ఈ బుట్టలు.. బ్యాగులు వెదురుతో అల్లినవనుకుంటున్నారా? గుర్రపుడెక్కతో తయారైనవి అంటే నమ్ముతారా? ఈ కళను వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ అంటున్నారు! ఆంధ్రప్రదేశ్ బందరు దగ్గర్లోని చిన్నాపురంలో ఈ మధ్య జరిగిన హ్యాండీక్రాఫ్ట్స్ శిక్షణ శిబిరం గురించి తెలిసినవాళ్లకు ఇది పరిచయమయ్యే ఉంటుంది. తెలియని వాళ్ల కోసం ఈ పరిచయం..
యిర్రింకి ఉమామహేశ్వరరావు, అమరావతి
వర్షాకాలం వస్తే చాలు డ్రెయిన్లు, కాలువల్లో దట్టంగా అల్లుకుపోయి.. నీటి ప్రవాహానికి అడ్డుపడి మహా చిక్కులు తెచ్చిపెడుతుందీ గుర్రపుడెక్క. రైతుల పాలిట శాపంగా మారుతోందీ కలుపు. దాన్ని తొలగించి గట్టున పడేసినా నీటి చుక్క తగిలితే చాలు ఎండిపోయింది కూడా ప్రాణం పోసుకుని పదిహేను రోజుల్లోనే అడవిలా అల్లుకుపోతుంది. దాంతో గత్యంతరం లేక దానిమీద పురుగుమందును పిచికారీ చేస్తున్నారు. ఆ రసాయనాలు కలిసిన కాలువల్లోని నీటినే చేపల చెరువులు, చేలకు పెడుతుండటంతో చేపలు చనిపోతున్నాయి, పంట విషతుల్యమవుతోంది.
అందుకే దీన్ని పర్యావరణహితంగా ఎలా మార్చుకోవచ్చో ఆలోచించి, పరిశోధించి.. అద్భుతమైన ఫలితాలను సాధించారు అసోమ్‌కు చెందిన రీటా దాస్. ఆ రిజల్టే ఈ బుట్టలు, బ్యాగులు ఎట్‌సెట్రా! చిన్నాపురం ట్రైనింగ్ క్యాంప్‌లో శిక్షణనిచ్చింది రీటానే! తన స్వస్థలమైన అసోమ్‌లో కూడా గుర్రపుడెక్క సమస్య తీవ్రమే! రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దీన్ని.. జ్యూట్‌లా హ్యాండీక్రాఫ్ట్ మెటీరియల్‌గా మలచొచ్చేమో అని ఆలోచించారు. గుర్రపుడెక్కను కాండంతో సహా సేకరించి, పదిరోజులపాటు ఎండబెట్టి, తర్వాత చిన్నపాటి యంత్రాల సహాయంతో దాన్ని ప్రాసెస్ చేసి.. అల్లికలకు అనువుగా తయారుచేశారు. ముందు ఓ మ్యాట్‌ని అల్లి చూశారు. బ్రహ్మాండంగా వచ్చింది.
అంతే రీటాకు నమ్మకం వచ్చింది.. గుర్రపుడెక్కతో చక్కగా హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేయొచ్చని! డోర్ మ్యాట్‌లు, టేబుల్ మ్యాట్‌లు, బ్యాగులు, బుట్టలు, టోపీలు తయారుచేసి మార్కెట్లో పెట్టారు. మంచి గిరాకీ కనపడింది. దాంతో ఇది చక్కటి ఉపాధి మార్గం కానుందని గ్రహించారు. ఆసక్తిగల వారికి శిక్షణనివ్వడం ప్రారంభించారు. ఇలా గుర్రపుడెక్క ఆదాయవనరుగా మారి, రైతుల సమస్యా తీరుతోంది, పర్యావరణానికి మేలూ జరుగుతోంది.
వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ గురించి తెలుసుకున్న తమిళనాడు.. రీటాతో తమ రాష్ట్రంలోనూ శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసింది. ఈ కళ ఇప్పుడు అసోమ్, తమిళనాడు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ గుర్రపుడెక్క సమస్య ఉండటంతో చిన్నాపురంలో వాటర్ హాయసింత్ క్రాఫ్ట్ మీద రీటా రెండునెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు.
ఆహారంగా..
అంటార్కిటికా మినహా ప్రపంచమంతా వ్యాప్తి చెందిన నీటి మొక్క గుర్రపుడెక్క. ఇందులో నాలుగు రకాలున్నాయి. ఒకదానితో ఒకటి అల్లుకుపోయి గుంపుగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీన్ని వియత్నాం, తైవా¯Œ వంటి దేశాల్లో అప్పుడప్పుడు సాలడ్‌గా తింటారు. గుర్రపుడెక్కను బయోగ్యాస్‌గా, నీటి శుద్ధికి, ఎరువుల ఉత్పత్తికి ఉపయోగించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే ప్రపంచంలో అతిపెద్ద సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment