కన్నా!.. యుద్ధమేనా నీకు జోలపాట? | Special Story On Impact Of War On Children In The Israel Hamas War In Telugu - Sakshi
Sakshi News home page

Israel Hamas War Updates: యుద్ధమేనా నీకు జోలపాట? ప్రతి యుద్ధంలో బలయ్యేది..

Published Sun, Dec 3 2023 10:26 AM | Last Updated on Sun, Dec 3 2023 11:26 AM

Impact Of War On Children Children In The Israel Hamas War - Sakshi

కన్నా! యుద్ధమేనా నీకు జోలపాట? అమ్మ లేదు, నాన్న కనపడడు. ఆకాశంలో వెలుతురు కక్కుతూ కనిపించేది నక్షత్రం కాదు. చెవులు చిల్లులు పడే మోత బడిగంట కాదు.గాలిలో గంధకం వాసన...శిథిలాలలో చిక్కుకున్నఇష్టమైన ఆటబొమ్మ. ఏడుపు ఊరికూరికే వస్తుంది. ఎవరూ నవ్వరు, ముద్దు చేయరు. శోకం పాటలానే ఉంటుంది కానీ అది అమ్మ జోలపాటలా ఉండదు. ఏం జరుగుతోంది? ఈ పెద్దవాళ్లు ఆడుకోవడానికి ఆటబొమ్మలే లేవా? మాతోనే ఆడుకోవాలా?

'ప్రతి యుద్ధం పిల్లలకు వ్యతిరేకమైనదే'.

కులం తెలియదు. మతం తెలియదు. జాతి తెలియదు. దేశం తెలియదు. సరిహద్దు తెలియదు. ఆయుధాలూ తెలియవు. మబ్బును చూస్తే నవ్వుతారు. పిట్టను చూస్తే గెంతుతారు. తూనీగతో కబుర్లు చెబుతారు. అఆలు రాయడానికి ఆపసోపాలు పడతారు. పాలబువ్వ తింటూ తింటూండగానే కునుకు తీస్తారు. మట్టితో జత కడతారు. బుజ్జి ఆశలకు మారాము చేస్తారు. బెదిరితే అమ్మ వెనుక దాక్కుంటారు.

తమను చూసే ప్రకృతి ఈ పెద్దవాళ్ల ముఖాన నాలుగు చినుకులను చిలకరించి, నాలుగు గింజలు పండించి, నాలుగు నదులను పారిస్తుందని తెలియకనే బుల్లి బుల్లి నడకలతో చిన్నారి దేవతలై తిరుగాడుతారు. ఇటువంటి దేవదూతల కళ్లల్లో రక్తం చిమ్మించే, వీరి ఊపిరి తీయాలని చూసే, యుద్ధం చేసే నేతలను ఏం చేయాలి? శత్రువును ద్వేషించే దాని కన్నా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే యుద్ధాలే ఉండవు

కొట్టుకోవడం మనుషుల స్వభావంలో ఉన్న అల్ప లక్షణం. మానవచరిత్ర పొడవునా గుంపులుగా కొట్టుకున్నారు. చిన్న చిన్న రాజ్యాలుగా కూడి కొట్టుకున్నారు. దేశాలుగా ఎదిగి కొట్టుకున్నారు. ఇంత నాగరికులం అయ్యామని విర్రవీగుతూ కూడా కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు సుశిక్షితమైన సైన్యాలు లేవు. అశ్వికదళం అంటూ ఒకటి అడుగుపెట్టింది కూడా మూడువేల సంవత్సరాల క్రితం ఇనపయుగంలోనే. యుద్ధాల చరిత్రతోపాటు ఆయుధాల పరిణామక్రమం చూస్తే.. రాతి గదల నుంచి విల్లమ్ములు, తుపాకులు, శతఘ్నులు, యుద్ధశకటాలు, నిప్పులు కురిపించే విమానాలు, చివరికి అణ్వస్త్రాల వరకు ఆయుధపాటవం అంచెలంచెలుగా పెరిగి.. యుద్ధాన్ని విద్యగానూ, కళగానూ, వ్యూహనైపుణ్యానికి గీటురాయిగానూ మార్చివేయడం కనిపిస్తుంది. దేశం ఎదగడం అంటే గొప్ప సైనిక శక్తిగా ఎదగడమే. అందుకే ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక మూలన యుద్ధ సైరన్‌ను మోగిస్తూనే ఉంటోంది.

"పిల్లలు యుద్ధాన్ని మొదలెట్టరు. కాని ఏ యుద్ధంలో అయినా వారే ఎక్కువగా నష్టపోతారు"

యుద్ధం రెండు దేశాల మధ్య, ఆ దేశాలకు చెందిన సైన్యాల మధ్య.. సాధారణ జనానికి సుదూరంగా ఎక్కడో సరిహద్దుల్లో జరుగుతుందని అనుకుంటాం కానీ యుద్ధమనేది యుద్ధక్షేత్రాన్ని దాటి ఎప్పుడో జనజీవనక్షేత్రంలోకి వచ్చేసింది. ఏ క్షణంలోనైనా శత్రు విమానాలు నేరుగా పౌరుల నెత్తి మీదే బాంబులు కురిపించవచ్చు. బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా ఎవరైనా యుద్ధాగ్నిలో సమిధలు కావచ్చు.

ఆసుపత్రులు, స్కూళ్లు వేటినీ వదలరు. ఆధునిక కాలానికి వస్తున్నకొద్దీ పౌర మరణాల దామాషాలో బాలలు కడతేరడమూ పెరిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 20 శతాబ్దపు తొలినాటికి యుద్ధ మృతులలో సగం మంది పౌరులైతే, 1980నాటికి అది 90 శాతానికి పెరిగింది. వీరిలో బాలలది ప్రధాన భాగం. గత రెండు దశాబ్దాల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో ఇరవై లక్షలమంది బాలలు చనిపోయారనీ, నలభై నుంచి యాభై లక్షలమంది క్షతగాత్రులయ్యారనీ, కోటీ ఇరవై లక్షలమంది నిరాశ్రయులయ్యారనీ, పది లక్షల మంది అనాథలయ్యారనీ ఐక్యరాజ్యసమితి బాలల నిధి సంస్థ చెబుతోంది.

యుద్ధమనేది ఒక్కసారిగా అలా భగ్గుమని, కొన్ని రోజులపాటు కొనసాగి ఆ తర్వాత చల్లారే ఒక విడి ఘటనగా భావిస్తాం. కానీ దాని ప్రభావం బాలలు, స్త్రీలు, క్షతగాత్రులు సహా ఆ తర్వాత అనేకమందికి జీవితకాలమంతటికీ వ్యాపించి సంపూర్ణ జీవనవిధ్వంసంగా మారుతుంది. ఆ విధంగా ఒకే ఘటన అనేక గొలుసుకట్టు ఘటనల కూర్పుగా పరిణమిస్తుంది. యుద్ధం ఒక తాత్కాలిక అవాంతరమనీ, అది తొలగిపోగానే యథాప్రకారం శాంతి నెలకొని స్థిరంగా కొనసాగుతుందనే భ్రమలో కూడా మనం ఉంటాం. కానీ యుద్ధాల చరిత్రను తిరగేస్తే, యుద్ధపరిస్థితే స్థిరంగా ఉంటుందనీ.. శాంతి మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే అతిథి మాత్రమేననే చేదునిజం మన ఊహల్ని చరచి చెబుతుంది.
 
"యుద్ధాలు జరుగుతున్నంత సేపు పిల్లలను ఆకాశంలో దాచి పెట్టేయాలి "
– ఒక కవి

మనం శాంతికాముకులమా? నిజమేనా? మనం ఇప్పటికీ యుద్ధాన్ని ప్రేమిస్తూ వీరత్వాన్ని ఆరాధిస్తాం. మతాల గాథలలో శౌర్యాన్ని దండిగా నింపుకుంటాం. ప్రతి వాఙ్మయంలోనూ వీరుల చుట్టూ స్తుతిగేయాలే! వీరుడంటే? యుద్ధం చేసేవాడు. శత్రువును చంపడం, వీర మరణాన్ని పొందడం దేశభక్తి. యుద్ధం పవిత్రమైన యజ్ఞంగా రూపుకట్టింది. రోగమొచ్చి చావడం కన్నా, యుద్ధంలో చావడం కీర్తికీ, జీవనసార్థక్యానికీ సంకేతమైంది.

బాల్యం నుంచి వీరరసాన్ని ఉగ్గుపాలలో రంగరించి పోయడం పరిపాటి అయింది. యుద్ధంలో నీతి, అవినీతులు.. ధర్మాధర్మాలు.. అన్నీ తలకిందులవుతాయి. నిరాయుధులు, యుద్ధరంగంలో లేనివారు అయిన బాలలను, స్త్రీలను, వృద్ధులను వధించరాదన్న నీతికి పౌరాణిక, చారిత్రకకాలంలోనే కాలదోషం పట్టింది. శత్రురాజ్యాన్ని జయించడంతో ఊరుకోకుండా, శత్రునగరాన్ని దగ్ధంచేసి బూడిద కుప్పగా మార్చడం ఇప్పుడు యుద్ధనీతి. రెండువైపులా జరిగిన సైనికనష్టం, ధననష్టం గురించిన ఆరా తప్ప ఆ మంటల్లో పడి మాడి మసైన బాల్యాల లెక్కలూ, తల్లుల కడుపుకోతల కటికశోకాల సమాచారమూ చిట్టాలకెక్కవు. బతికి బయటపడినా బతుకు అస్తవ్యస్తమై జీవితాంతమూ పెనుభారమైన విషాదకథనాలు వెలుగులోకి రావు. యుద్ధం బాల్యాన్ని చిదిమేసి శేషజీవితాన్ని శవప్రాయంగా మార్చుతుంది. యుద్ధాలలో జీవన్మృతుల సంఖ్యే మృతుల సంఖ్యను ఎన్నో రెట్లు మించి ఉంటుంది.  
   
'యుద్ధంలో గెలిచిన సంపద మొత్తం పసిపిల్లల బోసినవ్వుకు సరిసాటి కాదు'

కురుక్షేత్రంలో ఎంత ప్రాణనష్టం జరిగినా అభిమన్యుడు మరణించినప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే అభిమన్యుడు ఇంకా పసివాడు. ఎంతో భవిష్యత్తు ఉండాల్సిన వాడు. కురుక్షేత్ర యుద్ధం పెట్టిన కడుపుచిచ్చు కన్నతల్లుల వేడికన్నీరుగా ఉబికి ధారకట్టిన వైనాన్ని మహాభారతంలోని స్త్రీపర్వం కడు దయనీయంగా చిత్రించింది. యుద్ధకారకులు ఎవరూ తల్లుల శాపం నుంచి తప్పించుకోలేకపోయారు.

అయినా మనిషి గుణపాఠం నేర్చుకోలేదు. రాజ్యాల మధ్య, దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే, విజేతలను ఆకాశానికెత్తి, విజితుల భంగపాటును ఎత్తిచూపడమే తప్ప యుద్ధాలు చిదిమేసిన పసిమొగ్గల గురించి, మృతుల కుటుంబాలు ఎదుర్కొన్న కల్లోలం గురించి, విద్యా, వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం సహా సమస్తరంగాలనూ.. అంగాలనూ యుద్ధం ఛిద్రం చేసి సమాజాన్ని వెనుకదారి పట్టించడం గురించి చెప్పిన వాఙ్మయాలు అంతగా కనిపించవు.

రెండో ప్రపంచయుద్ధాన్నే తీసుకుంటే  మృత్యువు తన కర్కశరూపాన్ని ప్రదర్శించిన ఇలాంటి యుద్ధసందర్భం అంతవరకు ప్రపంచ చరిత్రలోనే లేదంటారు. 1940నాటి ప్రపంచ జనాభా 230 కోట్లు అయితే, రెండో ప్రపంచయుద్ధంలో ఏడుకోట్ల నుంచి ఎనిమిదిన్నర కోట్లమంది నాశనమయ్యారు. సైనికులు, పౌరులు సహా నేరుగా యుద్ధంలో అయిదు నుంచి అయిదున్నర కోట్లమంది మరణించారు. యుద్ధకారణంగా వ్యాపించిన రోగాలవల్ల, కరవుకాటకాల వల్ల మరణించిన పౌరుల సంఖ్య అయిదు నుంచి అయిదున్నర కోట్లకు పెరిగి మరణించిన సైనికుల సంఖ్యతో సమానమైంది. బాలల విషయానికే వస్తే, ఈ యుద్ధంలో అంతకుముందు మరే యుద్ధంలోనూ లేనంత పెద్దసంఖ్యలో మృతులవడమో, అనాథలుగా మిగలడమో జరిగింది. నాజీ జర్మన్‌ నరహంతకులు కోటీ యాభై లక్షలమంది యూదు బాలల ఉసురు తీశారు. వేల సంఖ్యలో రొమానీ (జీప్సీ) బాలలను అంతమొందించారు.

అయిదువేల నుంచి ఏడువేల మంది జర్మన్‌ బాలలు శారీరక, మానసిక వైకల్యాలతో ఆవాసకేంద్రాలకు చేరి ఆహ్లాదకర, ఆశావహ బాల్యాన్ని కోల్పోయి అకాల వృద్ధులుగా గడిపారు. ఏన్‌ మేరీ ఫ్రాంక్‌ అనే యూదు బాలిక రాసిన డైరీ బాలల జీవితంలో యుద్ధం కలిగించే కల్లోలానికి అక్షరరూపమిచ్చి చిరస్థాయిగా మిగిలింది. అయినా కనువిప్పు కలగలేదు. యుద్ధాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. బాల్యాలు బేలవై బిక్కచూపులు చూస్తూనే ఉన్నాయి. 

'రష్యా పిల్లలైనా, ఉక్రెయిన్‌ పసికందులైనా, ఇజ్రాయిల్‌ శిశువులైనా, గాజా చిన్నారులైనా అమ్మ పాలే తాగుతారు'

వర్తమానానికి వస్తే.. అటు రష్యా– ఉక్రెయిన్ల నుంచి ఇటు ఇజ్రాయిల్‌–పాలస్తీనాల వరకు యుద్ధక్షేత్రాలు వ్యాపించి కన్నీటితో చావుపంటలు నిరవధికంగా పండిస్తూనే ఉన్నాయి. శాంతి, సామరస్యాల స్థాపనకు నెలకొల్పిన అంతర్జాతీయ సంస్థలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఉక్రెయిన్‌ పట్ల రష్యా సాగిస్తున్న మారణకాండ దరిమిలా, గత ఏడాది కాలంగా బాలలు హింసావిలయంలో, భయబీభత్సాల వలయంలో జీవిస్తున్నారు.

యుద్ధం ప్రభావితం చేయని వారి జీవనపార్శ్వం ఒక్కటీ లేదు. ఈ యుద్ధం ఇంతవరకు పొట్టన పెట్టుకున్న వెయ్యి మంది పౌరులలో మరణించిన, గాయపడిన బాలలూ అధికసంఖ్యలో ఉన్నారు. మరోవైపు పదిహేను లక్షలమంది బాలలు ఇంటికి, భద్రతకు, చదువుకు, ఆటపాటలకు దూరమై మానసిక, శారీరక అనారోగ్యాలతో ఆందోళనతో నిరాశానిస్పృహల మధ్య గడుపుతున్నారు. తల్లిదండ్రుల వెచ్చని ప్రేమాదరాల కింద గడపాల్సిన పచ్చని బాల్యాన్ని, బంగారుభవితను యుద్ధరాకాసి గుటుక్కున మింగి తేన్చింది. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య చూస్తున్నది, రెండో ప్రపంచయుద్ధం తర్వాత యూరప్‌లోనే అతిపెద్ద మారణహోమంగా చెబుతున్నారు. 

అయితే, నేడు ఇజ్రాయిల్‌ –పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధం దానిని మించిపోయి వర్తమాన యుద్ధచరిత్రను తిరగరాస్తున్నట్టు కనిపిస్తోంది. 2017 నుంచి జరిగిన ఏ ఘర్షణలతో పోల్చి చూసినా గాజా భూఖండంలో జరిగిన పౌరమరణాలు అసాధారణాలూ, కనీవినీ ఎరుగనివీ అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరోస్‌ అంటున్నారు. తాజా ఘర్షణల్లో అటూ ఇటూ కూడా వేలాదిమంది అసువులు వీడారు.

వీరిలో బాలలు పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇజ్రాయిల్‌ వైపు పౌరులతో సహా 1300 మంది బాలలు హతమారితే.. పాలస్తీనావైపు 6వేల మంది బాలలుచ 4 వేల మంది మహిళలతో సహా 15వేల మంది నిహతులయ్యారు. నాజీ జర్మనీ రూపంలోని జాతి ఉన్మాదపు కాలసర్పం కాటు తిని, చిత్రహింసా శిబిరాలలో నలిగి నుజ్జయి ప్రపంచం సానుభూతిని చూరగొన్నవారే పాలస్తీనావారిపై అంతకుమించిన హింసకు, ప్రతిహింసకు పాల్పడుతున్నారు.

ఆసుపత్రులను సైతం దాడులకు లక్ష్యం చేసుకుని పసిపిల్లలను, రోగులను హతమార్చడం నాజీ అమానుషాలను తలదన్నేదే కానీ తీసిపోయేది కాదు. అప్పుడే పుట్టిన శిశువులను కూడా బాలింతలు అరచేతుల్లో ఉంచుకుని సురక్షితప్రాంతాలకు పరుగుదీయాల్సిన పరిస్థితిని కల్పించడం వెనుక యుగయుగాలుగా ప్రోది చేసుకుంటూ వచ్చిన మంచినీ, మానవత్వాన్నీ కాలరాసే క్రౌర్యమూ కుత్సితమూ ఉన్నాయి. ఆహారంతో సహా అన్ని రకాల నిత్యావసరాల సరఫరానూ అటకాయించే దిగ్బంధమే పది యుద్ధాల పెట్టు. ఒక్కసారిగా కాకుండా అనునిత్యం ఎదుర్కొనే అనేకానేక చావులకు సమానం.

2006 నుంచీ గాజాపౌరులపైన ఇజ్రాయిల్‌ అలాంటి దిగ్బంధాన్ని అమలు చేస్తోంది. దాంతో గాజా ఆర్థికత దారుణంగా అడుగంటిపోయింది. స్థూలజాతీయోత్పత్తి 30 శాతం పడిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. 81శాతం జనం దారిద్య్రరేఖకు దిగువున జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. వైద్యం కోసం కూడా రోగుల్ని బయటకు వెళ్లనివ్వకుండా దిగ్బంధాన్ని అమలు చేయడం జరుగుతోంది. దిగ్బంధమంటే ఒక ప్రాంతాన్నే విశాలమైన చెరసాలగా మార్చి అసంఖ్యాక జనాన్ని బందీలుగా ఉంచడమే! ఆ చెరలో బాలలు, స్త్రీలు, వృద్ధులతో సహా అందరూ బందీలవుతారు.

అది బాల్యానికి చెర. వారి చదువుసంధ్యలకు, వారి భవిష్యత్తుకు, వారి శారీరక, మానసిక వికాసానికి ఉరి. ఎదిగే లేతమొక్క లాంటి వారి జీవితాలపై బండ. యుద్ధోన్మాదులందరూ ఒకే జాతి, ఒకే మతం. అందులో జయాపజయాలు, బలాబలాల తేడాలు తప్ప ఇతరేతర భేదాలు ఉండవు. దాని ఫలితమే రెండువైపులా దాడులు, విచక్షణారహితమైన ఊచకోతలు, బాలల బతుకుల్ని బుగ్గి చేసే నొసటి రాతలు. 

'ఈ భూమి మోసే అన్ని భారాల్లోకెల్లా అత్యధిక భారం ఏమిటో తెలుసా? పసిపిల్లల శవపేటిక'

విజ్ఞత, వివేకం, విచక్షణ సహా అన్నింటినీ మింగేసే అనకొండ యుద్ధం. మనిషి నడవడికి దిక్సూచులుగా నిఘంటువులకెక్కిన ప్రతి ఒక్క మంచిమాటనూ తన రక్తపు వేళ్ళతో చెరిపేసి తన పేరు రాసుకునే మాటే యుద్ధం. పసి చేతులకు ఆయుధాలు అందించి మసి చేయడానికి అది వెనుకాడే ప్రశ్న లేదు. పద్దెనిమిదేళ్ళ లోపు బాలలను యుద్ధాల బరిలోకి లాగడం మధ్యయుగాల నుంచీ, అలనాటి ఫ్రెంచి సైనికశాసకుడు నెపోలియన్‌ కాలం నుంచీ ఉందని చరిత్రకారులు అంటారు.

అమెరికా అంతర్యుద్ధంలో కూడా బాలలు పాల్గొనడం కనిపిస్తుంది. రెండో ప్రపంచయుద్ధంలో బాలలు పాల్గొనడమే కాదు.. నాజీ జర్మనీలో ‘హిట్లర్‌ యువత’ పేరుతో  ‘యుద్ధసేవలు’ అందించారు. నేటి కాలానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాలలోని యుద్ధక్షేత్రాలలో దాదాపు పాతిక కోట్లమంది బాలలు ఉండగా, వారిలో మూడులక్షలమంది సైనికవిధులు నిర్వహిస్తున్నట్టు, వారిలో నలభైశాతం మంది బాలికలున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మంట మిడతలదండును ఆకర్షించినట్టుగా యుద్ధం వయోభేదం లేకుండా అందరినీ ఆకర్షిస్తుంది. యుద్ధవాదులు దానిని అలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. 

యుద్ధానికీ, శాంతికీ మధ్య విభజనరేఖ చెరిగిపోయి.. అటు నుంచి ఇటూ.. ఇటు నుంచి అటూ నిరంతర చంక్రమణం చేసే పరిస్థితిని లియో తొల్‌స్తాయ్‌ ‘యుద్ధం –  శాంతి’ నవలలో అనితరసాధ్యంగా చిత్రిస్తాడు. జీవించడమూ, సంపూర్ణంగా జీవితాన్ని ఆనందించి ఆస్వాదించడమే ప్రతి ప్రాణికి ప్రకృతి కల్పించిన సహజాతం. అలాంటిది, యుద్ధపరిస్థితిలో చావే జీవితంగా ఎలా మారిపోతుందో తొల్‌స్తోయ్‌ కళ్ళకు కట్టిస్తాడు. రేపటి జీవితం గురించి కమ్మని కలలు కంటూ కంటూనే యువకులు యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టి చావుతోనూ, చావు పరిస్థితులతోనూ ఎలా సహజీవనం చేస్తారో రూపు కడతాడు.

ఫ్రెంచి సేనల ముట్టడిలో మాస్కో నగరం దగ్ధమవుతున్నప్పుడు మంటలను తప్పించుకుని ప్రాణాలు దక్కించుకోడానికి తట్టాబుట్టతో వీథిన పడ్డ కుటుంబాల గురించి, సైనికులు చేసిన నిలువుదోపిడీల గురించి, మంటల్లో చిక్కుకున్న తన పసిబిడ్డ కోసం తల్లి పెడుతున్న శోకాలకు కరిగి పియర్‌ అనే యువకుడు మంటల్లోకి దూకి ఆ పసిపాపను రక్షించడం గురించి రాస్తాడు. పేత్యా అనే పదిహేడేళ్ళ యువకుడు ఉరకలేసే ఉత్సాహంతో యుద్ధంలోకి దూకి కోరి కోరి మృత్యువును కావిలించుకున్నప్పుడు తల్లి కంట వరద కట్టిన దుఃఖాన్ని అక్షరాలకెత్తుతాడు. 

'మంచి యూనిఫామ్, తినదగ్గ చాక్లెట్‌ ఇవ్వకపోయినా పర్వాలేదు.. పిల్లలకు యుద్ధం లేని నేలను ఇవ్వండి'

యుద్ధం బాలల బతుకుపై కలిగించే దుష్ప్రభావాల గురించి అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. యుద్ధప్రభావం పెద్దలపై కన్నా బాలలపై అనేక రెట్లు ఉంటుందన్న సంగతి సాధారణంగా మన ఊహకెక్కదు. యుద్ధ దుష్పరిణామాలతో పెద్దలకన్నా బాలలు ఎక్కువ కాలం జీవించవలసివస్తుంది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలవుతారు, ప్రేమాదరాల చలవపందిరి కింద గడపవలసిన వయసులో అనా«థాశ్రమాలకు చేరి లేత వయసులోనే పది జీవితాల పెనుభారం కింద అణగిపోతారు. శేషజీవితం వారి ముందు కత్తులబాటలా మారి సుదీర్ఘంగా పరచుకుంటూనే ఉంటుంది.

యుద్ధగాయాలు, రోగాలు, మానసిక వైకల్యాలు జీవితాంతమూ వారిని వెంటాడుతూనే ఉంటాయి. జీవితం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని వయసులో ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడులను, ఆందోళనలను, భయబీభత్సాలను ఇంకొకరితో పంచుకోలేని మూగలవుతారు. నిర్బంధశ్రమకు గురవడమే కాదు.. బాలికలు మానభంగాలకు ఎరవుతారు. ఒక తరం మొత్తం విద్యా, విజ్ఞానాలకు, గౌరవప్రదమైన జీవితానికి దూరమైనప్పుడు దాని ప్రభావం ఎన్ని తరాలపై పడుతుందో ఊహించుకోగలం.  

అయినా మనలో వివేకం మేలుకోవడం లేదు. యుద్ధదేవతకు ఎంత విధ్వంసాన్ని, ఎన్ని ప్రాణాలను, భావిజీవితం చుట్టూ పేర్చుకునే ఎన్నెన్ని అందమైన కలల ఛిద్రాలను నైవేద్యం చేస్తున్నామన్న ఎరుక లేదు. ఎన్ని పసిదనాలు వసివాడిపోయి రేపటి ప్రపంచమనే పూదోట మన కళ్ళముందే ఎలా వల్లకాడుగా మారిపోతోందోనన్న విజ్ఞత లేదు.

సకల రకాల యుద్ధాలకూ వ్యతిరేకంగా మానవాళి ఇప్పటికీ ఒక్కపెట్టున గళం ఎత్తడంలేదు. యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఈ నిర్విరామ యుద్ధంలో శాంతి గెలిచేదెప్పుడు? బాలల జీవితాలు వేయి రేకుల కలువల్లా విప్పారి కాంతులను నింపేదెప్పుడు?
కె.భాస్కరం 

(చదవండి: న్నికల సీన్‌ ఎక్కడైనా సేమ్‌ టు సేమ్‌! ఆకాశాన్ని తాకే  వాగ్దానాలు.. తారలతో తోరణాలు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement