Health Tips in Telugu: Vitamin A Deficiency: Symptoms, Foods Rich in Vitamin A - Sakshi
Sakshi News home page

Vitamin A Deficiency: విటమిన్‌ ‘ఏ’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తిన్నారంటే!

Published Sat, May 28 2022 9:50 AM | Last Updated on Sat, May 28 2022 11:43 AM

Health Tips: Vitamin A Deficiency Symptoms Problems What To Eat - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

Vitamin A Deficiency Symptoms Problems: కొందరిలో ఎన్ని చర్యలు తీసుకున్నా, మొటిమలు తగ్గవు. అలాగే గాయాలు త్వరగా మానవు. కొందరు చిన్నారులలో అయితే ఎదుగుదల సరిగా ఉండదు. విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో ఈ సమస్యలన్నీ కనిపిస్తాయి. మీ పిల్లలు సరిగా ఎగకపోతున్నా, మీకు అయిన గాయాలు త్వరగా మానకపోతున్నా విటమిన్‌ ఎ లోపించినట్లు భావించాలి.

విటమిన్‌ ఎ లోపిస్తే ఇంకా ఏమేం సమస్యలు వస్తాయి, దానిని భర్తీ చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసుకుందాం. 

కొందరిలో నిత్యం గొంతు, ఛాతీ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్‌ ఏ లోపం కారణమై ఉండొచ్చు.
చిన్నారుల్లో విటమిన్‌ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమం.

విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్‌ ఎ తగినంత ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు.

విటమిన్‌ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్‌ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్‌ ఏ లోపం ఉందని గుర్తించాలి.

కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్‌ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి.

విటమిన్‌ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్‌ ఏ లోపమని గుర్తించాలి.

పైన చెప్పుకున్న లక్షణాలన్నీ విటమిన్‌ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్‌ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

ఇప్పుడు విటమిన్‌ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేమిటో చూద్దాం!

క్యారట్లు:
విటమిన్‌ ఏ కి ఉత్తమ ఆహారం క్యారట్లు. క్యారట్‌ హల్వా అందరికీ ఇష్టమే కానీ, క్యారట్స్‌ లో ఉన్న పోషకాలు మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్‌ తీసుకుని తాగచ్చు.

చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్‌ కూడా బాగుంటాయి. తక్కువ మోతాదులో పచ్చివి తిన్నా మంచిదే. 

ఆకు కూరలు: ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకు కూరలే తినమనేవాళ్ళు కూడా. అయితే, ఆకు కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది.

గుమ్మడికాయ: తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్, స్నాక్స్‌ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉంటుంది.

పాలు: మనందరం చిన్న పిల్లలకి రెగ్యులర్‌ గా ఒక గ్లాస్‌ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు విటమిన్‌ ఏ కూడా ఉంటుంది. పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా ఒక గ్లాస్‌ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్‌ నించి రక్షింపబడతాం.

టొమాటో: టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్ధమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టొమాటో ఉంటే వచ్చే రుచే వేరు. పైగా ఇవన్నీ కేవలం టొమాటో తోనే కూడా చేసుకోవచ్చు. విటమిన్‌ ఏ మాత్రమే కాక టొమాటో లో యాంటీ ఆక్సిడెంట్స్‌ కూడా పుష్కలం గా ఉన్నాయి. ఇవి కాన్సర్‌ సెల్స్‌ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ ని అదుపులో ఉంచుతుంది. 

విటమిన్‌ ఎ ను పొందడం కోసం ట్యాబ్లెట్లు, ఇతర సప్లిమెంట్లపై ఆధార పడటం కన్నా, అది మెండుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. 

చదవండి: Vitamin C Deficiency: విటమిన్‌ ‘సి’ జరిగేది ఇదే.. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement