
ఉత్తరార్ధగోళంలో శీతకాలపు అత్యంత సుదీర్ఘరాత్రి డిసెంబర్ 21. చాలా పాశ్చాత్య దేశాల్లో ‘విటర్ సోల్‌స్టైస్’ వేడుకలు జరుపుకొంటారు. క్రిస్మస్‌కు నాలుగు రోజుల ముందు వచ్చే ఈ సుదీర్ఘరాత్రి సందర్భంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు చేసుకుంటారు. ఇంగ్లండ్‌లోని బ్రైటన్ రేవు పట్టణంలో మాత్రం ‘వింటర్ సోల్‌స్టైస్’ సందర్భంగా జనాలంతా సందడి సందడిగా బయలుదేరి వీథుల్లోకి వచ్చి మూకుమ్మడిగా గడియారాలను తగలేస్తారు.
వాళ్లు తగలేసేవి నిజం గడియారాలు కాదు లెండి. కాగితాలు, అట్టలతో చేసిన బొమ్మలాంతరు గడియారాలను కూడళ్లలో పోగుబెట్టి తగలేస్తారు. వీథుల్లో నృత్య గానాలతో భారీ ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపు పొడవునా బాణసంచా కాల్పులు జరుపుతారు. ‘బర్నింగ్ ది క్లాక్స్’ పేరుతో జరిపే ఈ వేడుక వెనుక పురాతన సంప్రదాయమేదీ లేదు. ముప్పయ్యేళ్లుగా మాత్రమే ఈ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది.
తొలిసారిగా 1993లో ఈ వేడుకలు జరిగాయి. అప్పటి నుంచి బ్రైటన్ ప్రజలకు ఇదొక ఆనవాయితీగా మారింది. సహకార ఉద్యమానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘సేమ్ స్కై’ అనే కళాకారుల బృందం ఈ ‘బర్నింగ్ ది క్లాక్స్’ వేడుకలను ప్రారంభించింది.
ఈ వేడుకలను తిలకించడానికి ఇంగ్లండ్ నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో జనాలు బ్రైటన్‌కు చేరుకుంటారు. గడచిన ముప్పయ్యేళ్లలో ఈ వేడుకలు మూడుసార్లు మాత్రమే రద్దయ్యాయి. తొలిసారి 2009లో హిమపాతం కారణంగా రద్దయితే, తర్వాత 2020, 2021లో ‘కోవిడ్’ కారణంగా ఈ వేడుకలు జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment