క్యాన్సర్‌ మందుతో గుండెపోటుకూ చికిత్సా!? | Heart Attacks Can Cure By Mitogen Activated Kinase Inhibitor Medicine | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ మందుతో గుండెపోటుకూ చికిత్సా!?

Published Sun, Jun 26 2022 10:05 AM | Last Updated on Sun, Jun 26 2022 10:09 AM

Heart Attacks Can Cure By Mitogen Activated Kinase Inhibitor Medicine - Sakshi

నిజానికి అదో క్యాన్సర్‌ మందు. కానీ ఓ పరిశోధనలో భాగంగా వాడినప్పుడు అది గుండెపోటునూ నివారించనన్నుట్లు తేలింది. కాకపోతే ప్రస్తుతం ఎలుకల మీద. అది మానవుల్లోనూ అదే తరహాలో పనిచేయనుందని నిర్ద్వంద్వంగా తేలడంతో భవిష్యత్తులో గుండెపోటునూ నివారించగలదనే ఆశాభావం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగితే భవిష్యత్తులో దాదాపుగా గుండెపోట్లు పూర్తిగా నివారితమయ్యే అవకాశం ఉంది. అదెలాగో చూద్దాం. 

‘మైటోజెన్‌ యాక్టివేటెడ్‌ కైనేజ్‌ ఇన్హిబిటర్‌’ అనేది ఒక ఎంజైమ్‌ వంటి జీవరసాయనం. దీన్నే సంక్షిప్తంగా ‘ఎమ్‌ఈకే ఇన్హిబిటర్‌’ పిలుస్తారు. ఇది మెలనోమా అనే చర్మ క్యాన్సర్, మలద్వార పెద్దపేగు క్యాన్సర్‌ వంటి కొన్ని క్యాన్సర్లలో ఓ ఔషధంగా ఉపయగపడుతుంది. ఈ క్యాన్సర్లకు గురైనప్పుడు... అవి విపరీతంగా, అసంఖ్యాకంగా పెరిగిపోయేందుకు కొన్ని రకాల హార్మోనులు దోహదం చేస్తుంటాయి. ఎమ్‌ఈకే ఇన్హిబిటర్‌... ఆ హార్మోన్లకు అడ్డుపడి... ఆ క్యాన్సర్‌ గడ్డలు పెరగకుండా చేస్తుంది. ఇలా క్యాన్సర్‌ గడ్డల పెరుగుదలను ఆపేసే ఇదే ఔషధం... ఇప్పుడు గుండెపోటునూ నివారిస్తుందని పరిశోధకులు ఆశిస్తున్నారు. 

గుండెపోటులో ఏం జరుగుతుంది? ఎందుకొస్తుంది? 
గుండెకు కూడా రక్తం అవసరం. దాని ద్వారానే గుండె కండరానికి పోషకాలు, ఆక్సిజన్‌ అందుతుంటాయి. గుండె కండరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనులను ‘కరొనరీ ఆర్టరీస్‌’ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాల్లో ఎంతోకొంత కొవ్వులు చేరుతుంటాయి. ఇలా చేరే కొవ్వులను ‘ప్లాక్‌’ అంటుంటారు. మిగతా రక్తనాళాల్లో ప్లాక్‌ చేరడం అంత త్వరగా అనర్థాలు కలిగించకపోవచ్చుగానీ... గుండె కండరానికి అవసరమైన రక్తం అందకపోతే అది చచ్చుబడిపోవడం వెంటనే ప్రారంభమవుతుంది. ఒకసారి చచ్చుబడిన కండరం మళ్లీ నార్మల్‌గా మారడం దాదాపుగా జరగదు. అలా కండరం చచ్చుబడిపోవడంతో గుండె నుంచి మిగతా అన్ని అవయవాలకూ రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా మిగతా అన్ని అవయవాలూ (ముఖ్యంగా మెదడు) చచ్చుబడిపోతాయి. దాంతో మరణం సంభవిస్తుంది. 

శాస్త్రవేత్తలు ఏం చూశారంటే...? 
ఇటీవల శాస్త్రవేత్తలు ఓ పరిశోధన నిర్వహించారు. కొన్ని ఆరోగ్యకరమైన ఎలుకలకు రెండు వారాల పాటు ప్రతిరోజూ ఆ మందును ఇంజెక్షన్‌తో ఇస్తూ పోయారు. అటు తర్వాత గుండె ప్రధాన గదుల పనితీరును నిశితంగా పరిశీలించారు. గుండె ఛాంబర్లలోకి ఎంత రక్తం వస్తోంది... అదంతా సమర్థంగా పంప్‌ అవుతోందా లేదా అన్న అంశాన్నీ జాగ్రత్తగా చూశారు. మందు ఇవ్వని ఎలుకల కంటే మందు వాడిన ఎలుకల్లో 7.7 ఎమ్‌ఎల్‌ రక్తం అదనంగా ప్రవహించడాన్ని గమనించారు.

ఇంజెక్షన్‌ ఇవ్వని వాటిల్లో 16 ఎమ్‌ఎల్‌ తగ్గింది. అంతేకాదు... గుండెపోటుకు గురైన ఎలుకలకూ ఇదే మందు ఇచ్చి చూసినప్పుడు వాటిలో దాదాపు 90 శాతం ఎలుకలు మరో రెండు వారాలపాటు మామూలుగానే జీవించాయి. ఇవ్వని ఎలుకల్లో కేవలం 70 శాతమే రెండు వారాలు బతికాయి. ఈ ఫలితాలు పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడంతో పాటు మరిన్ని కొత్త పరిశోధనలకు దారులు తెరిచాయి. బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ నిధులు అందించి, నిర్వహించిన ఈ పరిశోధనలో పాలు పంచుకున్న ప్రొఫెసర్‌ పావులో మదేదూ మాట్లాడుతూ... ‘‘ఈ ఫలితాలు మమ్మల్ని ఎంతగానో అబ్బురపరిచాయి.

హార్ట్‌ అటాక్‌లో గుండె కండరానికి పోషకాలు అందక అది మరణిస్తుంది. కానీ ఈ మందు ఇవ్వడం వల్ల తగిన సమయంలోనే (విత్‌ ఇన్‌ ద క్రిటికల్‌ టైమ్‌) కొత్త రక్తనాళాలు పుట్టుకురావడం... గుండె కండరాన్ని చచ్చుబడనివ్వకుండా చేయడం జరిగాయి. మానవుల గుండె కండరాలపైనా ఇది అలాంటి ఫలితమే కలిగించనుందని మా ప్రాథమిక పరిశీలనలో వెల్లడయ్యింది’’ అని పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలన్నీ ‘జర్నల్‌ ఆఫ్‌ క్లినకల్‌ ఇన్వెస్టిగేషన్‌’ అనే ప్రముఖ మెడికల్‌ జర్నల్‌లో చోటుచేసుకున్నాయి. ఈ పరిశోధనల నేపథ్యంలో కొద్దిరోజుల్లో ఇదే తరహా పరిశోధనలను మానవులపైనా నిర్వహించేందుకు (హ్యూమన్‌ ట్రయల్స్‌కు) సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఎమ్‌ఈకే ఇన్హిబిటర్‌ ఏం చేస్తుంది? 
గుండెపోటు వచ్చిన వెంటనే ‘ఎమ్‌ఈకే’ ఇన్హిబిటర్‌ మందును ఇంజెక్షన్‌ రూపంలో బాధితులకు ఇవ్వగానే ఆరోగ్యకరమైన రీతిలో గుండెకు రక్తం సరఫరా జరగడం మొదలవుతుంది. దాంతో గుండెకండరం చచ్చుబడిపోదు. ఫలితంగా గుండెపోటు ప్రమాదం చాలావరకు తగ్గుతుంది. 

ఇదెలా జరుగుతుందంటే... 
ఎమ్‌ఈకే ఇన్హిబిటర్స్‌ రక్తంలోకి ప్రవేశించగానే... రక్తనాళాల చుట్టూ అల్లుకుపోయి ఉండే ‘పెరీసైట్స్‌’ అనే∙మూలకణాలను ‘రీ–ప్రోగ్రామింగ్‌’ చేస్తాయి. దీని ఫలితంగా ఆరోగ్యకరమైన అనేక కొత్త రక్తనాళాలు పుట్టుకొస్తాయి. దాంతో రక్తంలో కొవ్వు పేరుకోవడంతో మూసుకుపోయిన రక్తనాళాలే కాకుండా... రక్తప్రవాహం సాఫీగా జరగడానికి అనేక కొత్త కొత్త, ప్రత్యామ్నాయ రక్తనాళాలు ఉంటాయి. వీటి నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా గుండె కండరానికి రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. అలా గుండెపోటు నివారితమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement