
న్యూ ఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు మనం తీసుకునే ఆహారపు అలవాట్లకు సంబంధం ఉందంటున్నారు వైద్యులు. సరైన పౌష్టికాహారం తీసుకోని వారికి కరోనా మరణాలు సంభవించే ఆస్కారం ఉందని హెచ్చరించారు. కనుక భారతీయులు అత్యవసరంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని ఎన్‌హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) వైద్యాధికారి, భారత సంతతికి చెందిన డా. అస్సీమ్ మల్హోత్రా మాట్లాడుతూ.. కరోనా మరణాలకు ఊబకాయం, అధిక బరువు వంటివి కూడా ఒక కారణమన్నారు. ఇలాంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు ప్రస్తుతం భారత్‌ను వేధిస్తున్నాయన్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధులు ఉన్నవారికి మిగతా కరోనా రోగులతో పోలిస్తే మరణించే అవకాశం 10 రెట్లు ఎక్కువ ఉన్నట్లు పేర్కొన్నారు. వీరితో పాటు అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులపై మందుల ప్రభావం కూడా పెద్దగా ఉండదన్నారు. పైగా కొన్నిసార్లు అవి సైడ్ ఎఫెక్ట్స్‌కు కూడా దారి తీయవచ్చని తెలిపారు. (కరోనాపై యూట్యూబ్‌లో అవగాహన )
అరవై శాతానికి పైగా యువకులకు అధిక బరువు..
"అలా అని ఔషధాలు అందివ్వడం నిలిపి వేయమని చెప్పలేం.. కానీ జీవనశైలిలో కొన్ని మార్పుచేర్పులు చేసుకుంటే అది ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపి, మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. కానీ భారతీయ వైద్యులు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. అమెరికాలో అనారోగ్య జీవనశైలి వల్లే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే యూకే, యూఎస్‌లో అరవై శాతానికి పైగా యువకులు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఒక్క అమెరికాలోనే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఆహారపు అలవాట్లు మార్చితే కొన్ని వారాలకే జీవనశైలిలో సంతోషకరమైన మార్పులను స్పష్టంగా గమనించవచ్చు."
భారతీయులు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి
"ప్రాసెసింగ్ చేసిన ప్యాకేజ్ ఫుడ్‌లో చక్కెర, పిండి పదార్థాలు, ఆరోగ్యకరం కాని నూనెలు, ఎక్కువ రోజులు నిలకడగా ఉండేందుకు రసాయనాలు వాడుతారు. షాకింగ్ విషయమేంటంటే ఇప్పుడు యూకేలో 50 శాతానికి పైగా ఇలాంటి ఫుడ్ మీదే ఆధారపడుతున్నారు. కాబట్టి భారతీయ ప్రజలకు నేనిచ్చే సలహా ఏంటంటే.. ఇలాంటి ప్యాకేజెడ్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. మరో ముఖ్య విషయమేంటంటే.. ఇక్కడ కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ల స్థాయిని పెంచుతాయి. తెల్ల బియ్యం, పిండి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. కనుక వీటి స్థానంలో కూరగాయలు, పండ్లు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం వంటి పదార్థాలను తీసుకోవాలి. భారతీయులు తీసుకునే ఆహారంపై మరింత శ్రద్ధ వహించాలి" అని మల్హోత్రా సూచించారు. (కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు)
Comments
Please login to add a commentAdd a comment