బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్‌లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది.
కరోనాతో మరో నష్టం
మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ తరగతులతో అతిగా మొబైల్స్‌ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది.
పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ తెలుసుకుని గేమ్స్‌కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు.
డబ్బు తగలేసిన టెక్కీ
ఒక టెక్కీ పోకర్ అనే ఆన్‌లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది.
వీధిన పడ్డ క్యాషియర్
బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్‌లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్‌లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు.
(చదవండి: ఎస్‌ఐ స్కాంలో దంపతుల అరెస్టు)
Comments
Please login to add a commentAdd a comment