పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే తమ వివాహ వేడుకను ఎప్పటికి గుర్తుండేలా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని వధూవరులు ఆశపడుతుంటారు. కొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటే, మరికొందరు రిచ్ ప్యాలెస్‌లోనో, సముద్రానికి దగ్గరగా ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్లు వాళ్లుపెళ్లి వేడుకను ప్లాన్ చేస్తుంటారు.
అయితే మహారాష్ట్రలో మాత్రం ఓ పెళ్లి వేడుక స్మశానంలో జరిగింది. సంప్రదాయబద్దంగా బంధువుల సమక్షంలో ఈ తంతు పూర్తైంది. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ స్మశానంలో పెళ్లి చేసుకోవడం కొత్త కాన్సెప్టా? దీని వెనుక ఇంకేమైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం.
స్మశానంలో ప్రేమికుల పెళ్లి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్.. స్మశాన వాటికలో కాటికాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. కుటుంబంతో కలిసి ఎన్నో ఏళ్లుగా స్మశానవాటికలోనే నివాసం ఉండేవారు. ఆయనకు మయూరి అనే కూతురు ఉంది.
12 తరగతి వరకు చదువుకున్న ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె పని చేస్తున్న సంస్థలో మనోజ్ అనే యువకుడు ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరి పరిచయం స్నేహం నుంచి ప్రేమగా మారింది. వీరి ప్రేమను ఇరు కుటుంబ వర్గాలు కూడా అంగీకరించాయి. అయితే తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని గంగాధర్ ఎప్పట్నుంచో భావించాడట.
ఈ విషయాన్నే అబ్బాయి కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఇక ఆయన కోరికను కాదనలేక మయూరి పెరిగిన స్మశానంలోనే బంధువుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పెళ్లిని జరిపించారు. ప్రస్తుతం ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment