బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు.
అసలేం జరిగిందంటే..ఇండోర్‌లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అధికారులు ఇండోర్‌ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు.
అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్‌లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్‌లు, బ్యాంక్ బాలెన్స్‌లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు.
ఆదాయపు లెక్కల ప్రకారం..
వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
బిచ్చగాళ్లల్లో రకాలు..
బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్.
(చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్‌ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా)
Comments
Please login to add a commentAdd a comment