ఆనియన్ కీమా కప్స్
కావలసినవి : కీమా – పావు కిలో (ముందుగా ఉప్పు, కారం, మసాలా వేసుకుని ఉడికించి పెట్టుకోవాలి), ఆనియన్ కప్స్ – 6 (పెద్ద ఉల్లిపాయను మధ్యలోకి కట్ చేసి గుండ్రంగా పెద్దగా ఉండే కప్స్ తీసుకుని పెట్టుకోవాలి),గుడ్లు – 7, పాలు – 2 టేబుల్ స్పూన్లు, కారం, మిరియాల పొడి – అర టీ స్పూన్ చొప్పున, ఉప్పు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము – పావు కప్పు చొప్పున
తయారీ : ముందుగా గుడ్లు, పాలు, కారం, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము ఒకదాని తరవాత ఒకటి వేసుకుని బాగా కలుపుకుని.. వెడల్పు పాన్ మీద నూనె వేసుకుని, ఆనియన్ కప్స్ పెట్టుకుని, అందులో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకోవాలి. నిమిషంలోపే ఒక్కో ఆనియన్ కప్‌లో కీమా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకోవాలి. అనంతరం గుడ్ల మిశ్రమంతో కప్స్ నింపుకోవాలి. తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవచ్చు లేదా ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు.
ఐస్‌క్రీమ్ బ్రెడ్
కావలసినవి: ఐస్‌క్రీమ్ – 1 కప్పు (మీరు మెచ్చే ఫ్లేవర్), గోధుమ పిండి, బియ్యప్పిండి – ముప్పావు కప్పు చొప్పున, పంచదార పౌడర్ – పావుకప్పు, రైన్‌బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ – అభిరుచిని బట్టి
తయారీ: ముందుగా ఐస్‌క్రీమ్, పంచదార పౌడర్‌ను హ్యాండ్ మిక్సర్‌తో బాగా కలుపుకుని.. గోధుమ పిండి, బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి రైన్‌బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ ఆ మిశ్రమంలోనే కలుపుకుని బ్రెడ్ బౌల్‌లో వేసుకుని బేక్ చేసుకోవచ్చు. లేదా బ్రెడ్ బౌల్‌లో ఐస్‌క్రీమ్ మిశ్రమం వేసుకుని పైన రైన్‌బో స్ప్రింకిల్స్ లేదా చాక్లెట్ చిప్స్ వేసుకుని బేక్ చేసుకోవచ్చు.
గ్రేప్స్ జిలేబి
కావలసినవి: మైదా – 1 కప్పు, శనగ పిండి – 1 టేబుల్ స్పూన్, ద్రాక్ష పళ్లు – 1 కప్పు(మిక్సీపట్టి గుజ్జులా చేసుకోవాలి), గడ్డ పెరుగు, పంచదార – 1 కప్పు చొప్పున, నీరు – సరిపడా, ఏలకుల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్/ అభిరుచిని బట్టి), నెయ్యి – సరిపడా
తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్‌లోకి మైదా పిండి, శనగపిండి, పెరుగు తీసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులో ద్రాక్ష పళ్ల గుజ్జు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని, పాలలో పంచదార, అర కప్పు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. అందులో ఏలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకుని గరిటెతో తిప్పుతూ తీగ పాకం రాగానే.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో ద్రాక్ష–మైదా మిశ్రమంతో జిలేబీలు వేసి.. దోరగా వేగిన వెంటనే పాకంలో వేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment