
పట్టు నాడి పట్టుకోవడం కష్టం. తాకితే... మృదువుగా ఉంటుంది. పట్టుకుంటే మెత్తగా జారిపోతుంది. అసలు పట్టును తెలుసుకోవడం ఓ పరీక్ష. నకిలీని ‘పట్టు’ కోవడానికీ ఉందో పరీక్ష.
మన అమ్మమ్మలు, నానమ్మలు పట్టుచీరలు కట్టుకున్నారు. పట్టుదారం మృదుత్వాన్ని ఆస్వాదించారు. పట్టుచీర కొనేటప్పుడు ఇది అసలుదా నకిలీదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఆ తరానికి రాలేదు. ఎందుకంటే అప్పుడు పట్టుచీరలన్నీ అసలువే. అందుకే ప్రభుత్వం నియమాలు, నిబంధనల పట్టికలేవీ జారీ చేయలేదు. ‘ఇది అసలైన పట్టు’ అని ఒక గుర్తింపునిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు.
నకిలీలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్న తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 2004, జూన్ 17వ తేదీన ‘సిల్క్ మార్క్ లేబిల్’ పేరుతో ఒక లోగోను ఆవిష్కరించింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి నిర్దేశించిన ‘బిఐఎస్ హాల్‌మార్క్’ వంటిదే ఇది కూడా. సిల్క్‌మార్క్ లేబిల్ అంటే... సదరు పట్టు వస్త్రం అసలైన పట్టుదారంతో తయారైనదే అని నిర్ధారించే లేబిల్ అన్నమాట.
పట్టులు నాలుగే!
పట్టు పేరుతో మార్కెట్‌లో దొరికే వస్త్రాల్లో సగం అసలైన పట్టు వస్త్రాలు కాదు. అలాగే నేత విధానాలను కూడా పట్టులో రకాలుగానే వ్యవహరించడంలో నెలకొన్న అయోమయం అది. మనదేశంలో లభించే పట్టు రకాలు మల్బరీ, టస్సర్, ముగా, ఎరీ అనే నాలుగు. ఎనభై శాతం వస్త్రాలు మల్బరీ పట్టు ఆధారంగా తయారయ్యేవే. అన్నింటిలోకి మృదువైన పట్టుదారం కూడా మల్బరీదే. ఇక కంచిపట్టు, ధర్మవరం పట్టు, గద్వాల పట్టు, పోచంపల్లి పట్టు, పైథానీ, బెనారస్ సిల్క్ అని పిలుచుకునే వన్నీ పట్టులో రకాలు కాదు. నేత విధానంలో రకాలు. ప్రపంచంలో ముప్‌పైకి పైగా దేశాల్లో పట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు ఉత్పత్తిలో చైనా తొలిస్థానంలో ఉంటే మనదేశం రెండవస్థానంలో ఉంది.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చు
పట్టుచీర మీద ఉన్న సిల్క్ మార్క్ లేబిల్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌నును స్కాన్ చేస్తే ఆ చీరను తయారు చేసిన వీవర్ వివరాలతోపాటు షోరూమ్ వివరాలు కూడా తెలుస్తాయి. నకిలీ కోడ్‌లను గుర్తించడం ఎలాగో కూడా తెలుసుకోవాలి. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కానీ వినియోగదారుల్లో చైతన్యమే అసలైన నియంత్రణ.
బంగారు జరీ
ప్యూర్ బై ప్యూర్ పట్టు చీర అంటే సహజమైన పట్టు దారాన్ని వెండి లేదా బంగారు ద్రవంలో ముంచి తయారు చేసిన జరీతో నేసినది. ఒకప్పుడు అన్నీ ప్యూర్ బై ప్యూర్ పట్టుచీరలే. ఇప్పుడు హాఫ్‌ఫైన్ వస్తున్నాయి... అంటే పాలియెస్టర్‌ని వెండి లేదా కాపర్‌లో అద్దిన జరీతో తయారు చేసినవి. ఇక టెస్టెడ్ జరీ అంటే విస్కోస్‌ని కాపర్‌తో కోట్ చేస్తారు. గోల్డ్ జరీ పట్టుచీర కావాలంటే వీవర్‌కి డిజైన్‌ను బట్టి రెండు లేదా మూడు గ్రాముల బంగారం ఇచ్చి చేయించుకోవాలి.
నిప్పులాంటి పరీక్ష!
ఇక చీరను నేసిన దారం స్వచ్ఛమైన పట్టుదారమేనా లేక పట్టును పోలిన సింథటిక్ దారమా అనేది తెలుసుకోవడానికి ఫ్లేమ్ టెస్ట్ చేయాలి. చీరలో ఒక చివర నుంచి రెండు దారాలను కత్తిరించి తీసుకుని వాటిని వెలిగించాలి. దారం మెల్లగా కాలుతూ, కొంతకాలి ఆగిపోతూ, వెంట్రుక కాలిన వాసన వస్తూ, బూడిద మెత్తటి ΄÷డిలా రాలితే అది స్వచ్ఛమైన పట్టుదారం. దారం వేగంగా కాలిపోతూ, పేపర్ కాలిన వాసనతో గరుకు బూడిద రాలితే అది నకిలీ పట్టు. కొన్నింటికి నకిలీ పట్టు దారాలను కాల్చినప్పుడు వ్యర్థం జిగురుగా ముద్దలా వస్తుంది.
మరో విషయం ఏమిటంటే అసలైన పట్టుదారంతో నేసిన పవర్‌లూమ్ చీరకు సిల్క్ మార్క్ ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే సిల్క్‌మార్క్ అనేది పట్టుకు కొలమానమే కానీ చేతితో నేసిన వాటిని పవర్ మగ్గం మీద నేసిన వాటినీ వర్గీకరించే వ్యవస్థ కాదు. సిల్క్‌మార్క్ ఉన్న చీరల్లో కూడా ఏది చేతితో నేసిన నేత, ఏది పవర్ లూమ్ మీద నేసిన చీర అనేది తెలుసుకోవడం కూడా ఓ కళ. సిల్క్‌మార్క్ ఉన్న పవర్‌లూమ్ చీర ధర సిల్క్‌మార్క్ ఉన్న చేనేత చీర ధరలో దాదాపు సగమే ఉండాలి. ఆ తేడాను గుర్తించాలి, గౌరవించాలి. అప్పుడే చేనేత కళ కొనసాగుతుంది.
పదివేల పురుగుల శ్రమ
ఒక పట్టుచీర తయారు కావాలంటే పదివేల పట్టుగూళ్లు కావాలి. పట్టు పురుగుల పెంపకం అంటే పసిపిల్లలను పెంచినట్లే. ఆ రైతు శ్రమ ఉంటుంది. ఆ తర్వాత పట్టుగూడు నుంచి దారం తీసే వాళ్ల శ్రమ. ఆ దారంతో మగ్గం మీద చీరను నేసే చేనేతకారుల శ్రమ. ఒక పట్టుచీర ధరలో పట్టు రైతుకు దక్కేది, దారం తీసిన వాళ్లకు దక్కేది, చేనేతకారులకు దక్కేది స్వల్పమే. శ్రమించకుండా భారీ ఆదాయం తీసుకునే వాళ్లు పట్టుదారం కొనే ట్రేడర్, పట్టుచీరను అమ్మే దుకాణదారులు మాత్రమే. చేనేతకారులు, దారం తయారు చేసే వాళ్లు మధ్య దళారుల దోపిడీకి గురవుతున్నారు.
వ్యవస్థ ఉంది కానీ...
అవగాహన లేదు! నకిలీ పట్టు చీరలను అసలైన పట్టుచీరలుగా నమ్మిస్తున్న మోసాన్ని నివారించడం కోసం ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ‘సిల్క్ మార్క్ లేబిల్’ని తయారు చేసింది. ఇది జరిగి పదేళ్లయినా ఈ విషయం తెలిసిన వాళ్లు ఒక్క శాతం కూడా లేరు. వినియోగదారులు చైతన్యం అయినప్పుడే ఈ మోసానికి అడ్డుకట్ట పడుతుంది. సిల్క్‌మార్క్ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సిల్క్ మార్క్ లేబిల్‌నే నా బిజినెస్‌కి లోగోగా పెట్టుకున్నాను. ప్రతి ఒక్కరూ అసలైన పట్టుచీరలే కొనాలని చెప్పను. అసలైన పట్టుచీరకు అంత ధర పెట్టడం ఇష్టం లేని వాళ్లు పట్టును పోలిన సింథటిక్ చీర కొనుక్కోవడం తప్పుకాదు. అయితే ఆ విషయం తెలిసి చేయాలి తప్ప, అసలైన పట్టుచీరనే కొనుక్కున్నామనే భ్రమలో నకిలీ పట్టు చీరలను కొని మోసపోకూడదు. రెండేళ్లపాటు కంచి, వెంకటగిరి, ధర్మవరం, బనారస్, గద్వాల్‌వంటి చేనేతకారుల గ్రామాల్లో పర్యటించిన తర్వాత నాకు తెలిసిన విషయాలివి.
– కల్యాణి, రామి సిల్క్స్, హైదరాబాద్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటో : ఎస్. ఎస్. ఠాకూర్
Comments
Please login to add a commentAdd a comment