కొత్త కొత్తగా ఈ వంటకాలను కూడా ట్రై చేయండి..
బనానా షీరా చాక్లెట్ బాల్స్
కావలసిన పదార్ధాలు
రవ్వ – 1 కప్పు (దోరగా వేయించుకోవాలి)
అరటి గుజ్జు – 1 కప్పు, ఏలకుల పొడి – కొద్దిగా
నెయ్యి – పావు కప్పు, పంచదార – 1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు)
పాలు – రెండున్నర కప్పులు
డ్రై ఫ్రూట్స్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు
చాక్లెట్ చిప్స్ – అర కప్పు, కొబ్బరి నూనె – కొద్దిగా
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్‌లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంతసేపు తర్వాత డ్రై ఫ్రూట్స్, బనానా గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ కూడా వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా మిగిలిన నెయ్యి కూడా వేసుకుని బాగా దగ్గర పడేదాక కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారనిచ్చి చిన్న చిన్న బాల్స్‌లా చే సుకుని పెట్టుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్‌లో వేసుకుని ఓవెన్‌లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక్కో బాల్ వేసుకుని, అటు ఇటు తిప్పి.. నెమ్మదిగా ఆ బాల్స్‌ని ఒక ట్రేలో పెట్టుకుని ఆరనివ్వాలి. అనంతరం నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
బ్రెడ్–ఎగ్ బజ్జీ
కావలసిన పదార్ధాలు
బ్రెడ్ – 15 (ఒకదాన్ని త్రికోణంలో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి)
శనగ పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు
గుడ్లు – 2, కారం – ముప్పావు టీ స్పూన్
పసుపు – చిటికెడు, నీళ్లు – కొద్దిగా
వంట సోడా – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్‌లో శనగపిండి, ఓట్స్‌పిండి, బియ్యప్పిండి, అర టీ స్పూన్ కారం, వంట సోడా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్‌లో గుడ్లు, పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అనంతరం బ్రెడ్ ముక్కలని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచి, అనంతరం శనగపిండి మిశ్రమంలో ముంచి.. బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.
కీమా ఇడ్లీ
కావలసిన పదార్ధాలు
కీమా – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపు, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్ వేయించుకోవాలి)
ఇడ్లీపిండి – 5 లేదా 6 కప్పులు (ముందుగానే మినప్పప్పు నాన బెట్టుకుని, మిక్సీ పట్టుకుని, బియ్యప్పిండి కలిపి సిద్ధం చేసుకోవాలి)
పచ్చి బఠాణీ – 4 టేబుల్ స్పూన్లు (నానబెట్టి, ఉడికించాలి)
క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – పావు టీ స్పూన్
పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్ (చిన్నగా)
కరివేపాకు – కొద్దిగా
నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో నూనె పోసుకుని, వేడి కాగానే.. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, క్యారెట్ తురుము, పచ్చి బఠాణీ.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో కీమా మిశ్రమాన్ని కూడా వేసి, 1 నిమిషం పాటు వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ పాత్రకు నూనె రాసి, వాటిలో కొద్దికొద్దిగా ఇడ్లీపిండి వేసుకుని.. మధ్యలో 2 లేదా 3 టీ స్పూన్ల కీమా కర్రీ పెట్టుకోవాలి. ఆపైన నిండుగా ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment