దేవయాని : అమెరికాలో భారత దౌత్య అధికారిగా
నవ్వును స్టాప్ చేసేవి.. చాలా జరిగాయి దేవయాని జీవితంలో! ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ తను. ఆమెరికాలో పోలీసులు కేసు పెట్టారు. కస్టడీలోకి తీసుకున్నారు. నేరస్థుల మధ్య ఉంచారు. ఇండియాలో మరికొన్ని కేసులు. విచారణలో అన్నీ తేలిపోయాయి. ఇప్పుడు మళ్లీ రాయబారిగా కాంబోడియా వెళ్తున్నారు! కెరియర్‌లోని ప్రతి కష్టంలోనూ.. ‘నవ్వు నా బెస్ట్ ఫ్రెండ్’ అన్నట్లుగానే.. చిరునవ్వుతో నిలిచారు దేవయాని!
దేవయాని ఖోబ్రాగడే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్. ఇండియన్ ఫారిన్ సర్వీసు. 1999 బ్యాచ్. ఏడేళ్ల క్రితం యు.ఎస్.లో ఆమె అరెస్ట్ అయినప్పుడు ఇండియా ఆమె కోసం అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలని ఢిల్లీలో జరిగిన అత్యున్నతస్థాయి ఆకస్మిక సమావేశంలో తీర్మానించింది. దేవయాని ఒక సాధారణ భారతీయ పౌరురాలు అయి వున్నా, ఆమె పట్ల అమెరికా వ్యవహరించిన తీరుకు భారత ప్రభుత్వం తీవ్రంగానే స్పందించి ఉండేది. అంతగా దేవయానిని అమెరికా వేధించింది. పోలీసులు ఆమె చేతులకు బేడీలు వేశారు. ఒంటి మీద వస్త్రాలు తీయించారు. సాధారణ నేరస్థులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఉన్న సెల్‌లో, వారితోపాటే ఆమెను ఉంచారు. అంతకుముందు ఏడాదే 2012లో న్యూయార్క్‌లోని ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా’కు డిప్యూటీ కాన్సూల్ జనరల్‌గా వెళ్లారు దేవయాని.
రెండు దేశాల మధ్య మహిళలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలను చూడటం ఆమె పని. ఒక దేశం తరఫున అంత పెద్దపొజిషన్‌లో ఉన్న అధికారి అయిన దేవయానిని మహిళ అని కూడా చూడకుండా అమెరికన్ పోలీసులు కస్టడీలో ఉంచారు! వీసా మోసం, తన పనిమనిషికి కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం.. ఇవీ ఆమె మీద నేరారోపణలు. 2013 డిసెంబర్ 13న దేవయాని అరెస్ట్ అయితే, 2014 జనవరి కల్లా ఇండియా ఒత్తిడిపై ఆమె బయటపడ్డారు. దౌత్యవేత్తకు ఉండే విశేష మినహాయింపులతో భారత ప్రభుత్వం ఆమె మీద ఉన్న ఆరోపణలను, అమెరికాలో నమోదైన కేసులను పక్కనపడేసి, కొంత విరామం తర్వాత ఢిల్లీలోని ఎం.ఇ.ఎ. (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్)లో జాయింట్ సెక్రెటరీగా ప్రత్యేక స్థానం కల్పించింది. ఇన్నేళ్లుగా దేవయాని అక్కడే పని చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లీ ఆమెకు తగిన హోదా వచ్చింది. కాంబోడియాకు భారత రాయబారిగా వెళ్తున్నారు!
∙∙∙
దేవయాని చురుకైన ఆఫీసర్. ఎవరు కాదు? ఐ.ఎ.ఎస్.లు, ఐ.ఎఫ్.ఎస్.లు అలాగే కదా ఉంటారు! దేవయాని ఇంకొంచెం ఎక్కువ. ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే రిటైర్డ్ ఐయ్యేఎస్. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మహారాష్ట్రలోని తారాపూర్ వీళ్ల కుటుంబానిది. ఐఎఫ్‌ఎస్‌లోకి రాకముందు దేవయాని మెడిసిన్ చదివారు. యు.ఎస్. నుంచి రాగానే దేవయాని ఢిల్లీలోని ‘డెవలప్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్ అడ్మినిస్ట్రేషన్’ (డి.పి.ఎ.) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014 డిసెంబర్‌లో ఆమెను ‘కంపల్సరీ వెయిట్’లో ఉంచారు. దేవయాని పిల్లలకు రెండు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయనే ఒక పూర్వపు ఆరోపణపై విచారణ జరిపేందుకే కొద్ది రోజులు ఆమెను విధుల నుంచి దూరంగా ఉంచారు.
తనేం తప్పు చేయలేదని నిరూపించుకున్నారు దేవయాని. తిరిగి పోస్టింగ్‌లోకి వచ్చారు. 2015 జూలైలో విదేశీ వ్యవహారాల శాఖ ‘స్టేట్ డివిజన్’ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. అయితే ప్రమోషన్ లేకుండా! దానిపై దేవయాని క్యాట్‌ని ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున ల్. ఏడు నెలల తర్వాత క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో గ్రేడ్–త్రీ ఆఫీసర్ హోదాలో జాయింట్ సెక్రటరీగా నియమించింది. ఇప్పుడు కాంబోడియాకు ఇంకో ప్రమోషన్.
దేవయాని భర్త డాక్టర్ ఆకాశ్ సింగ్ రాథోడ్ అమెరికా పౌరుడు. ఉండటం ఇటలీలో. రోమ్‌లోని లూయిస్స్ యూనివర్శిటీలో రిసెర్చ్ ప్రొఫెసర్. ఇద్దరు కూతుళ్లు. తల్లితో ఇండియాలోను ఉంటున్నారు. దేవయాని ఖోబ్రాగడే రచయిత్రి కూడా! ‘ది వైట్ శారీ’అనే పుస్తకం రాశారు. లవ్‌స్టోరీ అది. ఓ కులాంతర ప్రేమ జంట కథ. పిల్లల కోసం మరో పుస్తకం రాశారు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ యంగ్ అంబేడ్కర్’ ఆ పుస్తకం. 41 ఏళ్ల దేవయానిలో ప్రత్యేక ఆకర్షణ ఆమె చిరునవ్వు. కెరీర్‌లోని ఆటుపోట్ల సమయంలోనూ ఆ చిరునవ్వు ఆమెను వదిలిపోలేదు. నవ్వు ఆమె బెస్ట్ ఫ్రెండ్.
Comments
Please login to add a commentAdd a comment