సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు.
ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది.
ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment