కళ్లు తిరిగి పడిపోయారా... అయితే ఇది చదవాల్సిందే! | Scientists Solve The Mystery Of What Happens When We Faint | Sakshi
Sakshi News home page

Reasons Behind Faint: మీరెప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? కారణం ఏంటో తెలిస్తే..

Published Fri, Nov 3 2023 1:54 PM | Last Updated on Fri, Nov 3 2023 3:46 PM

Scientists Solve The Mystery Of What Happens When We Faint - Sakshi

మీరు ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? మనలో కనీసం 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలా కళ్లు తిరిగి పడిపోతారని సైన్స్‌ చెబుతోంది. ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మనం ఇలా కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం బోలెడంత గందరగోళం మనల్ని అలముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు పడిపోయామో అర్థం కాదు. మనకే కాదు.. శరీరం లోపల ఏం జరిగితే పడిపోయామో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకూ తెలియకపోవడం గమన్హాం. అదృష్టవశాత్తూ అమెరికాలోని శాండియాగోలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గుట్టును ఛేదించారు.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోవడం తరచుగా... ఎక్కువసార్లు జరుగుతూంటుంది కాబట్టి శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ సమస్యను అధిగమించేందుకు పనికొస్తాయని అంచనా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముందు ఒక్క విషయం. కళ్లు తిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్‌ అని పిలుస్తారు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాల పుణ్యమా అని సింకోప్‌ తాలూకూ సంకేతాలు గుండె మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి కూడా స్పష్టంగా తెలిసింది.



మామూలుగా అయితే సింకోప్‌కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణమని అనుకునేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందనన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే వినీత్‌ ఆగస్టీన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధించగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్‌కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపుతోందని, ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని స్పష్టమైంది. సింకోప్‌ సమయంలో గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉంటుందని, రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్‌ జారిష్‌ రిఫ్లెక్స్‌ (బీజేఆర్‌) అనే సిద్ధాంతం చెప్పింది కానీ ఇప్పటివరకూ ఇది రుజువు కాలేదు.

కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపే అత్యంత కీలకమైన వాగస్‌ నాడిని పరిశీలించారు. ఈ వాగల్‌ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్‌ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్‌ లక్షణాలకు, సింకోప్‌కు దీనికి సంబంధం ఉందని అంచనా. ఈ వాగల్‌ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు ఠక్కున మూర్ఛపోయాయి.

తరువాతి పరిశీలనల్లో ఎన్‌పీవై2ఆర్‌ అనే పెప్టైడ్‌ సింకోప్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల సాయంతో సింకోప్‌ను అరికట్టేందుకు కొత్త మందులు తయారు చేయవచ్చునని, పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement