భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కన్యాదాత ఎంతో హంగు, ఆర్భాటాలతో పెళ్లి చేస్తాడు. ఒకోసారి వరుడి తరఫు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం, లేదా ఖర్చును ఇద్దరూ కలిసి పంచుకోవడం... ఏ రకంగా చూసినా సరే, జీవితంలో ఒక్కసారే జరిగే సంబరం కావడంతో ఖర్చుకు ఎక్కడా వెనుకాడరు. పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి.. మండపాలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల వరకు; టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు... ఇలా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. భారతీయులు సగటున పెళ్లికోసం చేస్తున్న ఖర్చు రూ. 5 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఉంటుందన్నది ఒక అంచనా.
ఇల్లలకగానే పండగా... అన్నట్లు ఉన్నదంతా వదిలించుకుని లేదా లేకపోతే అప్పులు చేసి మరీ పెళ్లి చేసిన తర్వాత ఆ జంట కాపురం కోసం మరికొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏది తక్కువైనా నవ్వుల పాలు కావడం ఖాయం. అయితే వైభవంగా పెళ్లి చేయడం వరకు తప్పేం లేదు కానీ స్తోమతకు మించి అప్పులు చేయడంలోనే అభ్యంతరం... తప్పనిసరి వాటికి ఎలాగూ ఖర్చు తప్పదు కానీ కాస్త ఆచి తూచి ప్లాన్ ప్రకారం చేస్తే పెళ్లికి అయ్యే వృథా ఖర్చును కొంత తగ్గించవచ్చు. అదెలాగో చూద్దాం...
ముందస్తు ప్రణాళిక ...
పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశాం అనే దానికన్నా ఎంత ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేశామన్నది ముఖ్యం. అనుకున్న బడ్జెట్ లోపు చేయాలంటే ఖర్చు ఎక్కడ పెట్టాలి.. ఎక్కడ తగ్గించుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇందుకోసం పెళ్లి తంతులో వివిధ ఘట్టాలకు అవసరమైన వస్తు సామగ్రిని ముందుగానే జాబితా రాసుకోవాలి. అవసరమైతే మండపం, అలంకరణ, కేటరింగ్ వంటి వాటిని ఒకరికే కాంట్రాక్ట్ ఇస్తే కొంతమేరకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పర్యవేక్షణ కూడా బావుంటుంది. వస్త్రాలు, నగలు కూడా అవసరం మేరకే కొనుగోలు చేయాలి.
అతిథుల జాబితా అన్నింటికన్నా ముఖ్యం...
పెళ్లి అంటేనే సకుటుంబ సపరివారంతోపాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అంతా హాజరు కావాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం బంధువులకు ఒకటని, మిత్రులకు మరొకటని కార్డులు ప్రింట్ చేయిస్తుంటారు. ఇక్కడ కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ కామన్‌గా ఒకే ఆహ్వాన పత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. సేహితులకు కార్డులు కొట్టించే బదులు ఈ ఇన్విటేషన్ల ద్వారా కూడా ఆహ్వానం పంపుకోవచ్చు.
అలాగే పెళ్లిలో మెహందీ అని, సంగీత్ అని, హల్దీ అనీ, రిసెప్షన్ అనీ ఇలా చాలా రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. పెళ్లికూతురు దగ్గర కొన్ని, పెళ్లి కొడుకు వద్ద మరికొన్ని.. ఇద్దరిని కలిపి కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఎవరెవరిని పిలవాలనే దానిపై కూడా కసరత్తు చేయాలి. అప్పుడు ఏ ఈవెంట్ కు ఎంతమంది వస్తారో అవగాహన ఉంటుంది కాబట్టి.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
ముందుగా బడ్జెట్ వేసుకోండి... పెళ్లికి ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహిస్తే ఖర్చులు భారీగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ సిద్ధం చేసుకోవడం మొదటి పని. వివాహం అలా చేసుకోవాలని ఇలా చేసుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. కానీ అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వివాహానికి బట్టలు, ఆభరణాలు అవసరం. అలాగని ఖరీదైన బట్టలు, ఆభరణాలు అవసరం లేదు. బడ్జెట్‌లో వచ్చే వాటిని తీసుకోవడం ఉత్తమం.
క్యాటరింగ్: పెళ్లి విందులకు డబ్బు గుడ్డిగా ఖర్చు చేస్తారు. చాలా పెళ్లిళ్ల లో ఆహారం వృథా అవడం గమనిస్తూనే ఉంటాం. వివాహ విందు మెనులో అవసరమైన ఆహార పదార్థాలను మాత్రమే చేర్చండి. లేనిపోని గొప్పల కోసం మెనూని పెంచవద్దు. హాజరయ్యే అతిథుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిద్ధం చేసుకోవాలి. అలంకరణ సామగ్రి పెళ్లి ఇంట్లో చాలా అలంకరణ ఉంటుంది. అవసరమైన అలంకరణ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వీటిలో పువ్వులు చాలా ముఖ్యమైనవి. వాటిని చౌకగా ఉన్న ప్రదేశాల నుంచి కొనుగోలు చేస్తే కొంత డబ్బు ఆదా అవుతుంది.
హనీమూన్ ట్రిప్... పెళ్లితంతు ముగిసిన తర్వాత నూతన వధూవరుల హనీమూన్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్లుగా పేరుగాంచిన దేశాలకు ఎగిరిపోతున్నారు. ఇది కూడా బడ్జెట్ పెరగడానికి కారణం అవుతుంది. దీని బదులుగా మన దేశంలోనే అనువైన ప్రాంతాలను ఎంచుకుంటే చాలా సమయంతో పాటు ధనమూ ఆదా అవుతుంది. ఒకవేళ విదేశాలకే వెళ్లాలనుకుంటే తక్కువ ఖర్చుతో వెళ్లిరాగలిగే మలేసియా, థాయ్‌ల్యాండ్ వంటివి ఎంచుకుంటే సరిపోతుంది.
(చదవండి: మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే! )
Comments
Please login to add a commentAdd a comment