ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో 157 దేశాల్లో మహిళల్లో రొమ్ము కేన్సర్ అత్యంత సాధారణంగా కనిస్తున్న కేన్సర్. 2022లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల 70వేల మంది ఈ కేన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. 2.3 మిలియన్ల మంది మహిళలు బాధ పడుతున్నారు. యుక్తవయస్సు తర్వాత ఏ వయస్సులోనైనా మహిళల్లో ఇది కనిపించవచ్చు. పురుషుల్లో కూడా ఈ తరహా కనిపిస్తున్నప్పటికీ చాలా తక్కువ (దాదాపు 0.5–1 శాతం) కనిపిస్తోంది.
అమెరికాలో 8 మంది మహిళల్లో ఒకరు జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. 2024లో, 310,720 మంది మహిళలు, 2,800 మంది పురుషులు ఇన్వాసివ్ బ్రెస్ట్ కేన్సర్‌కు గురయ్యారని అంచనా.
అసలు రొమ్ము కేన్సర్ లేదా బ్రెస్ట్ కేన్సర్ ఎందుకు వస్తుంది. దీన్ని ఎదుర్కోవడం ఎలా అంశాలపై డా. శ్రీకాంత్ మిర్యాల ఎక్స్‌లో ఒక ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన వివరాలు మీకోసం యథాతథంగా..
ఆడవాళ్లలో చర్మ కేన్సర్(విదేశీయుల్లో) తప్పితే అత్యంత ఎక్కువగా వచ్చే క్యాన్సరు రొమ్ము కేన్సరు. ఇప్పుడు వస్తున్న కొత్త పద్ధతుల ద్వారా దీన్ని ముందుగానే కనిపెట్టడం అలాగే, చికిత్స వల్ల గత ముఫ్ఫైఏళ్లలో మూడోవంతు మరణాల్ని తగ్గించగలిగాం.
సాధరణంగా 50ఏళ్ల కంటే వయసు ఎక్కువున్న వాళ్లలో వస్తుంది, కానీ ఇరవై నుంచి నలభై మధ్యలో కూడా రావటం అరుదు కాదు.
12 ఏళ్లకంటే ముందుగా రజస్వల అయిన వాళ్లలో, 35ఏళ్ల వరకూ ఒక్కసారి కూడా నిండు గర్భిణీ కానివాళ్లలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే వీళ్లలో ఈస్ట్రోజన్ హార్మోన్ కి రొమ్ములు ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం వలన.
అయితే గర్భం ఎప్పడు వచ్చినప్పటికీ పిల్లలకి ఎక్కువరోజులు పాలివ్వటం వలన తల్లిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి.
ఆసియా దేశాల్లో, వ్యయసాయం చేసే ఆడవాళ్లలో పట్టణాల్లో, అమెరికావంటి దేశాల్లో ఉండే మహిళల కంటే పదివంతులు తక్కువగా వస్తుంది. గ్రామాలనుంచి పట్టణాలకి చిన్నప్పుడే వలస వెళ్లిన అమ్మాయిలలో మళ్లీ పట్టణాల్లో వచ్చేంత స్థాయిలోనే రొమ్ము కేన్సర్ వస్తుంది.
గర్భనిరోధక మాత్రలు వాడటం వలన రొమ్ముకేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగినప్పటికీ అవాంఛిత గర్భాన్ని నివారించటంతో పాటు, అండాశయ, గర్భాశయ కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
బహిష్టు ఆగిపోయిన తర్వాత వాడే హార్మోన్ రీప్లేసెమెంట్ థెరపీ వలన రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
స్థూలకాయం, మధుమేహం, మద్యం సేవించటం వల్ల కూడా ఈ న్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే కుటుంబంలో ఇంకెవరికైనా ఉంటే ఆ జన్యువుల వలన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎలా నివారించాలి?
జన్యుపరమైన కారణాలున్నవాళ్లలో కచ్చితంగా వస్తుంది కాబట్టి ముందుగానే రొమ్ములు శస్త్రచికిత్స చేసి తొలగించటం. ఇది అందర్లో కాదు, జన్యులోపాలు ఉన్నవాళ్లలో మాత్రమే.
మంచి ఆహారం, వ్యాయామం.
అనవసరంగా హార్మోన్ థెరపీ వాడకుండా ఉండటం.
స్క్రీనింగ్- అన్నిటికంటే ముఖ్యమైనది.
ప్రతిఒక్కరూ వాళ్ల రొమ్ముల్ని అద్దం ముందు అనాచ్ఛాదితంగా నిలబడి పరీక్ష చేసుకోవాలి. ముందుగా రెండిటినీ గమనించాలి. వాటి రూపులో, పరిమాణంలో మునుపటికంటే తేడాలు ఏమైనా ఉంటే చూడాలి. చనుమొనలు ముందులానే ఉన్నాయా? వెనక్కి వెళ్లాయా? రక్తం, చీము, నీరు లేదా బాలింత కాకుండా పాలు ఏమైనా వస్తున్నాయా చూడాలి. చర్మంలో మార్పులు - పుళ్లు, పగుళ్లు, దళసరి అవ్వటం, నారింజ చర్మంలా గుంతలు కనపడటం ఏమైనా ఉందా చూడాలి. తర్వాత ఒకచెయ్యి నాలుగు వేళ్లతో రొమ్మును నాలుగు భాగాలుగా ఊహించి ప్రతీభాగంలో గుండ్రంగా తిప్పుతూ గడ్డలు ఏమైనా తగులుతున్నాయేమో అని చూడాలి, అలాగే పైకి వెళ్లి చంక భాగంలో కూడా చూడాలి. అలాగే రెండో రొమ్ము కూడా పరీక్షించాలి.ఇలా నెలకొకసారి పరీక్ష చేయించుకోవాలి.
అలాగే మామ్మోగ్రాం అని ఎక్స్ రే పరీక్ష ఉంటుంది, యాభై ఏళ్లు దాటిన వాళ్లలో ప్రతి రెండేళ్లకి చెయ్యాలి. బిగుతైన రొమ్ములున్నవాళ్లకి కొన్నిసార్లు ఎమ్మారై అవసరం అవుతుంది.
ఎలాంటి గడ్డలైనా వైద్యుడికి చూపించాలి. దాన్ని బయాప్సీ చేయించాలి. తద్వారా తర్వాత చికిత్స అవసరమా లేదా అన్నది తేలుస్తారు.
ఇప్పటికే కుటుంబంలో రొమ్ము కేన్సర్ వచ్చినవాళ్లు (అమ్మమ్మ, అమ్మ, అక్కా చెల్లెళ్లు) ఉంటే జన్యుపరీక్ష చేయించుకుని, ఎప్పటికప్పుడు వైద్యుడితో రొమ్ములను పరీక్షించుకోవాలి.
రొమ్ము కేన్సర్ నుంచి బయటపడటం అది యే దశలో గుర్తించారన్నదాన్ని బట్టి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment