దీపావళి వస్తోంది...ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది.పిల్లల ముఖాల్లో మతాబులు వెలుగుతాయి.మరి... వంటిల్లు బోసిపోతే ఎలాగ?ఫ్రిజ్‌లోంచి బ్రెడ్... క్యారట్ తీయండి.
స్టవ్ వెలిగించండి... చక్కెర డబ్బా మూత తీయండి. దివ్యంగా వండండి!
షాహీ తుకడా
కావలసినవి: బ్రెడ్ స్లయిస్‌లు –5; నీరు – టీ స్పూన్; పాలు– 3 కప్పులు; జీడిపప్పు– గుప్పెడు; పిస్తా– గుప్పెడు; బాదం – గుప్పెడు; యాలకులు – 2 (పొడి చేయాలి); నెయ్యి – అరకప్పు; చక్కెర – అర కప్పు; కుంకుమ పువ్వు – 6 రేకలు;
తయారీ:
బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న పెనంలో చక్కెరలో నీటిని పోసి సన్న మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తరవాత అందులో కుంకుమ పువ్వు రేకలు వేయాలి. చక్కెర తీగపాకం వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి.
ఒక పాత్రలోపాలు పోసి మరిగించాలి. మధ్యలో గరిటెతో అడుగు పట్టకుడా కలుపుతూ పాలు చిక్కబడి పావు వంతుకు వచ్చే వరకు మరిగించి యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత పైన తయారు చేసి సిద్ధంగా ఉంచిన చక్కెరపాకంలో నాలుగవ వంతు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ఇది రబ్రీ.
బ్రెడ్ స్లయిస్‌లను అంచులు తీసేసి త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ∙మరొక పెనంలో నెయ్యి వేడి చేసి బ్రెడ్ ముక్కలను అన్ని వైపులా దోరగా కాల్చాలి. పెనం మీద నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి వెడల్పుగా, అంగుళం లోతు ఉన్న ప్లేట్‌లో అమర్చాలి. ఇలా అన్ని స్లయిస్‌లను వేయించి, చక్కెర పాకంలో ముంచి తీసి ప్లేట్‌లో సర్దాలి.
ఇప్పుడు ప్లేట్‌లో ఉన్న బ్రెడ్ స్లయిస్‌ల మీద రబ్రీ పోసి, ఆ పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను చల్లాలి.
గమనిక: పాలను రబ్డీ చేసే సమయం లేకపోతే కండెన్స్‌డ్ మిల్క్ వాడవచ్చు. డయాబెటిస్ పేషెంట్‌లు తినాలంటే చక్కెర బదులుగా మార్కెట్‌లో దొరికే షుగర్ ఫ్రీ లేదా స్టీవియాలను వాడవచ్చు.
క్యారట్ బర్పీ
కావలసినవి: క్యారట్ – అర కిలో; నెయ్యి – 3 టేబుల్ స్పూన్‌లు పాలు – కప్పు; చక్కెర – అర కప్పు; యాలకుల పొడి– అర టీ స్పూన్; పిస్తా – గుప్పెడు (తరగాలి);
తయారీ:
క్యారట్‌ను కడిగి చెక్కు తీసి తురమాలి.
మందపాటి బాణలిలో రెండున్నర టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేడి చేసి అందులో క్యారట్ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి సన్నమంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి.
ఇప్పుడు క్యారట్ తురుములో పాలు పోసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల సేపు ఉడికించాలి. క్యారట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.
చక్కెర కరిగేకొద్దీ మిశ్రమం ద్రవంగా మారుతుంటుంది. కొద్ది సేపటికి తిరిగి దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మిశ్రమం అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా దగ్గరయ్యే వరకు ఉంచాలి.
ఈ లోపు ఒక ట్రేకి నెయ్యి రాసి క్యారట్ మిశ్రమంపోయడానికి సిద్ధం చేసుకోవాలి. క్యారట్ పాకం గట్టి పడిన తరవాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి రాసిన ట్రేలో పోసి సమంగా సర్ది పిస్తా పలుకులను అద్దితే క్యారట్ బర్ఫీ రెడీ. బర్ఫీ వేడి తగ్గిన తర్వాత చాకుతో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కలను ప్లేట్ నుంచి సులువుగా వేరు చేయవచ్చు.
గమనిక: క్యారట్ మిశ్రమాన్ని ఎప్పుడు ట్రేలోపోయాలనేది స్పష్టంగా తెలియాలంటే... స్పూన్‌తో కొద్దిగా తీసుకుని చల్లారిన తరవాత చేత్తో బాల్‌గా చేసి చూడాలి. తురుము జారిపడకుండా బాల్ గట్టిగా వస్తే అప్పుడు మంట మీద నుంచి దించేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment