
జీవితాన్ని ప్రారంభించేటప్పుడు తెలియదు ఆ జీవితం ఎన్ని మలుపులు తీసుకుంటుందో. మన ఆకాంక్షలు కొన్ని, అవకాశాలు కొన్ని, అభిరుచులు మరికొన్ని. వీటన్నింటినీ కలబోసుకుని జీవితాన్ని డిజైన్ చేసుకోవాలని ఉండడం ఏ మాత్రం తప్పులేదు. అది మనిషి హక్కు కూడా. అయితే అక్కడే మనిషి ముందు అనారోగ్యం రూపంలో ఓ ప్రశ్నార్థకం నిలబడుతుంది. ఆ సవాల్‌కు దీటైన సమాధానాన్ని విసిరి లైఫ్‌ని కలర్‌ఫుల్‌గా మలుచుకుంది ప్రకృతి గుప్తా.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ప్రకృతి గుప్తా ఉన్నతవిద్య కోసం కెనడాకి వెళ్లింది. అక్కడి యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి క్రిజ్లర్ ఫైనాన్సియల్ కంపెనీలో ఉద్యోగం, కొంతకాలానికి మెర్సిడెస్ బెంజ్ కంపెనీలో ప్రాజెక్ట్ లీడ్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత పెళ్లితో ఆమె వర్క్ ప్లేస్ దుబాయ్‌కి మారింది. అక్కడ ఫియట్ క్రిజ్లర్ గ్రూప్‌తో పని చేసింది.
ఇక్కడి వరకు జీవితంలో ప్రతి సోపానమూ ఆనందకరమే. అప్పుడు మొదలైంది అనారోగ్యం రూపంలో ఓ పరీక్ష. అనేక పరీక్షల తర్వాత నిర్ధారణ అయిన విషయం హాడ్గ్‌కిన్స్ లింఫోమా క్యాన్సర్ అని. జీవితం మీద ఆశలన్నీ ఆవిరైపోయే పరిస్థితి అది. క్యాన్సర్‌ను జయించాలంటే ట్రీట్‌మెంట్ కంటే ప్రధానమైనది మానసిక స్థయిర్యం. జయించగలననే ధీమాతో పోరాడినప్పుడే దేహం ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తుంది. ప్రకృతి తన జీవితం మీద సడలని విశ్వాసంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆలోచించింది. ‘ఈ విరామానికీ ఓ అర్థం ఉండి ఉంటుంది’ అని గట్టిగా నమ్మింది కూడా. చిన్నప్పుడు కలగన్న భవిష్యత్తు కళ్లముందు మెదలసాగింది.
నాన్న స్వీట్ వ్యాపారి
‘‘నాన్న హైదరాబాద్‌లో స్వీట్స్ వ్యాపారి. స్వీట్స్ వ్యాపారి మాత్రమే కాదు, చాలా స్వీట్ వ్యాపారి కూడా! ఉద్యోగుల విషయంలో ఆయన చాలా బాధ్యతగా ఉండేవారు. నాన్నే నాకు రోల్‌మోడల్. నాన్నలా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని ఉండేది. అయితే బిజినెస్‌లో చాలెంజెస్ ఎక్కువ. ఉద్యోగమే హాయి అని నన్ను సౌకర్యవంతంగా ఉంచడానికే నిర్ణయించుకున్నారు మా వాళ్లు. నేనూ అదేబాటలో నడిచాను. కానీ ఈ విరామం నాలోకి నేను ప్రయాణించడానికి దోహదం చేసింది. కీమోథెరపీ కోసం మూడు నెలలు, రేడియేషన్ థెరపీ కోసం మరో రెండు నెలలు హాస్పిటల్‌లో నాలుగ్గోడల మధ్యనే గడిపాను. ఎటు చూసినా రంగు వెలసిన జీవితంలా తెల్లటి గోడలు. ‘నా జీవితానికి నేనే రంగులద్దాలి. నా జీవితాన్ని నేనే రీ డిజైన్ చేసుకోవాలి’ అని నిశ్చయించుకున్నాను. ఆ సంకల్పం నుంచి పుట్టుకొచ్చినదే కఫ్తాన్ కంపెనీ.
ఇది నా విజయం
‘‘కఫ్తాన్‌లో నాతోపాటు యాభై మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో ముప్పై ఐదు మంది మహిళలే. సాధారణంగా ఇలాంటి చిన్న కంపెనీలలో వర్కింగ్ సెక్షన్‌లో మహిళలు, పర్యవేక్షణ విభాగంలో మగవాళ్లు కనిపిస్తుంటారు. కానీ నా కంపెనీలో మేనేజర్, అకౌంటెంట్, వర్క్ సూపర్‌వైజర్ వంటి కీలక స్థానాల్లో మహిళలే ఉన్నారు. దీనిని 2011లో స్థాపించాను. దాదాపుగా కంపెనీ తొలినాళ్ల నుంచి కొనసాగుతున్న వాళ్లు ఉన్నారు. కఫ్తాన్‌తో పాటు నాన్న స్థాపించిన ‘క్రాక్ హీల్’ ఆయింట్‌మెంట్ కంపెనీ కూడా నేనే చూసుకుంటున్నాను. దానిని మా నాన్న సక్సెస్ చేసి నా చేతికిచ్చారు. దానిని నడిపించడంలో పెద్ద కిక్ ఉండదు. ఇది నా బ్రెయిన్ చైల్డ్. దీనిని విజయపథంలో నడిపించడం నా చాలెంజ్. ఈ జర్నీ నాకు సంతోషంగా ఉంది’’ అని వివరించింది ప్రకృతి గుప్తా.
– వాకా మంజులారెడ్డి
కఫ్తాన్... అంటే వదులుగా ఉండే చొక్కా. ఇది పర్షియా పదం. టర్కీ, ఫ్రాన్స్‌లో కూడా వాడుకలో ఉంది. మధ్యధరా ప్రాంతంలో నివసించే వాళ్లు ధరిస్తారు. మన దగ్గర నైట్‌డ్రస్‌గా వాడుకలో ఉన్న మోడల్‌ని సరికొత్తగా పగలు ధరించే మోడల్‌గా మార్చాను. మనం ధరించిన దుస్తుల విషయంలో దేహం ఎటువంటి ఆంక్షలనూ పెట్టకూడదు. ఒంటికి తగలగానే హాయిగా ఫీలవ్వాలి. అదే సౌకర్యాన్ని రోజంతా ఉంచగలగాలి. ధరించిన డ్రస్‌ను రోజంతా ఒంటి మీద ఉంచుకోగలగాలి... అనే ఆలోచనకు ప్రతిరూపమే ఈ లాంజ్‌వేర్. అలాంటి మెటీరియల్‌ను ఎంపిక చేయడం, ఆకర్షణీయమైన డిజైన్‌లకు రూపకల్పన చేయడమే నా సక్సెస్. ఇక వాటికి మరిన్ని సొబగుల కోసం దేశంలో రకరకాల అద్దకాలు, రకరకాల సంప్రదాయ డిజైన్‌లను ఎంచుకున్నాను. నేను అనుకున్న థీమ్‌తో పని చేస్తున్న వాళ్లు మార్కెట్‌లో పెద్దగా లేరు. ఇక ఆలస్యం చేయలేదు. అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే వస్త్రాల తయారీ మొదలుపెట్టాను’’ అని తన జీవితానికి హైదరాబాద్‌లో కొత్త గమ్యాన్ని నిర్దేశించుకున్న వైనాన్ని వివరించింది ప్రకృతి.
Comments
Please login to add a commentAdd a comment