తమలపాకులు అనగానే ఆధ్మాత్మిక భావన కలుగుతుంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో తమలపాకుల వాడకం క్రీ.పూ 400 నాటిది. పురాతన కాలంనుంచి ఆయుర్వేద ఔషధాల్లో తమలపాకుల పాత్ర ఉంది.
తమలపాకు పైపెరేసి కుటుంబానికి చెందినది. తమలపాకులో తమిళంలో వెతలై, తెలుగులో తమలపాకు, హిందీలో పాన్ కా పఠా అని పిలుస్తారు. తమలపాకును విందు భోజనాల తరువాత తాంబూలంలో వాడతారు అనుకుంటే పొరబాటే. తమలపాకును మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో కార్డియోవాస్కులర్ , యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ/ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటీ- అల్సర్, హెపాటో-ప్రొటెక్టివ్ , యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి వివిధ లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు దీన్ని కామోద్దీపనకు పనికివస్తుందని కూడా భావిస్తారు.
తమలపాకులోని పోషక విలువలు
శుభకార్యం వచ్చిందంటే.. తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. తమలపాకులను దేవుడికి సమర్పించడం మంచిదని, ఇతరులకు అందించినా శుభం జరుగుతుందని మన భారతీయులు భావిస్తారు. తమలపాకులో తగిన మొత్తంలో అవసరమైన పోషకాలు ఉంటాయి , 100 గ్రాముల తమలపాకులో ఈ పోషకాలు ఉంటాయి.
అయోడిన్ 1.3 గ్రాములు, పొటాషియం 1.1-4.6 మైక్రోగ్రాములు
విటమిన్ ఎ 1.9-2.9 మైక్రోగ్రాములు, విటమిన్ బి 1 13-0 మైక్రోగ్రాములు
విటమిన్ B2 1.9-30 మైక్రోగ్రాములు, నికోటినిక్ యాసిడ్ 0.63-0.89 మైక్రోగ్రాములు
తమలపాకు ప్రయోజనాలు
తమలపాకును నమలడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. తమలపాకులను నేరుగా నమిలి తినవచ్చు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, తమలపాకులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగితే పేగు ఆరోగ్యానికి మంచిది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తమలపాకులో కార్మినేటివ్, యాంటీ ఫ్లాట్యులెన్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.ఇవి జీర్ణశయాంతర సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలను గ్రహించడానికి ప్రేగులను ప్రేరేపిస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు , ఛాతీలో ఇబ్బంది, ఉబ్బసం లక్షణాలను ఉపశమనానికి , నయం చేయడానికి ఉపయోగిస్తారు . తమలపాకుకు ఆవాల నూనె రాసి ఛాతీపై ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచితే చాతీలో ఇబ్బంది తగ్గుతుంది. తమలపాకు పేస్ట్‌ను చూర్ణం రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం కలిగుతుంది.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నిప్పుల మీద తమలపాకును వేడిచేసి, దాన్ని పసిపిల్లలకు గుండెలమీద కాస్తారు. రెండుచుక్కల తమలపాకు రసాన్ని తేనెలో రంగరించి పిల్లలకు నెమ్మదిగా పడితే (వేలితే నాకించాలి) దగ్గు తగ్గుతుందని పెద్దలు చెబుతారు.
ఆర్థరైటిస్ వల్ల కీళ్ల భాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుంది. కాల్షియం లోపం ఉన్నవాళ్లు తమలపాకుల్లో సున్నం కలిపి తింటే మేలు. విటమిన్ సీ అధికంగా కలిగి ఉండే తమలపాకులు తింటే రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
ఎక్కవగా తినకూడదా?
రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే, డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఒక అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు వ్యక్తులు తాంబూలం సేవించేపటుడు జాగ్రత్తగా ఉండాలి. తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ లాంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తమలపాకులు ఎప్పుడూ కూడా లేతగా తాజాగా ఉన్న వాటిని మాత్రమే తినాలి.
కొంతమందికి తాంబూలంలో వాడే వక్కతో, సున్నంతో గొంతు పట్టేయడం లాంటి ఇబ్బంది వస్తుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తాంబూల సేవనం మితిమీరితే నోటి, దంత, సమస్యలు వస్తాయి.
తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?
తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాధికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు, చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకోవడం ఆరోగ్యప్రదం. అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్ధిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి తొడిమలు, చివరలు తుంచివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక. అంతేకాదు తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి. అయితే ఈ అభ్యంతరాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఏదైనా మితంగా ఉండటమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment