అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను’ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఒకదానిని ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రథమ పురుషలకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషలకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి.
.ఈ ‘నేను’ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతకాలి. అప్పుడు అది మాయమవుతుంది. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే.
‘నేను’ అనే ఆలోచన పుట్టుకే వ్యక్తి జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకోవాలి. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది.
నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం ‘నీ నిజస్వరూపం’. ఆత్మయే చైతన్యంగా మారి ’నేను ఫలానా’ అని గిరిగీసుకోవటమే ’అహం’. అంతకు మించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు.
విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది.
మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం.
మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయా రంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది.
మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు...
మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.
ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి అని.
మీరు ఆ భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మీమనస్సు ఎక్కడెక్కడికో వెళుతుంది. మనస్సు తత్త్వం అలాంటిది. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు.
ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు. అందుకనే, నేను శూన్యం అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి.
దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. ప్రతి రోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా పక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్కర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి.
– భువనగిరి కిషన్ యోగి
► మీ పొరపాటు ఆలోచనలన్నిటినీ విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది.
► మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది.
► నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే ‘నీ నిజస్వరూపం’
Comments
Please login to add a commentAdd a comment