Fainted
-
కళ్లు తిరిగి పడిపోయారా... అయితే ఇది చదవాల్సిందే!
మీరు ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? మనలో కనీసం 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలా కళ్లు తిరిగి పడిపోతారని సైన్స్ చెబుతోంది. ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మనం ఇలా కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం బోలెడంత గందరగోళం మనల్ని అలముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు పడిపోయామో అర్థం కాదు. మనకే కాదు.. శరీరం లోపల ఏం జరిగితే పడిపోయామో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకూ తెలియకపోవడం గమన్హాం. అదృష్టవశాత్తూ అమెరికాలోని శాండియాగోలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గుట్టును ఛేదించారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోవడం తరచుగా... ఎక్కువసార్లు జరుగుతూంటుంది కాబట్టి శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ సమస్యను అధిగమించేందుకు పనికొస్తాయని అంచనా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముందు ఒక్క విషయం. కళ్లు తిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాల పుణ్యమా అని సింకోప్ తాలూకూ సంకేతాలు గుండె మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి కూడా స్పష్టంగా తెలిసింది. మామూలుగా అయితే సింకోప్‌కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణమని అనుకునేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందనన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే వినీత్ ఆగస్టీన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధించగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్‌కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపుతోందని, ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని స్పష్టమైంది. సింకోప్ సమయంలో గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉంటుందని, రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్ జారిష్ రిఫ్లెక్స్ (బీజేఆర్) అనే సిద్ధాంతం చెప్పింది కానీ ఇప్పటివరకూ ఇది రుజువు కాలేదు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపే అత్యంత కీలకమైన వాగస్ నాడిని పరిశీలించారు. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్ లక్షణాలకు, సింకోప్‌కు దీనికి సంబంధం ఉందని అంచనా. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు ఠక్కున మూర్ఛపోయాయి. తరువాతి పరిశీలనల్లో ఎన్‌పీవై2ఆర్ అనే పెప్టైడ్ సింకోప్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల సాయంతో సింకోప్‌ను అరికట్టేందుకు కొత్త మందులు తయారు చేయవచ్చునని, పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
షాకింగ్.. ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: కర్ణాటక బెంగళూరు ట్రాఫిక్ ఫోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను ఆపి వేధించారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,000 ట్రాఫిక్ చలాన్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బైక్‌ను సీజ్ చేస్తామని బెదిరించారు. తన భార్య డయాబెటిస్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నామని, పెండింగ్ చలాన్లు తర్వాత కడతామని భర్త వేడుకున్నా ట్రాఫిక్ పోలీసులు కనికరించలేదు. దీంతో చికిత్స కోసం తెచ్చుకున్న రూ.2,000 చెల్లిస్తామని, మిగతా మొత్తం తర్వాత కడతామని దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినా ట్రాఫిక్ పోలీసులు మాత్రం జాలి చూపలేదు. మొత్తం రూ.5,000 చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక గత్యంతరం లేదని భావించిన భర్త మిగతా డబ్బు తెచ్చేందుకు ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. అతని కోసం బైక్ వద్దే ఎదురు చూసిన భార్య కాసేపటికే సృహతప్పి పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఈ దంపతుల కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత్యంత కఠినంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బెంగళూరులోని సంగం సర్కిల్లో ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. చదవండి: అదానీ మ్యాజిక్ ఏంటో చెబితే అందరూ కోటీశ్వరులవుతారు కదా..! -
స్పృహ కోల్పోయిన ఆర్టీసీ డీఎం...
సాక్షి, భద్రాచలం: పని ఒత్తిడి కారణంగా భద్రాచలం ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను... ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంకు డాక్టర్లు ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే విశ్రాంతి లేకపోవడం కారణంగానే ఆయన అలసటకు గురై లో బీపీతో స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా సమ్మెలో ఉండటంతో ఆర్టీసీ బస్ స్టేషన్, బస్ డిపో నిర్వహణ బాధ్యతలు పూర్తిస్థాయిలో డీఎం, డీవీఎంలే చేపట్టారు. దీంతో విశ్రాంతి లేకపోవడంతో డీఎం తీవ్ర అలసటకు గురవడం వల్ల స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా డీఎం సృహ కోల్పోయిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పని ఒత్తిడికి గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. -
కోర్టులో స్పృహ తప్పి పడిపోయిన నటి సరిత
చెన్నై: సీనియర్ నటి సరిత కోర్టులో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడ కాసేపు కలకలం వాతావరణం నెలకొంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నాయకిగా నటించి పేరు గాంచిన సరిత.. మలయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అలాంటిది కొంత కాలం తరువాత సరిత, ముఖేష్ మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. ఫలితం విడాకులకు దారి తీసింది. 2009లో ముఖేష్ సరిత నుంచి వివాహ రద్దు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణ రెండేళ్ల క్రితం ముఖేష్, సరితకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. దీంతో ముఖేష్.. మిధుల అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం చెల్లదంటూ నటి సరిత కేరళ, కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ చెన్నై కోర్టులో ముఖేష్ వివాహ రద్దు కోరుతూ వేసిన పిటీషన్‌పై విచారణ జరిగే సమయంలో తాను దుబాయిలో ఉన్నానన్నారు. దీంతో కోర్టు జారీ చేసిన నోటీసులను తాను అందుకోలేకపోయానని వివరించారు. తాను కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అందువలన ముఖేష్ రెండో వివాహం చెల్లదని తీర్పు ఇవ్వవలసిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా సరిత, ముఖేష్‌లిద్దరూ గురువారం కొచ్చి కుటుంబ సంక్షేమ కోర్టుకు హాజరయ్యారు. విచారణానంతరం కోర్టు బోనులోంచి వెనుదిరిగిన సరిత అనూహ్యంగా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో కోర్టు ఆవరణలో కాసేపు కలకలం చెలరేగింది. వెంటనే సరిత సన్నిహితులు ఆమెకు సపర్యలు చేసి స్పృహ తెప్పించి ఇంటికి తీసుకెళ్లారు. -
'సదరం' వద్ద తోపులాట, స్పృహ తప్పిన మహిళలు
నిజామాబాద్ : సామాజిక పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ సామాన్యులకు ప్రాణాంతకంగా మారింది. వికలాంగ పింఛన్లు కోరుకునే వారికి సదరం సర్టిఫికెట్లు తప్పని సరిగా ఉండాలనే నిబంధనతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వద్ద శుక్రవారం సదరం శిబిరం వద్ద తోపులాట జరిగింది. ధ్రువ పత్రాల కోసం వేలాదిమంది వికలాంగులు, వృద్ధులు సదరం కేంద్రాల వద్దకు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు స్పృహ తప్పిపడిపోయారు. దాంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వేయిరూపాయలు, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు 40శాతం వైకల్యమున్న వారికే వికలాంగ పింఛన్ మంజూరవుతుంది. దాంతో గతంలో సదరం పరీక్షలో 40 శాతం పొందలేక పోయిన వారు మరోమారు ధ్రువీకరణ పత్రాల కోసం వస్తుండటంతో గందరగోళం నెలకొంటోంది.