దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్‌గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది.
బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్‌డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు)
చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పు
తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర
తయారీ
బియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.
ప్యాన్‌లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.
బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment