వేశము, సన్నివేశం అన్నీ మారెను.. | Coronavirus Stories In 2020 | Sakshi
Sakshi News home page

కరోనా కథలెన్నెన్నో..

Published Sun, Jan 17 2021 1:28 PM | Last Updated on Sun, Jan 17 2021 1:49 PM

Coronavirus Stories In 2020 - Sakshi

‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని 
ఓ అమ్మాయి ఏడుస్తుంటే.. 
‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’ అంటాడు ఓ అబ్బాయి. 
కళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా ఆ అబ్బాయి వంక చూస్తూ ‘నువ్వా? నా కోసం? 
ఆ.. ఉండి ఏం చేస్తావ్‌? ఏడుస్తుంటే దగ్గరకొచ్చి ఓదారుస్తావా? నన్ను హగ్‌ చేసుకోగలవా? కనీసం ఆ పీపీఈ కిట్‌ తీసేసి నీ మొహంలోని భావలనన్నా చూపించగలవా? 
మనిద్దరం మాట్లాడుకోవాలంటే మొబైల్‌ ఫోన్‌కి కనెక్ట్‌ అవ్వాలి.. ముద్దుముచ్చట్లాడాలంటే వర్చువల్‌ సెక్స్‌ రూమ్స్‌లోకి వెళ్లాలి.. ఇదీ మన జీవితం’ అని నిష్టూరమాడుతుంది. 
ఈ దృశ్యం ‘అమెజాన్‌ ప్రైమ్‌’లోని ‘అన్‌పాజ్డ్‌’ అనే ఆంథాలజీలోనిది. విడ్డూరం కాకపోతే అని బయటికి పెదవి విరిచినా.. నిజమే రానురాను ఇలాగే ఉంటుందేమో పరిస్థితి అని మనసు మనకు వినిపించక పోదు. 

కరోనా.. దాదాపు ఏడాదిగా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అది చూపించిన ప్రభావం.. పుట్టించిన భయం.. ఒక శతాబ్దం వెంటాడేట్టుంది. అప్పటికే ఏమీ మిగల్చకుండా కిందటేడును శూన్యంగా మార్చేసింది. లేని అలవాట్లను జీవితంలో భాగం చేసింది. సౌకర్యాల పట్ల మోజు తగ్గించేసింది. సర్జికల్‌ శానిటైజర్లను, మాస్కులను నెలనెలా వెచ్చాల జాబితాలో చేర్చింది. వానిటీ బ్యాగులు, ప్యాంట్‌ పాకెట్లలో క్యారీ చేసేలా అప్రకటిత నియమాన్ని పెట్టింది. ప్రపంచంలో అందరికీ ఓసీడీని తెచ్చింది.. కడిగిందే కడిగిస్తూ.. తుడిచిందే తుడిపిస్తూ! సాటి మనిషి కనిపిస్తే అనుమానపు అస్త్రాన్ని సంధింపచేస్తోంది. దగ్గినా.. తుమ్మినా బాంబు పడ్డంత ఉలికిపాటునిస్తోంది. కాలాన్ని కట్టిపడేసింది. ప్రగతికి విశ్రాంతి చూపించింది. ప్రయాణాలకు నిలకడ నేర్పింది. హంగులకు అణకువ చెప్పింది. దుబారా దురుసుతనం తగ్గించింది. పొదుపుకి కిరీటం పెట్టింది. శ్రమకు విలువకూర్చింది. సమూహాలను చెదరగొట్టింది. ఫ్యాషన్లు సింప్లిసిటీలోకి ఒదిగాయి. డిజైనర్‌ డ్రెస్‌ల స్థానంలో డిజైనర్‌ మాస్క్‌లు ట్రెండ్‌ అయ్యాయి.

ఆఫర్లతో కాకుండా  ‘శానిటైజ్డ్‌  ఎన్విరాన్‌మెంట్‌.. నోమాస్క్‌ నో ఎంట్రీ’ అనే నినాదంతో కస్టమర్లను ఆకట్టుకునే పరిస్థితి షోరూమ్‌లది. కార్మికులు, శ్రామికులు సొంత గూళ్లకు వెళ్లిపోయారు. ఉత్పత్తి ఆగిపోయింది. ద్రవ్యం పారట్లేదు. జీతాల్లో కోత, ఉద్యోగుల తీసివేత. కార్పొరేట్‌ కంపెనీలూ ఖాళీ. ఐటీ కొలువులకు ఇల్లే ఆఫీస్‌ రూమ్‌. పెరిగిన పని గంటలు. ట్రబుల్స్‌లో స్టార్టప్‌లు. కరోనా షేరింగ్‌ వర్క్‌ ప్లేసెస్‌ గల్లంతు. బడుల్లేక.. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంకాక నైతికంగా ఈ విద్యా సంవత్సరం ఫెయిల్‌. భారీ ఎత్తున వలస కార్మికులు సొంత గూళ్లకు చేరే సరికి మన యూనిక్‌ బ్రాండ్‌ అయిన  మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ పనిమంతుల దగ్గర్నుంచి నిర్మాణ రంగంలోని కష్ట జీవుల వరకు ఎంప్లాయ్‌మెంట్‌ ఖాళీ అయింది. అందుకే మగ్గం మెరుపుల్లేవ్‌.. గోడలకు సిమెంట్‌ పూతల్లేవ్‌. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా మారిన ఇళ్ల రూపురేఖలు. 

ట్రావెల్‌ కూడా లాగ్‌ అయింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఓటీటీ పేటెంట్‌గా తీసుకుంది. కరోనా నేపథ్యాలే కథా వస్తువులు, సినిమా ప్లాట్స్‌గా కనిపిస్తున్నాయి. కరోనా కలిసి జీవించాల్సిందేనని ప్రభుత్వాలూ ప్రజలను మానసికంగా సిద్ధం చేసి లాక్‌డౌన్‌ ఎత్తేసి బయటి ప్రపంచపు తలుపులు తెరిచినా.. పరిమితంగానైనా బస్సులు, రైళ్లు, విమానాలు నడుస్తున్నా.. ధైర్యాన్ని పట్టుకొని జనాలు కూడుతున్నా.. ఎక్కడో భయం.. నిర్లక్ష్య ధోరణి మేకప్‌ వెనుక. అందుకే బార్బర్‌ షాపుల్లో పేపర్లు చదువుతూ, యూట్యూబ్‌లు చూస్తూ క్యూ లేదు, బ్యూటీ పార్లర్‌లో సందడి మాయం.. షాపింగ్‌ మాల్స్‌ వేచి చూస్తున్నాయి. ఇక్కడ పాజ్‌ తీసుకున్న అవసరాలు ఆన్‌లైన్‌లో ఫ్లో అవుతున్నాయి. అన్ని సర్వీసులకు కేరాఫ్‌ అదే అయింది. అందుకే అర్బన్‌ కంపెనీకి గిరాకీ పెరిగింది. ఐక్యాలాంటివి కూడా ఆన్‌లైన్‌ మార్కెట్‌ను పెంచేశాయి.

హోమ్‌ డెలివరీ ప్యాకేజ్‌లు సిద్ధం చేసింది. అత్యవసర సేవలు తప్ప తతిమ్మావన్నీ టెక్నాలజీనే బేస్‌ చేసుకున్నాయి. స్విగ్గీ, జొమాటోల ఉనికీ కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ కాలాన్నీ ఆన్‌లైన్‌తో వినియోగం చేసుకన్న సమూహమూ ఉంది. వంటల నుంచి వివిధ భాషల దాకా, వాద్య సంగీతం నుంచి వెస్టర్న్‌ మ్యూజిక్‌ దాకా చాలా విద్యలకు ఆన్‌లైన్‌ గురువైంది. టెక్నాలజీ చాలామందిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను చేసింది. యూట్యూబ్‌ చానెల్‌ ఓనర్స్‌గా. కరోనా కాలంలో పెరిగి వంటల చానెళ్లే ఒక ఉదాహరణ. చేటలో బియ్యాన్ని చెరిగినట్టు ప్రపంచాన్ని చెరిగేసింది కరోనా. మోడర్నిటీ మరుగున పడ్డ అలవాట్లను ముందుకు తెచ్చి పాత జీవన శైలిని కొత్తగా అలవాటు చేస్తోంది. అందుకే పల్లెల్లో ట్రాఫిక్‌ పెరిగింది. ఆ ప్రేరణతో పట్టణాలూ సాగాలనుకుంటున్నాయి. న్యూ స్ట్రెయిన్‌ అంటూ పాశ్యాత్యా దేశాల్లోని పరిస్థితులు కలవరపెడ్తున్నా.. జాగ్రత్తగా ఉంటామనే భరోసా, మన వరకు రాదులే అనే ఆశతో ముందుకు పోయేలా చేస్తోంది. ఇంచు మించు ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు కొంతమంది.. 

న్యూ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌
స్కూళ్లు, కాలేజ్‌లు, సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌లు అన్నీ ఇంటి నుంచే పని మొదలుపెట్టడంతో కంఫర్ట్‌వేర్‌కే డిమాండ్‌ పెరిగింది. రంగుల్లో కూడా లేత రంగుల పట్లే మోజు చూపిస్తుండడంతో అవే ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దాంతో డిజైనర్స్‌ కూడా దాదాపుగా  కంఫర్ట్‌వేర్, లైట్‌ కలర్స్‌ పట్లే దృష్టి పెట్టారు.  మా దగ్గరకు వచ్చే చాలా మంది కస్టమర్స్‌ కొత్తవి ఆర్డర్‌ ఇచ్చేకంటే, ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టకుండా ఉన్న వాటితోనే అంటే పట్టు, హ్యాండ్‌లూమ్‌ చీరలతో డ్రెసెస్‌ డిజైన్‌ చేయించుకుంటున్నారు. అయితే ఏ వేర్‌ అయినా దానికి మ్యాచింగ్‌ డిజైనర్‌ మాస్క్‌ కంపల్సరీ కుట్టించుకుంటున్నారు. ఒకరకంగా ఇది న్యూ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ అయిపోయింది. మాస్క్‌ల మీద కూడా మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్‌ చేయించుకుంటున్నారు. డిజైనర్‌గా నేను మునుపటిలా ఎక్కడికంటే అక్కడికి వెళ్లి కావల్సిన మెటీరియల్‌ తెచ్చుకునే పరిస్థితి లేదు. క్లయింట్‌తో నేరుగా కాకుండా మొబైల్‌ ద్వారానే డీల్‌ చేస్తున్నాం. ట్రయల్స్‌ వంటి మాటే లేదిప్పుడు.
– నిహారిక రెడ్డి, ఫ్యాషన్‌ డిజైనర్‌

జూన్‌ నుంచి మొదలుపెట్టాలి..
నాకు భ్రమణకాంక్ష ఎక్కువ. సోలో ట్రావెలర్‌ని. ఇప్పటి వరకు 25 దేశాలు చుట్టొచ్చా. ప్రతి వారం షార్ట్‌ ట్రిప్స్, ఏడాది కనీసం రెండు లాంగ్‌ ట్రిప్స్‌కి ప్లాన్‌ చేసుకుంటాను. కాని కరోనా వల్ల కిందటేడు ఫిబ్రవరి నుంచి కాలు కదపకలేపోయా. లాక్‌డౌన్‌ తర్వాత ఫ్లయిట్స్‌ తిరగడం చూసి ఆశ పడ్డాను అక్టోబర్‌ (2020) నుంచి అంతా సర్దుకుంటుంది అని. జరగలేదు. సెకండ్‌ స్ట్రెయిన్‌ అంటూ ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మళ్లీ భయంలోకి తోసేసింది. అయితే వెళ్లే వాళ్లు వెళ్తున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ. ముఖ్యంగా క్యాంపింగ్‌ టూర్స్‌ చేస్తున్నారు.  నేనే ఇంకా ధైర్యం చేయట్లేదు.. ముందు ఆరోగ్యం ముఖ్యం కదా అని. ఈ ఏప్రిల్‌కంతా  చక్కబడుతుందను కుంటున్నా. పడకపోయినా జూన్‌ నుంచి సొంత డ్రైవింగ్‌లో రోడ్‌ ట్రిప్స్‌ ప్లాన్‌ చేసుకుంటా. ఈ ఖాళీ టైమ్‌ను వర్చువల్‌ ట్రావెల్‌లో గడిపేస్తున్నా.. నా ట్రావెల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను బ్లాగ్‌లో రాస్తున్నా. 
– ఏ. అపరాజిత, ఇండిపెండెంట్‌ టెక్నాలజీ కన్సల్టెంట్‌. 

ఎవరి ఆత్రం వారిదే
మొన్నటి అక్టోబర్‌ వరకూ ఎయిర్‌పోర్ట్స్‌లో పెద్దగా రద్దీ లేదు. ఆ తర్వాత నుంచే ఫ్లయిట్స్‌లో ఆక్యుపెన్సీ పెరిగింది. ముఖ్యంగా ఈ నెల (జనవరి)లో బాగా పెరిగింది. ఈ ఎనిమిది నెలల విసుగును వదిలించుకోవడానికి  చాలా మంది గోవా, పుణె, కేరళలకు వెళ్లారు కుటుంబాలతో. ఇదివరకైతే ఎయిర్‌ పోర్ట్‌ రెస్టారెంట్లు జనంతో కిటకిటలాడేవి. ఇప్పుడు అక్కడ తినే ప్రయాణికుల సంఖ్య చాలా తగ్గిపోయింది. కౌంటర్స్, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్‌ సమయంలో భౌతిక దూరం బాగానే పాటిస్తున్నారు. కాని ల్యాండ్‌ అయ్యాక మాత్రం ఎవరి ఆత్రం వారిదే. ఒక్కసారిగా గుంపుగా ఫ్లయిట్‌ దిగే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల ఏవియేషన్, హోటల్‌ ఇండస్ట్రీలు బాగా దెబ్బతిన్నాయి. గ్రౌండ్‌ స్టాఫ్‌లో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. వేతనం లేకుండా ఆరునెలల సెలవు మీద వెళ్లమని చెప్పాయి కంపెనీలు. ఏప్రిల్, మేల్లో పైలట్స్‌కీ జీతాల్లేవ్‌. ఈ నెల నుంచే 70 శాతం జీతం ఇస్తున్నారు. అయితే కరోనా కంటే ముందు ఫ్లయిట్‌ చార్జీలు ఎంత ఉండెనో.. ఇప్పుడూ అంతే ఉన్నాయి. కాకపోతే అంతకుముందు ఆఫర్స్‌ ఇచ్చేవాళ్లు ఇప్పుడు ఇవ్వట్లేదంతే. 
– బి. ప్రణీత్‌ కుమార్, ఫస్ట్‌ ఆఫీసర్, స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌

ఊరు ఫ్రెండ్‌ అయింది
మావారి ఉద్యోగం వల్ల మేం హైదరాబాద్‌లో ఉంటాం. కాని లాక్‌డౌన్‌లో మా సొంతూరు నర్సింగాపురం (రాజన్న సిరిసిల్ల జిల్లా) వచ్చేశాం. ఇన్ని రోజులు ఊరిలో గడపడం ఇదే ఫస్ట్‌. మా పిల్లలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సిటీలో థియరీగా తెలుసుకున్నది ఇక్కడ ప్రాక్టికల్‌గా ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్‌ కన్నా ఇక్కడే బాగుంది అంటున్నారు. వాళ్లకు బంధుత్వాలు తెలుస్తున్నాయి, కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఆవుకి, ఎద్దుకి తేడా, వాటి రంగులను అడిగి తెలుసుకుంటున్నారు. తోటల్లో, పొలంలో పండిన కూరగాయలు, ధాన్యపు గింజలను చూస్తున్నారు. వాళ్ల పెద్ద తాత దగ్గర కథలు వింటున్నారు. చిన్న తాత దగ్గర శ్లోకాలు వింటున్నారు. స్విమ్మింగ్‌ నేర్చుకున్నారు. అయ్యో స్కూల్‌ నడవట్లేదు అని మేము ఫీల్‌ అవుతున్నాం కాని వాళ్లకు ఆ చింతే లేదు. ఉదయం రెండు గంటలు ట్యూషన్‌ తప్ప ఆన్‌లైన్‌ క్లాసెస్‌ కూడా వినట్లేదు. ఇన్ని రోజులు ఊరు అనేది వాళ్లకు బీర్వాలో దాచుకున్న ఒక జ్ఞాపకం లాంటిది.. ఇప్పుడు ఆ లైఫ్‌ను కంప్లీట్‌గా అనుభవిస్తున్నారు. ఒకరకంగా కరోనా మంచే చేసిందనిపిస్తోంది. లేకపోతే వాళ్లకు ఈ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ వచ్చి ఉండేది కాదు. 
– పి.సింధు నర్మద, గృహిణి. 

మానసికాన్ని వెలిగించి భౌతికాన్ని చంపేస్తుంది
తన, మన అనే భేదభావాలను తుడిచిపారేసిన కరోనాను ఎలా మరిచిపోగలం? నాకు విపరీతంగా చదివే అలవాటు ఉండడం వల్ల ఈ కరోనా టైమ్‌లో కొన్ని మంచి పుస్తకాలు చదవగలిగాను. కాని లోపల ఏదో దిగులు. లాక్‌డౌన్‌ అయిపోయినా ఆ దిగులు వదల్లేదు. పిల్లలకు బడులు లేవు. అక్కడ నేర్చుకోవాల్సిన విషయాలను ఇంట్లో మనమే నేర్పాలి. మరోవైపు ఉద్యోగరీత్యా బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. కరోనా  ఏ మూల ఎక్కడి నుంచి దాడికి దిగుతుందో తెలియదు... రక్షణగా  శానిటైజర్, మాస్క్‌లు ఉన్నా. ఇప్పుడు మళ్లీ కొత్త  స్ట్రెయిన్‌ అంటున్నారు. మనిషిని అంతర్గతంగా మార్చడానికే కరోనా వచ్చింది అని ఎవరో అన్నారు కాని అది మానసికాన్ని వెలిగించి భౌతికాన్ని చంపేస్తుంది. రానున్న కాలంలో కరోనా ప్రభావం తగ్గినా అది రగిలించిన భయం మాత్రం జీవిత కాలం వెంటాడుతూ ఉంటుంది.
– అనిల్‌ డ్యాని, కవి, రచయిత

కడిగిందే కడగడం.. తుడిచిందే తుడవడం
ఇంతకుముందైతే  ఇంటి పని అయిపోయాక ఖాళీ టైమ్‌లో  టైలరింగ్‌ చేసేదాన్ని. అయితే  కరోనాతో తలకిందులైన టైమ్‌టేబుల్‌ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. శుభ్రత ఎక్కువై కడిగిందే కడుగు.. తుడిచిందే తుడుచడమవుతోంది. పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు వినేలా చేయడం ఒక టాస్క్‌ అయింది. వీటన్నిటికీ  తోడు మనీ ప్రాబ్లమ్స్‌. వ్యాక్సిన్‌ సక్సెస్‌ అయితే కానీ ముందటి రోజులు రావు.
– వై.స్వరూప, గృహిణి, మహబూబాబాద్‌

స్కూల్స్‌ తెరిస్తే బాగుండు
కరోనాతో ట్రిపుల్‌ ఐటీ అవకాశం లేకుండా పోయింది. దాదాపు మూణ్ణెళ్లు పుసక్తం పట్టలేదు.  ఆన్‌లైన్‌ క్లాసెస్‌తో కొంచెం బెటరే కాని ఆన్‌లైన్‌లో లెసన్స్‌ను కంప్లీట్‌గా  అర్థంచేసుకోవడం కష్టంగానే  ఉంది. డౌట్స్‌ వస్తే డైరెక్ట్‌గా అడిగే పరిస్థితి లేదు.  వాట్సాప్‌ గ్రూప్‌లో రాసి పంపిస్తే వాటిని టీచర్స్‌ చూసి క్లియర్‌ చేస్తున్నారు. రెండు మూడు కంటలు అదేపనిగా ఫోన్‌లో చదవుతుంటే కళ్లు కూడా మండుతున్నాయి.  అయితే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ వల్ల మేలు కూడా  జరిగింది. ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఉన్న యాప్స్‌ గురించి తెలుసుకున్నాను. కంప్యూటర్‌పై పూర్తి అవగాహన పెరిగింది. ఇంటి పనులూ నేర్చుకున్నా. స్కూల్స్‌ తెరిస్తే బాగుండు అనిపిస్తోంది. 
– సామల కావ్య, పదవ తరగతి విద్యార్థిని, బచ్చన్నపేట, జనగామ జిల్లా.

క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ తెలుస్తోంది
 ఐదేళ్లుగా హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాను. మా సొంతూరు ఇదే (కరీంనగర్‌). లాక్‌డౌన్‌తో ఇక్కడికి వచ్చా. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇక్కడి నుంచే వర్క్‌ చేస్తున్నాను. కరోనా దెబ్బకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వల్ల ఆఫీస్‌ అవర్స్‌ కంటే ఎక్కువ పనిచేయాల్సి వస్తోంది. వీకెండ్స్‌ కూడా సెలవులు ఉండట్లేదు. అయితే స్ట్రెస్‌ అండ్‌  క్రైసిస్‌ మేనేజ్‌మెంట్, ఉన్నదాంట్లో సర్దుకుపోవడం తెలుస్తోంది.దాదాపు 10 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నా కదా ఇంట్లో ఆడవాళ్లు ఎంత పనిచేస్తారో కూడా అర్థమవుతోంది. 
 – దేవసాని మహంత్‌

టికెట్‌ చేతిలో పెట్టి పొమ్మన్నారు..
 దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ వింగ్‌లో పనిచేశాను. అప్పులన్నీ తీరి అంతా బాగుందన్న టైమ్‌లో  కరోనా వచ్చి ఆగం చేసింది. నేను పనిచేసిన ఎయిర్‌పోర్టు క్లోజ్‌ చేశారు. మూడు నెలలు అక్కడే ఉంచుకుని తిండిపెట్టారు. తర్వాత ఒకరోజు పాస్‌పోర్ట్, ఫ్లయిట్‌ టికెట్‌ చేతిలో పెట్టి ఇండియా వెళ్లిపొమ్మన్నారు.రాకతప్పలేదు. ఇప్పటి వరకు అక్కడి నుంచి ఏ రెస్పాన్స్‌ లేదు. మళ్లీ కరోనా ఎక్కువైంది అంటున్నరు. పిలుస్తరో లేదో అర్థమైతలేదు. ఇంటి దగ్గర ఖాళీగా  ఉండలేక మూడు నెలలు ఉపాధి హామీ పనులకు వెళ్లా. నా ఉద్యోగం కోసం మా దుబాయ్‌ బాస్‌కు  మెయిల్‌ కూడా పంపిన. ఇంతవరకు జవాబు రాలేదు. వస్తదనే ఆశతో ఎదురుచూస్తున్నా. 
– మద్దికుంట సతీష్‌బాబు, గన్‌పూర్, కామారెడ్డి జిల్లా. 

జీవితమే మారిపోయింది
లాక్‌డౌన్‌కి ఇప్పుడు పరిస్థితి చెప్పాలంటే అప్పుడు పనిలేదు. ఓ ఇరవై రోజులుగా పనికి వెళ్తున్నాం. పనిచోటే కాదు ఇంట్లోనూ ఇంకా చెప్పాలంటే జీవితమే మారిపోయింది. మాస్క్, శానిటైజర్‌ లేకుండా బయటికి వెళ్లటానికి లేదు. మాస్క్‌లేకుండా పనిలోకీ రానివ్వడంలేదు. పమిట చెంగునే ముక్కుకు, మూతికి చుట్టేసుకుంటున్నాం. శానిటైజర్‌ని మాత్రం వెంట తీసుకెళ్తున్నాం. లాక్‌డౌన్‌లో అయిన అప్పులు తీరాలంటే ఇంకొన్నాళ్లు పడుతుంది. మొత్తానికి కరోనా మాకు పొదుపు నేర్పింది. 
– చింతల దాలమ్మ, జీడిపప్పు గ్రేడింగ్‌ కార్మికురాలు, గరుడభద్ర, శ్రీకాళం జిల్లా.

బడి పాడుబడింది..
లాక్‌డౌన్‌తో మూతపడ్డ స్కూళ్లు ఈ మధ్యనే తెరుచుకున్నాయి. పిల్లలు లేని బడి ఎట్లుంటది? పాడుబడి స్మశానంలాగా అనిపిస్తోంది.  ఆన్‌లైన్‌ పాఠాలు ఎంత బాగా చెప్పినా ప్రత్యక్షంగా పిల్లల రియాక్షన్‌ కనపడకపోతే పాఠం చెప్పిన భావనే లేదు. పైగా మాది మారుమూల గ్రామం. ఇంటర్నెట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. కరోనా టీచర్లకు కొత్త అసైన్‌మెంట్‌ ఇచ్చింది. అంతా సద్దుమణిగాక పిల్లలను గాడిలో పెట్టి వాళ్లకు ఎప్పటిలా పాఠాలు చెప్పడం పెద్ద యజ్ఞమే. 
– మోత్కుల నారాయణ గౌడ్, టీచర్, వీర్నపల్లి, సిరిసిల్ల జిల్లా. 

ఈ ఏడాది మంచిగనే ఉంటది
రోజూ 500  బీడీలు చేస్తాను. అంటే రోజుకి 80 రూపాయలన్నట్టు.  మా ఆయన ( రాజేందర్‌) దుబాయ్‌లో ఉంటాడు. అక్కడ ఆయన కంపెనీ బంద్‌ పెట్టిండ్రు.  ఇద్దరు పిల్లలు. పని చేస్తేనే ఇల్లు గడుస్తది. ఈ గండం ఎట్లగట్టెక్కుతదిరా దేవుడా అనుకున్నా.  ఇప్పుడిప్పుడే కొంచం ధైర్యం వస్తుంది. అక్కడ ఆయనకు  పని దొరకొచ్చని అంటున్నడు. నేను కూడా బీడీలు చేసుడు మళ్లీ మొదలుపెట్టిన. ఈ ఏడాది మంచిగనే ఉంటదని  అనుకుంటున్నం.. చూద్దాం!
– దేశవేణి సంగీత, బీడీ కార్మికురాలు, రుద్రంగి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement