ఎంత సన్నగా ఉందో! గాలొస్తే ఎగిరిపోతుంది!! అని హేళన చేసేవారామెను. ఆ మాటలు విన్న ప్రతిసారి తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యేది. స్కూల్లో తోటివిద్యార్థులు పదేపదే తనపై వేసే జోకులను మౌనంగా భరిస్తూ, సిగ్గుతో తలదించుకుని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే అమ్మాయి హర్నాజ్ కౌర్ సంధు. హర్నాజ్ ఫీల్ అయిన ప్రతిసారి కుటుంబం మద్దతుగా నిలవడంతో.. మోడలింగ్‌లో రాణిస్తూ, సినిమాల్లో నటిస్తూ ఏకంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకునే స్థాయికి ఎదిగింది.
నేడు (డిసెంబర్ 12న) ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో డెబ్భయ్యవ ‘విశ్వసుందరి’ (మిస్ యూనివర్స్) – 2021 పోటీలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతాలా జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఇప్పటిదాకా ఇండియాకు రెండుసార్లు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. గతంలో మిస్ యూనివర్స్ పోటీలకు ఇండియా నుంచి సుస్మితా సేన్, లారా దత్తా, సెలీనా జైట్లీ, నేహా దుపియాలు పోటీపడ్డారు. కానీ 1994లో సుస్మితాసేన్, 2000 లో లారా దత్తాలు మాత్రమే మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో లారాదత్త ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటం తెచ్చింది. ఆ తరువాత ఇప్పటిదాకా మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ రాలేదు. అయితే లారాదత్త కిరీటం గెలుచుకున్న ఏడాదే జన్మించిన ‘మిలీనియం గర్ల్’ హర్నాజ్ కౌర్ సంధు.. ప్రస్తుతం భారతదేశానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు బరిలో నిలిచింది. దాదాపు 80 మంది పోటీదారులతో పోటీపడి కిరీటాన్ని దక్కించుకునేందుకు ఆరాటపడుతుంటే... భారతీయులందరూ మిలీనియం గర్ల్ మిస్ యూనివర్స్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు.
మిలీనియం గర్ల్
21 ఏళ్ల హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్‌లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్‌నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది.
మరుసటి ఏడాది ‘మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా’ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ రెండు టైటిల్స్ గెలుచుకున్న తరువాత...2019లో ‘మిస్ ఇండియా’ టైటిల్ కోసం పోటీ పడి టాప్–12 జాబితాలో నిలిచింది. ఇదే ఏడాది “మిస్ ఇండియా పంజాబ్‌గా’కూడా నిలిచింది. మంచి పాపులారిటీ రావడంతో ద ల్యాండర్స్ రూపొందించిన మ్యూజిక్ వీడియో “తార్తల్లి’లో నటించింది. ఆ తరువాత అందాల పోటీల్లో పాల్గొని ‘మిస్ దివా యూనివర్స్ ఇండియా–2021’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీలో మిస్ బ్యూటిఫుల్ స్కిన్, మిస్ బీచ్ బాడీ, మిస్ బ్యూటీఫుల్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ ఫోటోజెనిక్, మిస్ టాలెంటెడ్‌గా నిలిచింది. ఈ కిరీటం ద్వారానే ‘మిస్ యూనివర్స్–2021కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది హర్నాజ్.
నటిగానూ..
హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్‌కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెబుతోన్న హర్నాజ్ కిరీటాన్ని సాధించాలని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment