చల్లనిగాలి..సముద్ర అందాలు.. ఇష్టమైన ఆహారం..లైఫ్ బిందాసే కదా..అటువంటి యూరోపియన్ ఫుడ్‌స్టైల్స్ ఇక విశాఖలో నోరూరించనున్నాయి. ఇష్టమైన వంటకాలను తినాలనే కోరిక ఉండే ఆహారప్రియుల కల త్వరలో నెరవేరనుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యూరోపియన్ స్టైయిల్‌లో ‘ఈట్ స్ట్రీట్స్’ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాగర్‌నగర్ వద్ద ఒకటి, డిఫెన్స్ కాలనీ వద్ద మరొకటి ఏర్పాటుకు సిద్ధమయ్యింది. ఇందుకు అనుగుణంగా టెండర్లను కూడా ఆహా్వనించింది. ఈట్ స్ట్రీట్స్ పేరుతో అందమైన ఆర్చ్‌తో ఆహార ప్రియులను ఆహ్వానించనున్నాయి. మొత్తం రూ.6.24 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్.. వైజాగ్ వాసులకు కొత్త వంటకాల రుచులను పరిచయం చేయనున్నాయి.
ఆధునిక పద్ధతిలో..
ఆధునిక పద్ధతిలో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలు పెద్దగా ఉపయోగించని ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశాం. యూరోపియన్ స్టైల్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించాం. వెరైటీ వంటకాలకు ఈట్ స్ట్రీట్స్ కేంద్రంగా మారనున్నాయి. నగరవాసులు ఆహ్లాదంగా సేద తీరేందుకు ఈట్ స్ట్రీట్స్ రానున్న రోజుల్లో దోహదం చేయనున్నాయి.
– సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్
నగర వాసుల కోసం
ప్రజలకు ఎప్పటికప్పుడు కొంగొత్తగా విశాఖ నగరాన్ని పరిచయం చేసేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ వ్యూ పాయింట్‌తో పాటు రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మెరిడీయన్ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరింతగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఆహార ప్రియులకు కొంగొత్త వంటకాలతో పాటు ప్రశాంతమైన వాతావరణంతో ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. అధునాతన పద్ధతిలో అభివృద్ధి చేయనున్న ఈట్ స్ట్రీట్స్ నగర వాసులను ఆకట్టుకోనున్నాయి. టెండర్లు పూర్తి అయిన తర్వాత 6 నెలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నాం.
– గొలగాని హరి వెంకట హరికుమారి, జీవీఎంసీ మేయర్ రూ.
రూ. 6.24 కోట్లతో..
వాస్తవానికి ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ ఎప్పటి నుంచో భావిస్తోంది. అయితే, ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో పార్క్ హోటల్‌కు ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాలనీ వద్ద, సాగర్‌నగర్‌లో ఒకటి ఏర్పాటు చేసేందుకు తాజాగా జీవీఎంసీ అడుగులు వేసింది. డిఫెన్స్ కాలనీ వద్ద రూ. 3.24 కోట్ల వ్యయంతో, సాగర్‌నగర్ వద్ద రూ.మూడు కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. యూరోపియన్ స్టైయిల్‌లో ఈ ఈట్ స్ట్రీట్స్‌ను అభివృద్ధి చేయనున్నారు. 6 నెలల కాలంలో పూర్తి చేయాలని భావిస్తోంది.
అన్ని వేళల్లో అందుబాటులో..
జీవీఎంసీ ఏర్పాటు చేయనున్న ఈట్‌స్ట్రీట్స్‌ను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. మనకు కావాల్సిన వివిధ రకాల వంటకాలు ఇక్కడ లభించడంతో పాటు అప్పటికప్పుడు మన కళ్ల ముందే తయారుచేయడాన్ని కూడా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది. అంతేకాకుండా విశాలమైన స్థలం...ప్రశాంతంగా వంటకాలను ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో అందుబాటు ఉండనుంది.
ఇష్టమైనవి తింటూ..కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసేలా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ తీర్చిదిద్దనుంది. ఈట్‌స్ట్రీట్స్ డిజైన్లను కూడా ఇప్పటికే జీవీఎంసీ తయారు చేసింది. మొత్తంగా విశాఖ వాసులకు త్వరలో వెరైటీ వంటకాల కోసం ఈట్ స్ట్రీట్స్ అందుబాటులోకి రానున్నాయి.
(చదవండి: ఆ చెట్టు ఆకులు తెల్ల చుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..)
Comments
Please login to add a commentAdd a comment