గోబీ  మంచూరియా లాగిద్దామా.. | Cauliflower Different Variety Curries Making Special Story | Sakshi
Sakshi News home page

పూలను వండుదాం..

Published Sun, Oct 4 2020 10:00 AM | Last Updated on Sun, Oct 4 2020 10:08 AM

Cauliflower Different Variety Curries Making Special Story - Sakshi

క్యాలీ ఫ్లవర్‌ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులోకి రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. ఫైబర్‌ ఎక్కువగా ఉండే క్యాలీ ఫ‍్లవర్‌ ఆరోగ్య ప్రియుల పట్టికలో మొదటి వరుసలో ఉండాలి. ఈ ఫ్లవర్‌ ఫ్లేవర్స్‌ని ఎంజాయ్‌ చేయండి. 

► పాప్‌కార్న్‌ క్యాలీఫ్లవర్‌

కావలసినవి: పంచదార – 4 టీ స్పూన్లు; ఉప్పు – టీ స్పూను; కారం – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉల్లి పొడి – అర టీ స్పూను; వెల్లుల్లి పొడి – అర టీ స్పూను; క్యాలీఫ్లవర్‌ – చిన్న పువ్వు; కుకింగ్‌ స్ప్రే – తగినంత; (ఇందులో పదార్థాలు సూపర్‌ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి).

తయారీ:

  • ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌ దగ్గర వేడి చేసుకోవాలి
  • బేకింగ్‌ షీట్‌ మీద అల్యూమినియం ఫాయిల్‌ వేయాలి
  • ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి
  • క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి
  • బేకింగ్‌ షీట్‌ మీద క్యాలీ ఫ్లవర్‌ తరుగు పల్చగా పరవాలి
  • కుకింగ్‌ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి
  • కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి
  • సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి.

► ఆలూ గోబీ

కావలసినవి: నూనె – టేబుల్‌ స్పూను; జీలకర్ర – టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; అల్లం తురుము – టీ స్పూను; బంగాళ దుంపలు – 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద; ముక్కలుగా కట్‌ చేయాలి); పసుపు – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; క్యాలీఫ్లవర్‌ – చిన్నది (1); కొత్తిమీర తరుగు – టీ స్పూను.

తయారీ:

  • బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము వేసి వేయించాలి
  • బంగాళ దుంప ముక్కలు వేసి బాగా కలపాలి
  • పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు, ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి
  • క్యాలీ ఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి
  • మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి.

క్యాలీఫ్లవర్‌ ఆవకాయ

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ తరుగు – మూడు కప్పులు; ఆవాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; మెంతులు – అర టేబుల్‌ స్పూను; నిమ్మరసం – 2 టేబుల్‌ స్పూన్లు; కారం – 100 గ్రా.; నువ్వుపప్పు నూనె – పావు కేజీ; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; వెల్లుల్లి రెబ్బలు – 10.

తయారీ:

  • ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి
  • ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్‌ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి
  • తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి
  • బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్‌ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి)
  • బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి
  • ఆవాలను ఎండబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి
  • పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్‌ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి
  • ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి
  • నిమ్మరసం వేసి మరోమారు కలపాలి ∙తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి (ఫ్రిజ్‌లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది)
  • వేడివేడి అన్నంలో, కమ్మటి నెయ్యితో క్యాలీఫ్లవర్‌ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది.

 ఉల్లిపాయ క్యాలీఫ్లవర్‌ సూప్‌

కావలసినవి: రౌండ్‌ బ్రెడ్‌ – 1 స్లైసు; వెన్న – 2 టేబుల్‌ స్పూన్లు (కరిగించాలి)
సూప్‌ కోసం; ఉల్లి తరుగు – కప్పు; క్యాలీఫ్లవర్‌ తరుగు – కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2 (సన్నగా తరగాలి); బటర్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; మైదా పిండి – టేబుల్‌ స్పూను; ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్‌ స్టాక్‌) – 2 కప్పులు; పాలు – కప్పు (చిక్కటివి); కుంకుమ పువ్వు – చిటికెడు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – 2 టీ స్పూన్లు.

బ్రెడ్‌ బౌల్‌ తయారీ:

  • బ్రెడ్‌ పై భాగంలో గుండ్రంగా కట్‌ చేసి బౌల్‌ మాదిరి చేసుకోవాలి
  • కరిగించిన బటర్‌ను బ్రెడ్‌ లోపలి భాగమంతా పూతలా పూయాలి
  • అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్‌ చేసి, బ్రెడ్‌ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్‌ చేయాలి.

సూప్‌ తయారీ:

  • పాన్‌లో బటర్‌ లేదా ఆలివ్‌ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్ది సేపు వేయించాలి
  • ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్‌ తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
  • మైదా పిండి వేసి బాగా కలపాలి ∙వెజిటబుల్‌ స్టాక్‌ జత చేసి బాగా కలపాలి
  • పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్‌ బాగా చిక్కబడుతుంది
  • సూప్‌ను బ్రెడ్‌ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి. (బ్రెడ్‌ బౌల్స్‌ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్‌ సర్వ్‌ చేసుకోవచ్చు).

 క్యాలీఫ్లవర్‌ పరాఠా

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ – చిన్నది (1); పచ్చి మిర్చి ముద్ద – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; గోధుమపిండి – 3 కప్పులు.

తయారీ:

  • ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి
  • తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి
  • పెద్ద పాత్రలో గోధుమ పిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి)
  • పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి
  • ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి
  • కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి.


► క్యాలీ ఫ్లవర్‌ 65

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ – 1 (మీడియం సైజుది); కరివేపాకు – 3 రెమ్మలు; మైదా పిండి – 2 టేబుల్‌ స్పూన్లు; బియ్యప్పిండి – 1 టేబుల్‌ స్పూను; కార్న్‌ ఫ్లోర్‌ – 1 టేబుల్‌ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు; నూనె – వేయించటానికి తగినంత.

తయారీ:

  • ఒక పాత్రలో మైదా పిండి, బియ్యప్పిండి, కార్న్‌ ఫ్లోర్, మిరప కారం, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి
  • క్యాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి, చిన్న చిన్న ఫ్లవర్స్‌లా వచ్చేలా విడదీయాలి
  • ఒక పాత్రలో నీళ్లు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి కొద్దిగా వేడయ్యాక, విడదీసిన క్యాలీఫ్లవర్‌ను అందులో వేసి కొద్దిసేపు ఉడికించి తీసేసి, కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమానికి జత చేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, కొద్దికొద్దిగా తీసుకుంటూ నూనెలో వేసి బాగా వేగాక, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
  • కరివేపాకుతో అలంకరించి వేడివేడిగా సర్వ్‌ చేయాలి ∙అన్నం, చపాతీలలోకి మాత్రమే కాదు, స్నాక్‌లా తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

► క్యాలీ ఫ్లవర్‌ బోండా

కావలసినవి: క్యాలీ ఫ్లవర్‌ – అర కేజీ (చిన్న చిన్న పువ్వులుగా విడదీసుకోవాలి); సెనగ పిండి – పావు కేజీ; బియ్యప్పిండి – 50 గ్రా.; పచ్చి మిర్చి – 7; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు (పిండి కలుపుకోవటానికి); జీలకర్ర – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; బేకింగ్‌ సోడా – పావు టీ స్పూను; నీళ్లు – తగినన్ని; నూనె – వేయించడానికి తగినంత.

తయారీ:

  • పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
  • క్యాలీఫ్లవర్‌ తరుగును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీళ్లలో శుభ్రంగా కడిగి, మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, కొద్దిగా ఉడికించాలి
  • ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి
  • నూనె జత చేసి మరోమారు ఉండలు లేకుండా బాగా కలపాలి
  • తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి
  • మిరప కారం, పచ్చిమిర్చి + జీలకర్ర మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి
  • చివరగా కొత్తిమీర జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, అరగంటసేపు పక్కన ఉంచాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి ∙కలిపి ఉంచుకున్న పిండికి బేకింగ్‌ సోడా జత చేయాలి
  • కొద్దిగా ఉడికించుకున్న క్యాలీఫ్లవర్‌ ముక్కలను బొండాల మాదిరిగా పిండిలో ముంచుతూ నూనెలో వేయాలి
  • బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి సాస్, కెచప్, చట్నీలతో సర్వ్‌ చేయాలి.(నూనెలో వేయించినవి తిన్న తరవాత మజ్జిగ తాగితే మంచిది. నూనె పదార్థాలకు మజ్జిగ విరుగుడుగా పనిచేస్తుంది)

గోబీ  మంచూరియా

కావలసినవి: క్యాలీఫ్లవర్‌ – 1; మైదా పిండి – కప్పు; కార్న్‌ ఫ్లోర్‌ – కప్పు; పచ్చి మిర్చి – 6; అల్లం తురుము – టీ స్పూను; వెల్లుల్లి ముద్ద – టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉల్లి తరుగు – కప్పు; ఉడికించిన బఠాణీ – కప్పు; సోయా సాస్‌ – టీ స్పూను; అజినమోటో – అర టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; ఉల్లికాడల తరుగు – పావు కప్పు.

తయారీ:

  • ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసి కొద్దిగా ఉడికించాలి
  • మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి
  • పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్‌ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి
  • కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు)
  • బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్‌ మిశ్రమాన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి
  • వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి  తయారైన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి
  • చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి
  • సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి.

నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement