ప్రతీకాత్మక చిత్రం
‘ఏమైనా చేసి పెట్టనా?’ ఆన్‌లైన్ క్లాసుల పేరుతో కంప్యూటర్‌కో, టీవీలకో అతుక్కుపోయిన పిల్లలను తల్లులు అడిగే ప్రశ్న ఇది. ‘ఆన్‌లైన్ క్లాసప్పుడు తినడానికి కాస్తా చిప్స్ ప్యాకెట్ తీసుకురా డాడీ..’ ఇదీ.. బయటకెళ్ళే తండ్రి వద్ద పిల్లల గారాబం. రెండూ కాదనుకుంటే ఆన్‌లైన్ తిండి ఎలాగూ ఉంది. ఆకలితో సంబంధం లేకుండా టైమ్ పాస్ కోసం అన్నట్టుగా ఫోన్‌లోనే ఏ ఫుడ్ డెలివరీ సంస్థలోనో నూడుల్సో, పిజ్జానో, బర్గరో ఆర్డర్ ఇచ్చేయడమే.
అడ్డూఅదుపూ లేకుండా తీసుకునే ఆహారం వల్ల భవిష్యత్‌లో ఊబకాయం, ఫ్యాటీ లివర్ (కొవ్వుతో కూడిన కాలేయం), మధుమేహం వంటి సమస్యలతో పాటు బాలికల్లో హార్మోన్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
మొత్తం మీద ఆన్‌లైన్ తరగతుల పుణ్యమా అని విద్యార్థులకు చిరుతిళ్లు పెరుగుతున్నాయి. స్కూలుకు పంపేప్పుడు లంచ్ బాక్స్ కట్టిస్తే సరిపోయేది... ఇప్పుడు అస్తమానం ఏదో ఒకటి చెయ్యక లేక కొనివ్వక తప్పడం లేదని తల్లులు అంటున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్‌కి ఇవి అదనం అన్నమాట. వరసబెట్టి తీసుకునే ఈ అదనపు తిండి పూర్తిగా అనవసరం అని ఆహార నిపుణులు చెబుతున్నారు.
పైగా చిప్స్, నూడుల్స్ వంటి మసాలా జంక్ ఫుడ్స్ దీర్ఘకాలంలో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు అంటున్నారు. పాఠశాలలకు వెళ్లే సాధారణ రోజుల్లో మితాహారం తీసుకునే విద్యార్థి, ఇంటి దగ్గర ఆన్‌లైన్ చదువప్పుడు అవసరానికి మించి తినేస్తున్నాడని, అదీ జంక్ పుడ్ కావడం ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు.
జీర్ణకోశం జర జాగ్రత్త..
సాధారణంగా రోజూ తీసుకునే ఆహారం కన్నా... ఆన్‌లైన్ క్లాసుల సమయంలో విద్యార్థులు రెండు రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారని హైదరాబాద్‌కు చెందిన న్యూట్రిషనిస్టు శ్రావణి తెలిపారు. తన దగ్గరకొచ్చిన పిల్లల నుంచి ఈ వివరాలు సేకరించినట్టు ఆమె చెప్పారు. ఇందులో ఎక్కువ ఆయిల్‌తో ఆహారం, జంక్ ఫుడ్స్ ఉంటున్నాయని తెలిపారు. దీనివల్ల తక్షణ జీర్ణ సమస్యలే కాదు... దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.
►విద్యార్థులు తీసుకునే ఆయిల్, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల స్వల్ప కాలంలోనే ఎసిడిటీ బారినపడుతున్నారు. రసాయనాలతో నిల్వ ఉంచిన చిప్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలకు లోనవుతున్నారు.
►దినచర్యలో మార్పులు రావడం, ఆలస్యంగా నిద్రలేవడం, హడావిడిగా ఆన్‌లైన్ క్లాసుల కోసం కంప్యూటర్లకు అతుక్కుపోవడం వల్ల పీచు ఎక్కువగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీని బదులు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవన్నీ జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు దారి తీస్తున్నాయి.
►మసాలాలు తినడం వల్ల పేగుల్లో కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి నిద్ర పోవడానికి ఉపయోగపడే రసాయనాల ఉత్పత్తిని మందగింపజేస్తాయి. ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ మంట, తొందరగా అలసిపోవడం దీనివల్లేనని అంటున్నారు.
►5 ఏళ్లలోపు పిల్లల్లో నడవడిక (బిహేవియర్) సంబంధమైన సమస్యలుంటున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, సామాజిక వ్యవస్థతో సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని మానసిక వైద్య నిపుణులు తెలిపారు. నిద్రలేకపోవడం, సెల్‌ఫోన్‌తో ఆడుకోవాలన్పించడం, ఏ చిన్నదానికైనా చికాకు పడటం కన్పిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు.
ఆకలేసినప్పుడే ఆహారం ఇవ్వాలి
పిల్లలకు ఆకలేస్తుందనుకున్నప్పుడే ఆహారం ఇవ్వాలి. ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండే తాజా పండ్లు అలవాటు చేయడంపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలి. దీంతో పాటు చిన్నచిన్న శారీరక శ్రమ కల్గించే ఆటలు ఆడేలా పిల్లలను ప్రోత్సహించాలి. ఆన్‌లైన్ పేరుతో పిల్లలు ఎలక్ట్రానిక్స్ వస్తుల ముందే ఎక్కువసేపు ఉంటారు. కాబట్టి టీవీ చూడకుండా చేయాలి. షటిల్, క్యారమ్స్ వంటి మానసిక ఉల్లాసం కల్గించే ఆటలపై దృష్టి మళ్లించాలి
– డాక్టర్ ఉపేందర్ షావా (పిల్లల జీర్ణకోశ వ్యాధుల నిపుణులు)
చేసి పెట్టక తప్పట్లేదు
మా పాప ఆన్‌లైన్ క్లాసులప్పుడు ఏదో ఒక చిరు తిండి కావాలంటుంది. రోజుకు రెండు మూడుసార్లు ఏదో ఒకటి చేసి పెట్టాల్సిందే. లేదంటే కొనివ్వాల్సిందే. మంచిది కాదని తెలిసినా తçప్పడం లేదు. స్కూలుకు పంపితే లంచ్‌తో సరిపెట్టేవాళ్ళం. కాకపోతే అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేవాళ్ళం.
– ఎం.శ్వేత (9వతరగతి విద్యార్థిని తల్లి, ఖమ్మం)
-సాక్షి, హైదరాబాద్
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment