ఎన్నెన్నో వింత కథల వాన | Folk tales around the rain in the world | Sakshi
Sakshi News home page

ఎన్నెన్నో వింత కథల వాన

Published Fri, Jun 17 2022 12:15 AM | Last Updated on Fri, Jun 17 2022 12:41 AM

Folk tales around the rain in the world - Sakshi

ప్రపంచమంతా వాన చుట్టూ జానపద కథలు ఉన్నాయి. నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. వింతలు ఉన్నాయి. వినడానికీ  పిల్లలకు చెప్పడానికీ బాగుంటాయి. వాన జోరున పడేటప్పుడు స్నేహితులతో పంచుకోవాల్సిన సంగతులివి. వేడి వేడి పకోడి కబుర్లు.

మన జానపద కథ ఒకదాన్ని కెనడాలో చెప్పుకుంటారు. ఒక ఊళ్లో సుడిగాలి ఉండేవాడట. వాడు ఉత్త పోకిరి అట. దారిన పోయే ఆడవారిని బెదరగొడితే సుడిగాలి దెబ్బకు వారి పైటలు ఎగిరి ఇబ్బంది పడేవారట. ఇది ఊరి పెద్ద దృష్టికి వచ్చింది. ‘ఈ సుడిగాలిగాడు ఊళ్లో ఉండటానికే లేదు’ అని తీర్పు ఇచ్చాడు. ఇక సుడిగాలి ఊరు ఖాళీ చేయాల్సిందే. కాని సుడిగాలికి వాన మంచి ఫ్రెండు. వానకు కళ్లు లేవు. సుడిగాలే వానను మోసుకు తిరుగుతుంటాడు.

‘నువ్వు ఊరు ఖాళీ చేస్తే నేనెందుకు ఇక్కడుంటాను. నన్ను కూడా తీసుకుపో’ అని వాన అంటే సుడిగాలి సరేనన్నాడు. దోస్తులిద్దరూ చెప్పాపెట్టకుండా మాయమయ్యారు. ఏముంది... మూడు నెలలు గడిచే సరికి బాధ తెలిసి వచ్చింది. గాలి లేదు. దాని వెనుక వచ్చే వాన లేదు. దాంతో పంటలు పోయాయి. ఊరి పెద్ద నాలుక్కరుచుకుని ‘సుడిగాలిని వెతికి తెచ్చే వీరులెవరు?’ అని ప్రకటన చేశాడు. ఒంటె వచ్చింది. ఏనుగు వచ్చింది. నక్క వచ్చింది. ఎవరు ఎంత దూరం వెతికినా సుడిగాలి కనిపించలేదు.

దాంతో పక్షులకు చెబుదాం అనుకున్నాడు ఊరి పెద్ద. కొంగ, నెమలి, గువ్వ వెతికాయి. కనిపించలేదు. ‘పెద్దయ్యా... నేను వెతికి తెస్తాను’ అని ఒక పిచుక అంది. ‘నువ్వా... సరే’ అన్నాడు పెద్దయ్య. పిచుక సుడిగాలిని వెతుక్కుంటూ  వెళ్లింది. ఆకాశంలో నుంచి కిందకు చూస్తూ వెతగ్గా వెతగ్గా కింద ఒక ఝరి కనిపించింది. దాని మీదుగా ఎగురుకుంటూ వెళితే అందమైన తోట కనిపించింది. దాని పక్కనే గుహ. దాని మొదల్లో పచ్చగడ్డి. అవును... సుడిగాలి ఇక్కడే ఉండుంటాడు అని చూస్తే లోపలే సుడిగాలి, వర్షం ఉన్నారు. పిచుక సంగతి చెప్పి ‘ఊరు నాశనం అయ్యింది.

రండి’ అనంటే.. ‘అరెరె.. వెనకే వస్తాం. నువ్వు పోయి సంగతి చెప్పు’ అన్నారు నేస్తులు. పిచుక ముందుగా ఊరు చేరి తమ పిచుక పెద్దలకు చెప్తే అవన్నీ సంతోషంతో గుమిగూడి కిచకిచలాడాయి. ఆ మరుసటిరోజు సుడిగాలి, దాని వెనుక హోరున వాన. మళ్లీ ఊరు కళకళలాడింది. సుడిగాలిని వెతికి తెచ్చిన పిచుకకు కృతజ్ఞత చెప్పాడు పెద్దయ్య. ఏ కారణం రీత్యా గానీ పిచుకలను వేటాడకూడదని ఆ రోజున తాకీదు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనం పిచుకను వేటాడరు. పాపం అనుకుంటారు. వాన వచ్చే ముందు పిచుకలు దగ్గరకు మూగి కిచకిచలాడే ఆనవాయితీ పోలేదు. ఇదీ కథ.

ఇంద్రధనుస్సు
ఈ కథ కూడా కొన్నిచోట్ల పిల్లలకు చెప్తారు. ఒకరోజు ఆకాశంలో బుజ్జిపాపలైన నల్లమేఘాలు, తెల్లమేఘాలు పరుగు పందెం పెట్టుకున్నాయట. తల్లి తూర్పుగాలి వచ్చి ‘ఇది వేళ కాదు నాయనా’ అన్నా వినిపించుకోకుండా ఇరుపక్షాలు పరుగుతీశాయట. ఆకాశంలో వీరి పరుగు ముందు సరదాగా మొదలైంది. నవ్వులాటలు... వెక్కిరింతలు సాగాయి. ఎవరు గెలిచారో ఎవరు ఓడారో తెలిసేలోపు గాలి మళ్లింది. ఒకదానితో ఒకటి డీకొట్టుకున్నాయి. తలలు బొప్పికట్టాయి. నల్ల మేఘాల నిండా నీళ్లే. అవి ఏడుస్తుంటే భోరున వాన కురిసింది. ఇది సూర్యభగవానుడు గమనించాడు.

‘అరెరె... నాయనలాగా ఏడవకండి’ అని వారి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలను పంపాడు. ఆ ఏడుగురు అప్సరసలు ఏడు రంగుల గౌన్లు ధరించి ఆ నల్లమేఘాల దగ్గరకు వచ్చి కళ్లు తుడిచారు. వాళ్ల ఏడుపు, దాంతో పాటే వాన ఆగింది. వెనక్కు మళ్లుదామనుకున్న అప్సరసలు తమ గౌన్లు తడవడంతో వాటిని కాసేపు ఆకాశంలో ఆరనిచ్చారు. ఆకాశంలో మబ్బులన్నీ చెదిరిపోగా వారి ఏడురంగుల గౌన్లు కింద ఉన్నవారికి ఇంద్రధనుస్సులాగా కనిపిస్తూ ఉండిపోయాయి. ఈ సారి నల్ల మేఘాలు ఏడ్చినప్పుడు వాటి కళ్లు తుడవడానికి ఏడుగురు అప్సరసలు వస్తారేమో చూడండి.

ఎన్నెన్నో విశ్వాసాలు
మన దేశంలో వ్యవసాయం దాదాపుగా వర్షాధారం. అందుకే రుతుపవనాల రాక కోసం జానపదులు, గ్రామీణులు ఎన్నెన్నో విశ్వాసాలు, క్రతువులు పెట్టుకున్నారు. వారికి ఎలాగైనా వాన కావాలి మరి. కప్పల పెళ్లి జరిపించడం మనం చూస్తూ ఉంటాం. వానాకాలంలో కప్పలు ప్రత్యుత్పత్తికి దిగుతాయి. కప్పల పెళ్లి జరిపించడంలో అంతరార్థం వాటికి పెళ్లి జరిగి, ప్రత్యుత్పత్తికి దిగాయి కనుక రావాల్సిందేనని వానను హెచ్చరించడం.

ఇప్పుడు లేదుకాని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కూడా తమిళనాడు, బిహార్‌ రాష్ట్రాలలో వానలు పడకపోతే ఒక కన్నెపిల్ల చేత అర్ధరాత్రి నగ్నంగా నాగలి దున్నే కార్యక్రమం చేయించేవారు. ‘ఇంద్రుడు సిగ్గుపడి ఇకనైనా వాన కురిపిస్తాడనే నమ్మకం దీని వెనుక ఉంది’ అని పరిశోధకులు అంటారు. మధ్యప్రదేశ్‌లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం. రాజస్థాన్‌లో ఇదే పని రైతులు చేస్తారు. ఒకరినొకరు బురదతో కొట్టుకుంటారు. ‘ఇంత బురద పూసుకున్న ఈ అమాయకులను కడిగేద్దాం’ అని వాన అనుకోవాలట.

రాగాలతో వర్షాలు
హిందూస్తానీ సంగీతంలో ‘మల్హార్‌’ రాగం పాడితే వానలు పడతాయని నమ్మకం. తాన్‌సేన్‌ మల్హార్‌ పాడి వర్షాలు కురిపించాడని చరిత్ర. దక్షిణాది సంగీతంలో ‘అమృతవర్షిణి’ రాగం కూడా ఇలాంటిదే. ఒకసారి ముత్తుస్వామి దీక్షితార్‌ ‘అమృత వర్షిణి’ని అందుకుంటే ఆకాశం భళ్లుమని వాన మొదలైపోయిందట. జానపదులు మాత్రం ‘వానల్లు కురియాలి వానదేవుడా... వరిచేలు పండాలి వానదేవుడా’ అని వాళ్లకు తోచిన రాగంలో పాడి వానదేవుణ్ణి స్వాధీనంలోకి తెచ్చుకుంటారు.

గతంలో వాన రాకడ, ప్రాణం పోకడ అనేవారు. అంటే వాన ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు అని అర్థం. కాని ఇప్పుడు ఈ అర్థం కాదు. వాన వస్తే ప్రాణం పోతుంది అని! ఎందుకంటే ఎక్కడ గుంట ఉందో ఎక్కడ మిట్ట ఉందో ఎక్కడ స్తంభాలు కూలతాయో ఎక్కడ గోతులు తవ్వి ఉన్నారో తెలియదు కనుక.

వానాకాలంలో వాన కథలు చెప్పుకుందాం. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉందాం.
 
మధ్యప్రదేశ్‌లోని గోండులు భీముణ్ణే వానదేవుడు అనుకుంటారు. వానలు ఎంతకూ కురియకపోతే ఒక స్తంభాన్ని భీముడిగా తలచి పేడ, బురద పూస్తారు. వాటిని కడుక్కోవడానికైనా భీముడు వాన కురిపిస్తాడని నమ్మకం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement