ఎండలు బాగా ముదురుతున్నాయి కదా. ఇక చాలాకాలం పాటు వాడకుండా ఎప్పటినుంచో అలా ఓ మూల పడి ఉన్న వాటర్‌కూలర్ తీసి వాడాలనుకుంటున్నారా? దాన్ని అలా తీసేసి, వెంటనే ఇలా వాడేయకండి. నిద్రపోతున్నప్పుడు గదిని చల్లబరిచేందుకు వాడే ఎయిర్‌కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించడం అవసరం. గతేడాదో లేదా చాలాకాలం కిందటో వాటర్‌కూలర్ వాడటం మానేసిన సమయంలో దాని కింది భాగంలో ఎన్నో కొన్ని నీళ్లు ఉన్నాయనుకోండి. అక్కడ లీజియోనెల్లా అనే ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా కారణంగా ‘వాటర్ కూలర్ నిమోనియా’ అని వాడుక భాషలో పిలిచే ప్రమాదకరమైన నిమోనియా రావచ్చు. అందుకే అట్టడుగున ఎంత మాత్రమూ చెమ్మలేకుండా చేసేందుకు ఓసారి వాటర్‌కూలర్‌ను లోపలి చెమ్మ అంతా ఇగిరిపోయేలా చూడాలి. ఆ తర్వాతే వాటర్ కూలర్‌ను వాడాలి.
ఎయిర్ కూలర్ విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి. ఇక ఎయిర్‌కూలర్‌లో అడుగున నీరు ఉంటే ఇదే లీజియోనెల్లా బ్యాక్టీరియా ఇక్కడ కూడా చేరవచ్చు. అందుకే ఇలా ఎయిర్ కూలర్‌ను వాడేముందు ఒకసారి ఆరుబయటకు తీసుకొచ్చి, కాసేపు ఆన్ చేసి, అడుగున ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూడాలి. ఇలా ఆన్ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. కూలర్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. నేరుగా ఆన్ చేయడం వల్ల వాటి కారణంగా ఆస్తమా రోగుల్లో... (ఆ మాటకొస్తే కొందరు సాధారణ వ్యక్తుల్లో సైతం) దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు ట్రిగర్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఈ జాగ్రత్తలు.
Comments
Please login to add a commentAdd a comment