బోయింగ్ ట్రిపుల్ సెవన్! భారీ గగన విహంగం. కమర్షియల్ జెట్. లోపల ఉండేవి 238 సీట్లు. అన్నీ ఫుల్ అయ్యాయి. ఆదివారం అమెరికాలో బయల్దేరింది! ఎప్పుడూ వచ్చే మామూలు మార్గంలో కాదు. క్లైమేట్ మూడ్ ఎలా ఉంటుందో ఊహకైనా అందని ఉత్తర ధ్రువం మీదుగా అంతమందినీ మోసుకుంటూ బెంగళూరు బయల్దేరింది. ఇక్కడ దిగే టైమ్ సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు. కెంపెగౌడ విమానాశ్రయంలో! ఆ బోయింగ్ కాక్‌పిట్‌లో ఎవరున్నారో తెలుసా? కెప్టెన్ జోయా అగర్వాల్. అతి చిన్న వయసులో బోయింగ్ నడిపిన మహిళా పైలట్! కాక్‌పిట్‌లో ఆమె పక్కన ఎవరున్నారో తెలుసా? కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష, కెప్టెన్ శివాని. అంతా మహిళా పైలట్‌లే ఉన్న ఈ బోయింగ్ 777 చరిత్రాత్మక ప్రయాణం.. మహిళలు సృష్టించిన
ఒక గ‘ఘన’చరిత్ర
ఎయిర్ ఇండియా కెప్టెన్ జోయా అగర్వాల్ తన కెరీర్‌ను ఏళ్లలో కాక ‘ఫ్లయింగ్ అవర్స్’లో చెప్పుకోడానికే ఇష్టపడతారు! ఇప్పటివరకు ఎనిమిది వేల గంటలకు పైగా గగనతలంలో విమానాన్ని నడిపారు ఆమె. నేడిక ఆమె కెరీర్‌కు మరో 17 గంటలు తోడవుతాయి. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ఉత్తర ధ్రువం మీదుగా 16 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు పట్టే సమయమే ఈ పదిహేడు గంటలు. గంటకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల వేగంతో సాగే ఈ బోయింగ్ విమానంలోని కాక్‌పిట్‌లో ఉన్నవారంతా మహిళలే కావడం విశేషం. నిజానికి జోయా ఇలాంటి చరిత్రను ఒకదాన్ని సృష్టించేందుకు చాలాకాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ‘‘రేపటికల్లా మేమంతా అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఉంటాం. ఆ ఆలోచనే నాకెంతో ఉద్వేగాన్ని కలిగిస్తోంది’’ అని శాన్‌ఫ్రాన్సిస్కో లో టేకాఫ్‌కి కొద్ది గంటల ముందు తనను కలిసిన ఒక జాతీయ టీవీ ఛానెల్ ప్రతినిధితో అన్నారు జోయా అగర్వాల్. అతి చిన్న వయసులో బోయింగ్ విమానాన్ని నడిపిన రికార్డు ఒకటి ఇప్పటికే ఆమె పేరు మీద ఉంది. బోయింగ్ నడపడం తేలికేమీ కాదు. స్కూటీ నడిపే చేతులు మలుపుల దారిలో ఒక పొడవాటి భారీ వాహనాన్ని తిప్పుతూ నడపడమే. నిన్న బయల్దేరిన బోయింగ్ 777 కాక్‌పిట్‌లో జోయాతో పాటు కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష, కెప్టెన్ శివాని ఉన్నారు.
వారితోపాటు ఫ్లయిట్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నివేదిత భాసిన్ కూడా. లోపల రెండు వందల మందికి పైగా ప్రయాణికులు. నిజానికి ఈ అరుదైన అవకాశం (జోయా మాటల్లో అద్భుతమైన అవకాశం) గత ఏడాదే వచ్చినా, వాతావరణం అనుకూలించక వాయిదా పడింది! ‘‘మా పైలట్‌లలో చాలామందికి ఇదొక కల. పైగా తొలిసారి అందరం మహిళలమే ప్రయాణిస్తున్నాం. నాన్–స్టాప్ జర్నీ. మా స్వప్నాలను సాకారం చేసే ‘గాడ్‌స్పీడ్’ జర్నీ. భరతమాత పుత్రికలం యూఎస్‌లోని సిలికాన్ వ్యాలీలో పైకి లేచి, ఇండియాలోని సిలికాన్ వ్యాలీలో కిందికి దిగుతున్నాం’’ అని జోయా ఉత్సాహంగా అన్నారు. బోయింగ్‌ల వంటి అల్ట్రా–లాంగ్–హాల్ ఫ్లయిట్స్ ఇప్పటివరకు అట్లాంటిక్ సముద్రం మీదుగా వెళ్లడం, తిరిగి రావడం; పసిఫిక్ మీదుగా ప్రయాణించడం, వెనక్కు వచ్చేయడం.. ఇలా అక్కడక్కడే చక్కర్లు కొట్టినట్లుగా ఉండేది. ఇప్పుడీ జోయా టీమ్ ఉత్తర ధ్రువం మీదుగా వెళుతోంది.‘‘నార్త్ పోల్ మీదుగా ఆ చివర్నుంచి ఈ చివరకు వెళుతూ విమానంలోంచి ధ్రువ శిఖరాగ్రాన్ని చూడ్డానికి ఎంత గొప్ప అదృష్టం పట్టాలి! విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం అవుతుంది’’ అని జోయా తన సహ పైలట్‌లతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు.
ఆ సిలికాన్ వ్యాలీ శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఈ సిలికాన్ వ్యాలీ బెంగుళూరు చేరేందుకు ఉన్న అతి వేగవంతమైన మార్గంలోనే ఈ బృందం ప్రయాణిస్తున్నది. పదహారు వేల కి.మీ. దూరం. పదిహేడు గంటల సమయం. గ్లోబ్ మీద చూస్తే రెండు ప్రాంతాలూ ఒకదానికొకటి అభిముఖంగా ఉంటాయి. ఆ దారినే జోయా బృందం ఎంచుకుంది. దారి తిన్నగా ఉన్నప్పటికీ దారిలో వాతావరణం స్థిమితంగా ఉంటుందన్న భరోసా లేదు. అయినా.. అత్యాధునిక విమాన సాంకేతిక పరిజ్ఞానానికి మహిళా పైలట్‌ల ఆత్మవిశ్వాసమూ తోడైతే ఎంతటి ప్రతికూల గాలులైనా దారివ్వకుండా ఉంటాయా! జోయా నడుపుతున్న 777–200ఎల్ ఆర్ మోడల్ బోయింగ్ ఈ భూగోళం మీది ఏ రెండు ప్రాంతాలనైనా ఒకే ప్రయాణంలో కలపగల సామర్థ్యం కలది. దీనికన్నా ముందు జోయా బి–777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను పదేళ్ల వ్యవధిలో 2,500 ఫ్లయింగ్ అవర్స్ నడిపారు.
‘‘నేను ఎయిర్ ఇండియాలో చేరినప్పుడు అతి తక్కువ మంది మహిళా పైలట్‌లు ఉండేవారు. ప్రతి ఒక్కరు నన్ను చిన్నపిల్లలా చూసేవారు. అది మగవాళ్ల రాజ్యం అన్నట్లే ఉండేది. లేడీ పైలట్‌ని అని కాదు కానీ, నేను కష్టపడి పనిచేయాల్సి వచ్చేది. పైలట్ ఉద్యోగమే అంత. అత్యంత బాధ్యతతో కూడి ఉంటుంది’’ అంటారు జోయా. జోయా తను పైలట్ అవుతానని తొలిసారి అన్నప్పుడు అది విని ఆమె తల్లి భయంతో పెద్దగా ఏడ్చారట! 2013లో జోయా ఎయిర్ ఇండియా కెప్టెన్ అయినప్పుడు కూడా ఆమెకు కన్నీళ్లొచ్చాయట. అవి ఆనంద బాష్పాలేనని ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ‘‘పైలట్ అవ్వాలని అనుకునే అమ్మాయిలకు మీరు చెప్పేదేమైనా ఉందా?’’ అంటే.. ‘‘కలలు కనండి. సాధించండి. మిమ్మల్ని అడ్డుకునేదేమీ లేదు. సాధ్యం కాని స్వప్నమూ ఉండదు’’ అన్నారు జోయా అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment