పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ | group off women support to couple | Sakshi
Sakshi News home page

పచ్చని సంసారానికి ఆకుపచ్చని ఆర్మీ

Published Wed, Jul 19 2023 12:45 AM | Last Updated on Wed, Jul 19 2023 5:05 AM

group off women support to couple - Sakshi

పచ్చని సంసారానికి గ్రీన్‌ ఆర్మీ కావాలి అంటున్నారు వారణాసిలోని కుషియారి గ్రామ వాసులు. ఈగ్రామంలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాల వాళ్లే ఎక్కువ.నిరుపేదలు కావడంతో విద్యాగంధం ఉన్న వాళ్లు తక్కువ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే.

చాలా కుటుంబాల్లో పెద్దరికం వహించాల్సిన భర్తలు తాగుడు, మత్తుపదార్థాలకు బానిసలై  భార్యలను కొట్టడం, తిట్టడం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు అడిగితే తన్ని తరిమేయడం సర్వసాధారణమైంది. గత కొన్నేళ్లుగా భర్తల తీరుతో విసిగిపోయిన గ్రామ మహిళలకు రవి మిశ్రా అనే టీచర్‌ చుక్కానిలా దారిచూపుతున్నాడు.

భర్త బాధితురాలైన ఆశాదేవిని కలిసిన మిశ్రా సమస్యలు ఆమె ఒక్కదానికే కాదు, ఆమె ఇరుగు పోరుగు వారి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయని తెలుసుకున్నాడు. మీరంతా కలసికట్టుగా ఉంటే ఇవేమీ పెద్ద సమస్యలు కాదని చెప్పి, ఆశాదేవితోపాటు మరికొంతమంది మహిళలను కూడగట్టుకుని 2014లో ‘గ్రీన్‌ఆర్మీ’నిప్రారంభించారు.

వ్యసనాలకు బానిసలైన భర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సరైన దారిలో నడిపించడమే ఈ ఆర్మీ ముఖ్య ఉద్దేశ్యం. ఆర్మీలోని సభ్యులు పచ్చని రంగు చీర కట్టుకుని, కర్రలు పట్టుకుని ఎవరైనా ఇంట్లో భర్తలు తాగి గొడవచేస్తుంటే వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్‌ ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొస్తారు. లిక్కర్, మత్తుపదార్థాలకు బానిసలైన వారికి రకరకాలుగా కౌన్సెలింగ్‌ ఇచ్చి మంచి మనుషులుగా మార్చడానికి కృషిచేస్తోంది.

భర్తలతోపాటు.. గ్రామాభివృద్ధికి
ప్రస్తుతం ఈ ఆర్మీలో 1800 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆర్మీ చేస్తోన్న కార్యకలాపాలు చూసిన ఎంతోమంది ఇతర గ్రామాల్లో గులాబీ గ్యాంగ్‌ వంటి రకరకాల పేర్లతో ఆర్మీలను ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మహిళలు తమను తాము రక్షించుకొనేందుకు ఆత్మరక్షణ విద్యలలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు.

వారణాసి, మీర్జాపూర్‌ జిల్లాల్లోని చాలామంది మహిళలు ఈ ఆర్మీ ద్వారా భర్తలను మార్చుకుని సంతోషంగా జీవిస్తున్నారు. మూర్ఖపు భర్తలను మార్చడంతోపాటు, గృహహింస, వరకట్నం, మూఢాచారాలు నిర్మూలించేందుకు  ఆర్మీలు కృషి చేస్తున్నాయి. ఈ ఆర్మీల వల్ల కుటుంబ పరిస్థితులు మెరుగుపడడమేగాక, గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. 

‘‘నా పేరు ఆశాదేవి. పద్నాలుగేళ్లకే పెళ్లి అయ్యింది. ఐదుగురు పిల్లలు. నా భర్త ఎప్పుడూ కొట్టేవాడు. గర్భవతినని కూడా చూడకుండా హింసించేవాడు. పిల్లలు ఎదిగే కొద్దీ ఖర్చులు కూడా  పెరిగాయి. కానీ ఆయన మాత్రం తాగడం మానలేదు. నన్ను కొట్టడం ఆపలేదు. ఆయన కొట్టిన దెబ్బలకు రాత్రులకు నిద్రపట్టేది కాదు. మూలుగుతూ పడుకున్న నన్ను మళ్లీ మళ్లీ కొట్టేవాడు. చలికాలం ఇంటి బయటకు నెట్టేసేవాడు.

బాధలు తట్టుకోలేక చచ్చిపోదామని నిప్పు అంటించుకున్నాను.కానీ వేరేవాళ్లు కాపాడడంతోప్రాణాలు రవి మిశ్రా హోప్‌ వెల్ఫేర్‌  ట్రస్ట్‌వాళ్లతో కలసి మా గ్రామానికి వచ్చారు. అప్పుడు నా పరిస్థితి, పిల్లలు స్కూలుకు కూడా వెళ్లడంలేదని తెలుసుకున్నారు. నేను నా బాధల గురించి వివరించాను. వారు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ఆయన తాగడం మానేశాడు. ఎనిమిదేళ్లుగా మంచి వ్యక్తిగా మారి, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు.

ఆ తరువాతే నాలాంటి మహిళలను ఆదుకునేందుకు మిశ్రా తో కలిసి గ్రీన్‌ ఆర్మీని ఏర్పాటు చేశాము.’’ ఆశా దేవి లాంటి వందలమంది మహిళలు గ్రీన్‌ ఆర్మీ ద్వారా సంసారాలను చక్కబెట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement