అమె అతి చిన్న వయసులో బోయింగ్ –777 నడిపింది. తోడుగా నలుగురు మహిళా కెప్టెన్లను తీసుకొని కమాండింగ్ ఆఫీసర్‌గా ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఎగరేసి శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరు చేరుకుంది. ఇంతకాలం జోయా అగర్వాల్ ఘనతలు తెలుసు. ఆమె జీవితం తెలియదు. పైలెట్ కావడానికి తాను ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందో చెప్పి ‘ఎనిమిదేళ్ల వయసులోనే నేను ఈ కలను కని సాధించుకున్నాను’ అందామె. ఆమె స్ఫూర్తి గాథ ఇది.
జోయా గురించి ఏం చెప్పాలి? కోవిడ్ మొదలయ్యాక ప్రభుత్వం తలపెట్టిన ‘వందే భారత్ మిషన్’లో ఒక మహిళా పైలెట్‌గా పాల్గొని ఎయిర్ ఇండియా విమానాలను ఎగరేసి 12 దేశాల నుంచి 64 ట్రిప్పులు వేసి దాదాపు 15000 మంది భారతీయులను స్వదేశం చేర్చింది ఆమె. 2021 జనవరి నెలలో మరో నలుగురు మహిళా పైలెట్లతో కలిసి ఎయిర్ ఇండియా విమానం ముఖ్య పైలెట్‌గా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకూ ఉత్తర ధ్రువం మీదుగా (ఆ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల వరకూ ఉంటుంది) 17 గంటలు ఏకధాటిగా నడిపి రికార్డు సృష్టించిందామె. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే జోయా అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలు పంచుకుంది.
ఢిల్లీ ఆకాశంలో
ఆకాశంలో ఎగిరే విమానాన్ని అందరూ చూస్తారు. కాని ఆ విమానం వీపున ఎక్కి ప్రపంచాన్ని చుట్టాలని కొందరే కలలు గంటారు. ఢిల్లీకి చెందిన జోయ చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు చూసేది. అప్పుడు ఆమెకు 8 ఏళ్ల వయసు. ‘ఆ విమానంలో నేను ఉంటే చుక్కలను చుట్టేద్దును కదా’ అని అనుకునేది. ఆ సమయంలోనే దూరదర్శన్‌లో రాజీవ్ గాంధీ కనిపించేవారు. ఎవరి మాటల్లోనో రాజీవ్ గాంధీ గతంలో పైలెట్‌గా పని చేశారని వింది జోయ. అప్పుడు ఆమెకు అనిపించింది తాను కూడా పైలెట్ కావాలని. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. అలాంటి కుటుంబంలో ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనకూడదని సమాజం అనుకుంటుంది. కాని జోయకు లెక్కలేదు. తానొక కల కంది. దానిని నిరూపించుకుంటుంది అంతే.
పది తర్వాత
పదోక్లాసు వరకూ ఎలాగో తన మనసులోని కోరికను ఉగ్గపట్టుకున్న జోయ పది రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన మనసులోని కోరిక తల్లిదండ్రులకు చెప్పింది. ‘ఓరి దేవుడో... డిగ్రీ చేయించి ఏదో ఒక మంచి ఇంట్లో పెళ్లి చేద్దామంటే ఈ అమ్మాయికి ఇదేం కోరిక’ అని తల్లి ముక్కు చీదడం మొదలెట్టింది. తండ్రి ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని ఆందోళన చెందాడు. జోయ మరో దారిలేక ఇంటర్‌లో చేరింది. మంచి మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ చేస్తూ మరోవైపు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఏవియేషన్ కోర్సు చేసింది. అంటే తల్లిదండ్రుల కోసం డిగ్రీ... తన కోసం ఏవియేషన్. డిగ్రీలో కూడా మంచి మార్కులు వచ్చాక ‘నన్ను ఇప్పటికైనా పైలెట్‌ను కానివ్వండి’ అని తల్లిదండ్రులను కోరింది. తండ్రి అప్పుడు కూడ భయం భయంగానే లోను తెచ్చి ఆమె పైలెట్ కోర్సుకు డబ్బు కట్టాడు. మనసంతా పెట్టి ఆ కోర్సు పూర్తి చేసింది జోయ.
3000 మందితో పోటీ పడి
పైలెట్ చదువు పూర్తయ్యాక రెండేళ్లు ఖాళీగా ఉన్న జోయ ఎయిర్ ఇండియాలో 7 పైలెట్ పోస్టులు పడ్డాయని తెలిసి ఎగిరి గంతేసింది. అయితే ఆ 7 పోస్టుల కోసం 3000 మంది దరఖాస్తు చేశారని తెలిసి కంగారుపడినా పట్టుదలగా ప్రయత్నించింది. ముంబైలో వారంలో పరీక్ష అనగా తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తండ్రి ప్రోత్సాహంతో పరీక్షకు హాజరై ఇంటర్వ్యూలు దాటి ఆపాయింట్‌మెంట్ లెటర్ సాధించింది. 2004లో తన మొదటి ఫ్లయిట్‌ను దుబాయ్‌కు నడిపింది. ‘ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. నాన్న చేసిన అప్పులు తీర్చేశాను. అమ్మకు డైమండ్ కమ్మలు తెచ్చి పెట్టాను’ అంటుంది జోయ. ఆమె బోయింగ్ – 777ను నడిపిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది కూడా.
స్త్రీల ప్రపంచం
‘నేను పైలెట్ అయినప్పుడు కోర్సులో చదువు చెప్పేవారు, ఉద్యోగంలో సహ ఉద్యోగులు అందరూ పురుషులే. మహిళా పైలెట్‌లు వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉండేవారు. స్త్రీలు తమ సమర్థతను చాటుకునేందుకు చాలా ఘర్షణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాని ప్రయత్నిస్తే ఆ ఘర్షణకు ఆవల విజయం ఉంటుంది. నేను ఎప్పుడూ నా హృదయం చెప్పినట్టే వింటాను. నాకేదైనా సవాలు ఎదురైనప్పుడు 8 ఏళ్ల వయసు లో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది కదా... ఇప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటాను అనుకుని ముందుకు సాగుతాను.’ అంటుంది జోయ.
‘స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అనుకునే సమాజం ఇంకా మన దేశంలో ఉంది. కాని స్త్రీలు తమ హృదయం చెప్పినట్టు విని తాము దేనికైతే సమర్థులో ఆ సమర్థత చాటుకోవాలి. వారే కాదు ప్రతి ఒక్కరూ తమదైన కలను కని సాధించుకోవాలి’ అంటుంది జోయ. ఢిల్లీలో డాబా ఎక్కి విమానం చూసిన 8 ఏళ్ల చిన్నారి ఒకనాడు సుదీర్ఘమైన విమానయానం చేసి రికార్డు సృష్టించడాన్ని మించిన స్ఫూర్తిగాథ ఉందా. అలాంటి గాథలకు ఉదాహరణలుగా మనమెందుకు నిలవకూడదు?
Comments
Please login to add a commentAdd a comment