ఏనుగులకు క్యాన్సర్‌ రాదా? | Elephants Rarely Get Cancer By University At Buffalo Research | Sakshi
Sakshi News home page

ఏనుగులకు క్యాన్సర్‌ రాదా?

Published Mon, Feb 15 2021 9:04 AM | Last Updated on Mon, Feb 15 2021 9:04 AM

Elephants Rarely Get Cancer By University At Buffalo Research - Sakshi

మానవ విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ఆ విజ్ఞానానికి లొంగని మహమ్మారుల్లో క్యాన్సర్‌ ఒకటి. కేవలం మనిషికే కాకుండా పలు జీవజాతుల్లో క్యాన్సర్‌ కనిపిస్తుంది. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా భూమ్మీద అతిపెద్ద క్షీరదం ఏనుగుల్లో మాత్రం ఈ వ్యాధి చాలా చాలా అరుదు. ఇందుకు కారణం తాజా అధ్యయనాల్లో బయటపడింది. సాధారణంగా జీవి సైజు పెరిగేకొద్దీ అందులో కణజాలం ఎక్కువగా ఉండి, క్యాన్సర్‌కు రిస్కు అధికం అవుతుంది.

ఎన్ని ఎక్కువ కణాలుంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌ రావడానికి అవకాశాలుంటాయి. ఆ లెక్కన చూస్తే ఏనుగులే అత్యధికంగా క్యాన్సర్‌ బారిన పడాలి. కానీ వీటిలో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంపై యూనివర్సిటీ ఎట్‌ బుఫాలో ప్రత్యేక అధ్యయనాలు జరిపింది. ఏనుగుల్లో ట్యూమర్‌(కణితి) అణిచివేత జన్యువులు (టీపీ53 అంటారు) అధికంగా ఉంటాయని, అందువల్ల ఇవన్నీ కలిసి క్యాన్సర్‌ రెసిస్టెన్స్‌గా పనిచేస్తాయని అధ్యయనం వెల్లడిస్తోంది.

ప్రకృతి వరం
 ఈ జన్యువులు ఇతర జీవుల్లో కూడా ఉంటాయి, కానీ ఏనుగుల్లో వీటి రిప్లికేషన్‌ (ప్రతికృతి) అధికంగా జరుగుతుంటుంది, అందువల్ల ఈ జన్యువులు అధికసంఖ్యలో ఏనుగుల్లో కనిపిస్తాయి. ఇందుకు పరిణామక్రమంలో భాగంగా ఏనుగులు భారీ శరీరాకృతి కలిగి ఉండడమే కారణమని, ఈ భారీ శరీరాన్ని సమతుల్యం చేసేందుకే ప్రకృతి ఏనుగుల్లో ట్యూమర్‌ రిప్రెసింగ్‌ జీన్స్‌ అధిక సంఖ్యలో ఉంచిందని అధ్యయనం వివరిస్తోంది. దీర్ఘ జీవిత కాలం గడిపే జీవుల్లో ఉత్పరివర్తనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీటిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా అధికం.

ఏనుగులు సాధారణంగా దీర్ఘకాలం జీవిస్తాయి. అలాగే వీటి శరీర పరిమాణం కూడా పెద్దది. ఈ రెండు కారణాలు క్యాన్సర్‌ వచ్చేందుకు కారణాలు కనుక ప్రకృతి ప్రత్యేక జీన్స్‌ను ఇవ్వడం ద్వారా ఏనుగులను క్యాన్సర్‌ బారినుంచి రక్షించింది. ఈ పరిశోధనను క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్లో వినియోగించుకొని ఈ మహమ్మారిని అరికట్టేందుకు యత్నించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చదవండి: చిరంజీవి ఫోన్‌ చేశారు
చదవండి:  ప్రేమికుల రోజు: భార్యకు కిడ్నీ కానుక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement