అనాథ పిల్లలతో సోనికా గహ్లోట్ నాయక్
వస్తువులు, పుస్తకాలు, దుస్తులు, నగదు రూపేణా ఎవరికైనా సాయం చేయాలనుకున్న దాతలు వారి కోసం సదరు స్వచ్ఛంద సంస్థలను వెతుకుతుంటారు. ఆ వెతుకులాటలో తమ సాయం సరైన వారికి చేరుతుందా లేదా అనే సందేహమూ ఉంటుంది. బెంగళూరు వాసి సోనికా గహ్లోట్ నాయక్ ఈ పరిస్థితిని గమనించి దేశంలోని అన్ని ఎన్జీవోలను అనుసంధానిస్తూ ‘హ్యాపీ సోల్’ పేరుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశారు.
ఈ ప్లాట్‌ఫాం ఎవరికైనా సరే అవసరమైన ఎన్జీఓలకు దానం చేయడానికి సహాయపడుతుంది. దీని రూపకర్త సోనికా గహ్లోట్ నాయక్. 2017 సంవత్సరంలో వారాంతాల్లో ఓ రోజు బట్టలు, పుస్తకాలను దానం చేయడానికి స్వచ్ఛంద సంస్థల గురించి ఆన్ లైన్ జాబితా వెతకడం మొదలుపెట్టింది. భారతదేశం అంతటా ధృవీకరించిన స్వచ్ఛంద సంస్థల జాబితా గల ప్లాట్‌ఫారమ్ ఏదీ లేవని తెలిసి ఆశ్చర్యపోయింది.
ఎన్జీఓల అనుసంధానం
ఈ అంతరాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలను అనుసంధానించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది సోనికా. వ్యక్తులు, కార్పొరేట్లు, ఎన్జీఓలను కలిపే ఒక వేదిక అయిన హ్యాపీ సోల్‌ను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ పోర్టల్ ద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జంతువుల ఆశ్రయాలు, నిరుపేద పాఠశాలల జాబితా చేసింది. ఆమె మొదట దీనిని ప్రారంభించినప్పుడు సమాచార సేకరణకు వ్యక్తిగతంగా బెంగళూరులోని ప్రతి ఎన్జీఓలను కలిసింది. కొన్ని చిన్న సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా గుర్తించింది. ధృవీకరించిన చట్టపరమైన పత్రాలతో పారదర్శకత, జియోట్యాగ్ చేయబడిన ఎన్జీఓలను నమోదు చేసే వెబ్‌సైట్ ప్రారంచింది. ఈ ప్లాట్‌ఫాంపై తమ ప్రొఫైల్స్‌ను రూపొందించడానికి ఎన్జీఓల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయదు. ఇది ఎన్జీఓల కార్యకలాపాలు, ఫోకస్, ప్రాంతాలు, లక్ష్యం, ప్రేక్షకుల వివరాలతో మినీ వెబ్‌సైట్‌గా పనిచేస్తుంది.
వనరుల సద్వినియోగం
ఈ పోర్టల్ ద్వారా కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రజలు తమ ఇంటి నుండి సరుకులను నేరుగా స్వచ్ఛంద సంస్థలకు పంపించటానికి వీలుగా సేవలను పొందారు. ఈ ప్లాట్‌ఫామ్ వినియోగదారులు ఎంపిక చేసిన ఎన్జీఓలకు పికప్–డ్రాపింగ్ సేవలను కూడా అందించింది. కస్టమర్‌ల రియల్ టైమ్ అప్‌డేట్స్, వారి వస్తువులు సరైన ఆశ్రమాలకు చేరడం నిర్ధారణతోపాటు, పర్యావరణానికి వారు ఎలా వైవిధ్యం చూపించారనే వివరాలను కూడా ఇందులో జత చేశారు. హ్యాపీ సోల్ నమూనా ఒక సరళమైన రెండుదశల ప్రక్రియ. కస్టమర్ మొదట ఒక ఎన్జీఓ పోస్ట్ చేసిన వాంటెడ్ ఐటమ్స్ జాబితాను తీసుకొని, దానిద్వారా వెళతారు, తరువాత వారు దానం చేయదలిచిన వస్తువుల పరిమాణాన్ని జోడించి, బ్యాగులు లేదా డబ్బాల్లో వాటిని సిద్ధం చేస్తారు. వస్తువుల డెలివరీ కోసం రూ. 200 నుండి రూ .5000 వరకు సౌలభ్య రుసుము వసూలు ఉంటుంది. ఎన్ని వస్తువులు పంపబడుతున్నాయి, డెలివరీ మోడ్ ద్విచక్ర వాహనమా, త్రీవీలరా లేదా మినీ ట్రక్కా... వంటి ఎంపికలు కూడా ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే, దేశమంతటా మిగులు, వస్తువుల కొరత మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment