![Chichibu Night Festival 2023: Japnas December Festival - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/3/Japan.jpg.webp?itok=sYjMrtQR)
మన దీపావళి ఇటీవలే జరిగింది. అచ్చం మన దీపావళిని పోలిన పండుగనే జపానీయులు కూడా ఏటేటా జరుపుకొంటారు. ఈ పండుగ పేరు ‘చిచిబు యమాత్సురి’– అంటే రాత్రి వేడుక అని అర్థం. దాదాపు మూడు శతాబ్దాలుగా జపానీయులు ఈ పండుగను జరుపుకొంటూ వస్తున్నారు. ఇది రెండు రోజుల పండుగ. ప్రతి ఏటా డిసెంబర్ 2, 3 తేదీల్లో జపాన్ ప్రజలు ఘనంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఒకుచిచిబు పర్వతసానువుల దిగువన ఉండే చిచిబు పట్టణంలో ఈ వేడుకలు జరుగుతాయి. రాజధాని టోక్యో సహా వివిధ నగరాలు, పట్టణాలకు చెందిన ప్రజలు ఇక్కడకు చేరుకుని, ఘనంగా పండుగ చేసుకుంటారు.
సాయంత్రం చీకటి పడుతూనే ప్రార్థన మందిరాలను, ఇళ్లను సంప్రదాయబద్ధమైన లాంతరు దీపాలతో అలంకరిస్తారు. వీథుల్లో ఊరేగింపులు జరుపుతారు. ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పండుగ మొదటి రోజున ప్రార్థనలు, విందు వినోదాలతో గడుపుతారు. రెండోరోజైన డిసెంబర్ 3న రాత్రి వేళ ఇళ్లను, ప్రార్థన మందిరాలను లాంతరు దీపాలతో అలంకరించి, భారీ ఎత్తున బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకల్లో చిచిబు పట్టణం బాణసంచా కాల్పులతో హోరెత్తుతుంది. ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే బాణసంచా మెరుపులు కనిపిస్తాయి. రంగు రంగుల తారాజువ్వలు, చిచ్చుబుడ్లు వంటి బాణసంచా కాల్పుల్లో పిల్లలూ పెద్దలూ అంతా ఉత్సాహంగా పాల్గొంటారు.
చిచిబు పట్టణంలోని ప్రధాన ప్రార్థన మందిరమైన చిచిబు మందిరంలో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఈ మందిరం రాత్రివేళ దీపకాంతులతో ధగధగలాడిపోతుంది. వేలాది మంది జనాలు ఇక్కడకు చేరుకుని, బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ మందిరం నుంచి కలపతో తయారు చేసిన రథాల వంటి ‘యతాయి’ వాహనాలను దీపాలతో అలంకరించి వీథుల్లో ఊరేగిస్తూ బాణసంచా కాల్పులు జరుపుతారు. ఈ వేడుకలను తిలకించడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
(చదవండి: అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు కానీ..!)
Comments
Please login to add a commentAdd a comment