CDS Bipin Rawat Wife Madhulika All Need To Know Died In Helicopter Crash: ఓ వ్యక్తి తను ఎంచుకున్న రంగం.. విధి నిర్వహణలో విజయవంతంగా కొనసాగుతున్నారంటే అందులో జీవిత భాగస్వామి పాత్ర కచ్చితంగా ఉండే ఉంటుంది. భర్తకు భార్య.. భార్యకు భర్త చేదోడువాదోడుగా ఉంటే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోతుంది. ఇటు వ్యక్తిగత.. అటు వృత్తిగత జీవితం సమతుల్యం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగితే చిక్కులు ఉండవు. భారత సీడీఎస్ బిపిన్ రావత్- ఆయన భార్య మధులిక రావత్ గురించి వింటే ఈ మాటలు అక్షరాలా నిజమనిపిస్తాయి.
భారత దేశపు మొట్టమొదటి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్) బిపిన్ రావత్. ఈశాన్య రాష్ట్రాలతోపాటు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి ఆర్మీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
సైన్యం, నావికా, వైమానిక దళాలను సమన్వయపరుస్తూ సైనిక సంబంధిత విషయాల్లో రక్షణమంత్రికి సలహాదారుగా వ్యవహరించడం సీడీఎస్ ప్రధాన బాధ్యత. మరి ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి తన కర్తవ్యాన్ని సజావుగా నిర్వహించాలంటే... కుటుంబం నుంచి సహకారం అవసరం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య మధులిక రూపంలో ఆయనకు చక్కని తోడు ఉంది. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు రత్నాల్లాంటి కుమార్తెలు.
తాను సైతం...
భర్తకు తగ్గ భార్య ఆమె. రావత్ సీడీఎస్‌గా ఉంటే.. ఆయన సతీమణి మధులిక సైతం అమరవీర సైనికుల భార్యలకు అండగా నిలబడ్డారు. దేశంలోని అతిపెద్ద ఎన్జీవో ఏడబ్ల్యూడబ్ల్యూఏ(ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్) అధ్యక్షురాలు ఆమె. వీర నారీల(అమర సైనికుల భార్యలు), వారి పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అంతేగాక విధి నిర్వహణలో వీర మరణం పొందిన సైనికులపై ఆధారపడిన ఇతర కుటుంబ సభ్యుల బాగోగులను కూడా ఈ ఎన్జీవో పర్యవేక్షిస్తుంది.
సాధికారికతకై కృషి చేస్తూ..
వీర నారీల సాధికారికతకై మధులిక కృషి చేస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారికి ప్రోత్సాహం అందిస్తున్నారు. టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు, చాక్లెట్లు, కేకుల తయారీలో శిక్షణ ఇప్పిస్తూ తమ కాళ్ల మీద తాము నిలబడేలా అండగా నిలుస్తున్నారు. అంతేగాక ఆరోగ్య అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్నారు.
ఆఖరి శ్వాస వరకు.. భర్త వెంటే..
సీడీఎస్‌గా ఎల్లప్పుడు బిజీగా ఉంటే బిపిన్ రావత్ తమిళనాడు పర్యటనకు వచ్చారు. వెల్లింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్( Mi-17V-5)లో బుధవారం బయల్దేరారు. అయితే, ఈ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం విదితమే. ఆ సమయంలో భర్తతో పాటు మధులిక కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషాదమేమిటంటే.. చివరి శ్వాస వరకు భర్త వెన్నంటే ఉండి.. ఆఖరి మజిలీలోనూ మధులిక ఆయన తోడు పంచుకున్నారు. మధులిక మరణం ఆమె కుటుంబ సభ్యులు, ఏడబ్ల్యూడబ్ల్యూఏకు మాత్రమే కాదు.. ఇతరులకు సాయం చేయాలనుకునే గొప్ప గుణాన్ని ఆరాధించగల ప్రతి ఒక్కరికి తీరని లోటు.
చదవండి: Gen Bipin Rawat Chopper Crash: ‘హఠాత్తుగా పెద్ద శబ్దం.. వెళ్లి చూస్తే మంటలు చెలరేగుతూ..’
Comments
Please login to add a commentAdd a comment