
ఆటబొమ్మలతో ఆడుకోవడం పిల్లలందరికీ ఇష్టమైన వ్యాపకం. ప్రపంచంలోని ప్రతిచోటా పిల్లలందరూ ఆటబొమ్మలను ఇష్టపడతారు. కొందరు అందుబాటులో ఉన్న వస్తువులనే ఆటబొమ్మలుగా మలచుకుని, వాటితో ఆటలాడుకుంటారు. ఇంకొందరు డబ్బులు వెచ్చించి రకరకాల రంగురంగుల ఆటబొమ్మలను కొనుక్కుని ముచ్చట తీర్చుకుంటారు.
ఆటబొమ్మలపై పిల్లలకు ఉండే సహజ వ్యామోహం కొందరికి వ్యాపారావకాశం కూడా! పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటబొమ్మలను అమ్మే దుకాణాలు వెలిశాయి. వీటిలో అత్యంత పురాతనమైనది ‘హామ్లీస్’ టాయ్ స్టోర్. బ్రిటిష్ రాజధాని లండన్ నగరంలో ఉందిది. విలియమ్ హామ్లీ అనే ఆసామి 1760లో లండన్‌లోని హై హాల్‌బోర్న్ వీ«థిలో దీనిని నెలకొల్పాడు. తర్వాత కొద్దికాలానికే రీజెంట్ స్ట్రీట్‌కు దుకాణాన్ని తరలించాడు.
ప్రపంచంలోని అత్యంత పురాతనమైన, అత్యంత పెద్దదయిన ఆటబొమ్మల దుకాణంగా ఇది గిన్నిస్ రికార్డుల్లోకెక్కడం విశేషం. మొదట్లో ఇది ఒకే దుకాణంగా మొదలైనా, తర్వాతి కాలంలో శాఖోపశాఖలుగా ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించింది. భారత్‌లో కూడా దీని శాఖలు ఉన్నాయి. తరతరాలుగా బ్రిటిష్ రాచకుటుంబానికి అభిమాన ఆటబొమ్మల దుకాణంగా ఉన్న ‘హామ్లీస్’ చేతులు మారి, ప్రస్తుతం రిలయన్స్ రీటెయిల్ కంపెనీ చేతిలోకి వచ్చింది.
‘హామ్లీస్ గ్లోబల్ హోల్డింగ్స్ లిమిటెడ్’కు చెందిన వందశాతం వాటాలను రిలయన్స్ రీటెయిల్ కంపెనీ 2019లో సొంతం చేసుకుంది. రీజెంట్ స్ట్రీట్‌లోని ‘హామ్లీస్’ స్టోర్ 2010లో తన 250వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ప్రస్తుతం ‘హామ్లీస్’కు బ్రిటన్‌లో 11 శాఖలు, మిగిలిన దేశాల్లో 90 శాఖలు ఉన్నాయి. అత్యంత పురాతనమైన ఈ దుకాణంలో దొరకని ఆటబొమ్మలు అరుదు.
(చదవండి: