాక్‌పిట్‌ నుంచి అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తే సీట్‌ బెల్ట్‌లు కూడా బిగించుకున్నారు. ఆ తర్వాత అసలు గాల్లోకే లెయ్యని విమానం నుంచి నిచ్చెన మీదుగా నేలపైకి ల్యాండ్‌ అయ్యారు! మిగతా ఫ్లయిట్స్‌ కూడా అంతే. అవి ఎక్కడికీ వెళ్లలేదు. కూర్చున్నవాళ్లే.. ఎక్కడికో వెళ్లొచ్చినట్లు విమానాలు దిగేశారు. అంటే అన్నీ ఫేక్‌ విమానాలు, ఫేక్‌ ప్రయాణ అనుభూతులు. ఏదో ఒకటిలే ఇల్లు కదిలితే చాలు ప్రజలు టికెట్లు కొనేశారు.  

కొత్త సంవత్సరం కొంచెం ‘నాన్‌–కరోనాటిక్‌’గా కనిపిస్తోంది. వ్యాక్సిన్‌లు కూడా వచ్చేశాయి. టూరిస్ట్‌ స్పాట్‌లను శుభ్రం చేసి రెడీగా ఉంచారు. గత ఏడాదంతా అలికిడే లేని పర్యాటక కేంద్రాలలో సందడి మొదలవుతోంది. ప్రయాణ ఆంక్షలు దాదాపుగా తొలగిపోయాయి. సెలవుల్ని చక్కగా ప్లాన్‌ చేసుకోవడమే ముందున్న కాలమంతా. ఈ న్యూ ఇయర్‌లో ఐదు రోజులే కదా గడిచింది. ముందింకా ఎన్నో రోజులు. ఎన్నో పండుగలు. తిలకించేందుకు ఎన్నో ప్రకృతి మహత్యాలు, సాంస్కృతిక వైభవాలు! వాటిని చూడడానికి ముందుగా.. ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయో, చూడవలసినవి ఏవి ఉన్నాయో చూద్దాం. చూడ్డమే ఈ ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి. 


ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌(అహమ్మదాబాద్‌) 

జనవరి
14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్‌ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. 
ఇవి చూడొచ్చు  :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌; బికనీర్, రాజస్థాన్‌లలో బికనీర్‌ కామెల్‌ ఫెయిర్‌ (జనవరి 12–13); శ్రీనగర్, జమ్ము–కశ్మీర్‌; ఉత్తరాఖండ్‌లోని ఆలీకి స్కీయింగ్‌ ట్రిప్, కచ్‌ గుజరాత్‌లో వైట్‌ డెజర్ట్‌. ఆ ఉప్పు ఎడారిని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. కళ్లు జిగేల్మంటాయి. 


జిరంగ నేషనల్‌ పార్క్‌ (అస్సాం)

ఫిబ్రవరి
13, 14 శని, ఆదివారాలు. 15 సెలవు పెడితే 16 వసంత పంచమి.
ఇవి చూడొచ్చు : ఎప్పుడూ పార్టీలు జరుగుతుండే గోవా, తాజ్‌మహల్‌ (ఆగ్రా), కజిరంగా నేషనల్‌ పార్క్‌ (అస్సాం), ఉదయ్‌పూర్, జైసల్మేర్, జో«ద్‌పూర్‌ (రాజస్థాన్‌), పురాతన నగరం వారణాసి; ఖజురహో–హెరిటేజ్‌ టూర్‌ (మధ్యప్రదేశ్‌).


బృందావనంలో హోలీ
మార్చి
11 మహా శివరాత్రి. 12 శుక్రవారం సెలవు పెడితే 13, 14 శని, ఆదివారాలు. 26 శుక్రవారం సెలవు పెడితే 27, 28 శని, ఆదివారాలు. 29 హోలీ. 
ఇవి చూడొచ్చు : హోలీకి బృందావనం (మధుర), ప్రకృతి దృశ్యాల కోసం ఊటీ, వన్యప్రాణుల కోసం రాజస్థాన్‌లోని రంథంబోర్, మానసిక సాంత్వన కోసం సిక్కిం, యాత్రా స్థలంగానైతే మౌంట్‌ అబూ. చారిత్రక శిథిల కట్టడాలకు హంపీ.


గుల్‌మార్గ్‌ స్కీయింగ్‌ (కశ్మీర్‌)

ఏప్రిల్‌
2 గుడ్‌ ఫ్రైడే. 3, 4 శని, ఆదివారాలు. ఈ నెలలో ఇంతే. శని ఆదివారాలకు కలిసొచ్చేవి లేవు. 
ఇవి చూడొచ్చు : చల్లదనం కోసం జమ్ము–కశ్మీర్‌. పెంచ్‌ నేషనల్‌ పార్క్‌ (మధ్యప్రదేశ్‌), ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్‌ కోసం కొడైకెనాల్, స్కీయింగ్‌కి గుల్‌మార్గ్, వైన్‌ యార్డ్‌ చూడాలంటే నాసిక్‌. నీలాకాశ వీక్షణకు, బీచ్‌లకు లక్షద్వీపాలు, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్‌. 


ధర్మశాలలో క్రికెట్‌ స్టేడియం
 

మే
13 ఈదుల్‌ ఫిత్ర్‌. 14 సెలవు పెడితే 15, 16 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు :రిషికేశ్, ముస్సోరి (ఉత్తరాఖండ్‌), కొడైకెనాల్‌ (తమిళనాడు), స్పితీ వ్యాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌), కాలింపాంగ్‌ (పశ్చిమ బెంగాల్‌), వేయనాడ్‌ (కేరళ), ధర్మశాల (హిమాచల్‌ ప్రదేశ్‌)


అల్మోరా, ఉత్తరాఖండ్‌

జూన్‌
జూన్‌లో శని, ఆది వారాలకు కలిసొచ్చే సెలవు రోజులు లేవు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్‌ 2 ఈ ఏడాది బుధవారం వచ్చింది. ఇక వేళ రెండు మూడు రోజులు సెలవు దొరికితే..
ఇవి చూడొచ్చు : చిక్‌మగళూర్‌ (కర్ణాటక), లడఖ్, అండమాన్‌; గాంగ్‌టక్‌ (సిక్కిం), అల్మోరా (ఉత్తరాఖండ్‌). ఈ నెలలో ఈ ప్రదేశాలలోని వాతావరణం సమ శీతల ఉష్ణస్థితిలో ఆహ్లాదంగా ఉంటుంది. 


వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ (ఉత్తరాఖండ్‌)

జూలై
10, 11 శని, ఆదివారాలయ్యాయి. 12 రథయాత్ర. 17, 18 శని, ఆదివారాలు. 19 సెలవు పెడితే 20 బక్రీద్‌. 
ఇవి చూడొచ్చు : పూరి రథయాత్ర (ఒడిశా), వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ నేషనల్‌ పార్క్‌ (ఉత్తరాఖండ్‌), శివస్థలి అమర్‌నాథ్‌. 


 మౌంట్‌ అబు (రాజస్థాన్‌)

ఆగస్ట్‌ 
28, 29 శని, ఆదివారాలు. 30 జన్మాష్టమి. 
ఇవి చూడొచ్చు :  జన్మాష్టమి ఉత్సవాల కోసం బృందావనం, కూనూరు (తమిళనాడు), చిరపుంజీ (మేఘాలయ), జిమ్‌ కార్బెట్‌ (ఉత్తరాఖండ్‌), మౌంట్‌ అబూ (రాజస్థాన్‌)


హర్మందిర్‌ సాహిబ్‌ (అమృత్‌సర్‌)

సెప్టెంబర్‌
10 వినాయక చవితి. 11, 12 శని, ఆదివారాలు. 
ఇవి చూడొచ్చు: అమృత్‌సర్, కేరళ, శ్రీనగర్, కూర్గ్, పాండిచ్చేరి, ముంబై, మహాబలేశ్వర్, గుజరాత్‌లోని విల్సన్‌ హిల్స్‌. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖంలో ఉండి, వాతావరణం తడిపొడి సమ్మేళనంగా ఉల్లాసభరితంగా ఉంటుంది కనుక పర్యాటనకు అనువైన ప్రదేశాలలో ఇవి కొన్ని. 


కులు దసరా సంబరాలు
 

అక్టోబర్‌
15 దసరా. 16, 17 శని, ఆదివారాలు.  
ఇవి చూడొచ్చు :దసరా సంబరాలకు కులు (హిమాచల్‌ ప్రదేశ్‌), రివర్‌ రాఫ్టింగ్‌కి రిషికేశ్, దుర్గాపూజకు కోల్‌కతా, వన్యప్రాణి వైవిధ్య వీక్షణకు మానస్‌ నేషనల్‌ పార్క్‌ (అస్సాం), జాపపద సంస్కృతుల కోసం జో«ద్‌పూర్‌; మైసూరు.


భరత్‌పూర్‌ (రాజస్థాన్‌) పక్షుల ఆవాసం
 

నవంబర్‌
19 గురు నానక్‌ జయంతి. 20, 21 శని, ఆదివారాలు
ఇవి చూడొచ్చు : ఫుష్కరోత్సవాలు (రాజస్థాన్‌), నైట్‌ లైఫ్‌ కోసం గోవా, పక్షుల్ని చూడటానికి భరత్‌పూర్‌ (రాజస్థాన్‌); రాయల్‌ బెంగాల్‌ టైగర్‌లను చూడ్డానికి సుందర్‌బాన్‌ (పశ్చిమ బెంగాల్‌), మంచుకొండల కోసం మనాలీ (హిమాచల్‌ ప్రదేశ్‌)


కబిని అభయారణ్యం (కర్ణాటక)

డిసెంబర్
24 సెలవు పెడితే 25 క్రిస్మస్, 26 ఆదివారం.
ఇవి చూడొచ్చు  : కబిని వన్యప్రాణి అభయారణ్యం (కర్ణాటక), స్కీయింగ్‌కి ఆలీ (ఉత్తరాఖండ్‌), కచ్‌ (గుజరాత్‌).  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement