
ఎంతో ఆనందంగా సాగిపోతున్న పచ్చని సంసారంలో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన ఉపద్రవాలు కుటుంబంలోని సంతోషాన్ని చిదిమేశాయి. అయినా తట్టుకుని నిలబడి, మరెంతో మంది అభాగ్యుల జీవితాల్లో సంతోషం అనే పువ్వులు పూయిస్తోంది ఆ ఇంటి ఇల్లాలు నిధీ అగర్వాల్.
ఢిల్లీకి చెందిన నిధీ అగర్వాల్ భర్త అతుల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో లాజిస్టిక్ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2012లో అరుదైన వ్యాధి ‘మల్టిపుల్ సిస్టమ్ అట్రోఫీ’ వచ్చింది. దీంతో అతుల్ మెదడులోని కణాలు క్రమంగా క్షీణించడంతో శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేశాయి. దీంతో మాటలు, శరీరంలో కదలికలు ఆగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. రోజులు గడిచే కొద్ది ఆహారం కూడా తీసుకోవడం కష్టమైంది. పైపు ద్వారా తీసుకోవాల్సి వచ్చింది.
పచ్చని సంసారంలో ఏర్పడిన ఈ విపత్తు నుంచి కోలుకోక ముందే, నిధీ అగర్వాల్‌కు ఆరోగ్యం బాగుండకపోవడంతో పరీక్షలు చేసిన వైద్యులు 2014 లో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. అసలే భర్త పరిస్థితి బాగాలేదు. ఈ సమయంలో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తెలియడంతో బాధను ఆపుకోలేకపోయింది.
అయితే అదృష్టవశాత్తూ తొలిదశలోనే తెలియడం కొంత మెరుగైంది. తనకొచ్చిన కష్టాన్ని దిగమింగుకుని కీమోథెర పీ తీసుకుని కాస్త కుదుటపడింది. ఆతరువాత బ్యూటీ థెరపీ తీసుకుంది. ఈ థెరపీ తో నిధీ అగర్వాల్‌కు కొంత ఉపశాంతితోపాటు, జీవితంపై ఆశలు చిగురించాయి.
బ్లిస్ ఫౌండేషన్..
తనలాగా అనేక కుటుంబ కష్టాలు, వివిధ రకాల రోగాలతో బాధపడుతోన్న వారికి బ్యూటీథెరపీతో తను పొందిన ఉపశాంతిని అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన కొడుకు సాయంతో ‘బ్లిస్ ఫౌండేషన్’ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ ద్వారా.. క్యాన్సర్ రోగులకు బ్యూటీ థెరపీ అందిస్తోంది.
ఈ థెరపీలో భాగంగా రోగులకు మేకప్ వేయడంతోపాటు, మోడల్ హెయిర్ స్టైల్స్‌తో అందంగా, సరికొత్తగా చూపిస్తూ వారికి జీవితం మీద ఆశలు కల్పిస్తోంది. రోగులను అందంగా అలంకరించి వారిని ర్యాంప్ వాక్ చేయించి వారిలో రోగులమన్న భావనను తీసివేసేందుకు కృషి చేయసాగింది.
జుంబా కూడా..
బ్యూటీ థెరపీతోపాటు జుంబా, థియేటర్ థెరపీ తో రోగుల బాధాకర భావోద్వేగాలను నియంత్రిస్తోంది. ఈ థెరపీలే కాదు, క్యాన్సర్‌ను ఎలా జయించాలో తెలిపే అవగాహన కార్యక్రమాలను ‘క్యాన్సర్ సర్వైవర్ మంత్’ పేరిట నిర్వహిస్తోంది.
క్యాన్సర్‌ను తొలిదశలో ఎలా గుర్తించాలి? ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలో అవగాహన కార్యక్రమాల ద్వారా వివరిస్తూ అనేకమంది రోగులకు సాంత్వన కలిగిస్తోంది. కష్టాలను జయిస్తూనే, సంతోషంగా ఎలా ఉండవచ్చనే మాటకు ఉదాహరణగా నిలుస్తోంది నిధీ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment