అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా!
కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు.
ఇలా ఫిలిప్పీన్స్ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది.
దేవతలకు పెట్టొచ్చా అంటే..
దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు.
అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు.
పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని సాగనంపుతాం. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది.
(చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!)
Comments
Please login to add a commentAdd a comment