రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి దారితీసే ప్రధాన కారకాల్లో చక్కెర ఒకటి. అందుకే మధుమేహులు తాము తినే ఆహారాల్లో ఎంత చక్కెర ఉందని చెక్ చేస్తుంటారు. అయితే ఒక్క చక్కెర మాత్రమే కాదు.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరిగేందుకు దారి తీసే పదార్థాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే ఈ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్యాక్ చేసిన స్నాక్స్: ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా డయాబెటీస్‌కు దారితీస్తాయి. ఎందుకంటే వీటిని శుద్ధి చేసిన పిండితో తయారు చేయడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయులను వేగంగా పెంచుతాయి. అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా ఉండటం మేలు. అంతగా తినాలనిపిస్తే.. వీటికి బదులుగా గింజలు లేదా మొలకలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్: పండ్లలో ఎక్కువ మొత్తంలో తీపి ఉంటుంది. ఎండిన పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండు ద్రాక్షల్లో 115 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది మామూలు ద్రాక్షలో కంటే చాలా ఎక్కువ. ఒకవేళ ఎండు పండ్లను తినాలనుకుంటే చక్కెర తక్కువగా ఉండే
పండ్లను తినడం మంచిది.
ఆల్కహాల్ పానీయాలు: ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెరతోపాటు పిండిపదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు బీర్, వైన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని నిపుణుల సలహా. మధుమేహులు ఆల్కహాలిక్ పానీయాలు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయి.
పండ్ల రసం: పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా. పండ్ల రసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పండ్ల రసాలలో బయటినుంచి కలిపే చక్కెర వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అమాంతం పెరుగుతాయి. అందువల్ల పండ్లరసాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..వీటిని తగిన మోతాదులోనే తీసుకోవడం మంచిది.
వేపుళ్లు: వేయించిన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందువల్ల ఈ ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. అలాగే కొవ్వులు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైంపడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి.
ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు: వైట్‌బ్రెడ్, పాస్తా, మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ధి చేసిన పిండితో తయారు చేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. పోషకాలు అసలే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయులు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను తినడం చాలా మంచిది.
Comments
Please login to add a commentAdd a comment