పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... ఎలాగో మీరూ ఓ లుక్కేయండి | Inspiring Story of Traveller Anindita Chatterjee | Sakshi
Sakshi News home page

పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... ఎలాగో మీరూ ఓ లుక్కేయండి

Published Fri, Mar 31 2023 9:47 PM | Last Updated on Fri, Mar 31 2023 9:50 PM

Inspiring Story of Traveller Anindita Chatterjee - Sakshi

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి జీవితం మరీ చిన్నదైపోయింది. దినదినగండం నూరెళ్ల ఆయుష్షులా తయారైంది. ఉన్న కొద్ది రోజులు హ్యాపీగా గడిపేద్దాం అనుకునేవారి సంఖ్య ఎక్కువైపోతోంది.

దేశ, విదేశాలు చుట్టేస్తున్నారు. ట్రావెలాగ్‌ చానెల్స్‌ స్టార్ట్‌ చేసి తమ జర్నీని నలుగురితో పంచుకుంటున్నారు. ట్రావెలర్స్‌లోనూ పురుషులే అధికంగా కనిపిస్తున్నారు. కానీ, కొంతమంది మహిళలు కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోము అంటూ లగేజీ సర్దుకుని విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. అలాంటి ఓ మహిళే ముంబైకి చెందిన అనిందితా చటర్జీ.

ఉద్యోగం వదిలేసి...

అనిందితా ఛటర్జీకి ఇప్పుడు 41 ఏళ్లు. భర్త, ఓ చిన్నారి కూడా ఉంది. ఆమెకు విదేశాల్లో పర్యటించడమంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టాలను కుటుంబ సభ్యులు కాదనేవారు కాదు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి విదేశీ పర్యటనలు కొనసాగించింది. అలా 2017లో ‘‘ట్రావెల్‌.చాట్టర్‌’’ పేరుతో ఇన్‌స్ట్రాగమ్‌ పేజీని ప్రారంభించి తన పర్యటన విశేషాలను అందులో పంచుకోవడం ప్రారంభించింది. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ట్రావెలింగ్‌కే కేటాయించింది.

గర్భిణిగా ఉంటూ 4 దేశాల్లో...

ఆమె మెక్సికోలో ఉన్నప్పుడు గర్భవతి అని తెలుసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు వెనక్కి వచ్చేయమని చెప్పారు. అయినా ఆమె వినలేదు. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే ముంబయికి వచ్చారు. గర్భిణిగా ఉన్న సమయంలో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకొని మళ్లీ విహారయాత్రలు మొదలు పెట్టింది. అలా గర్భవతిగా ఉన్నప్పుడే నాలుగు దేశాల్లో పర్యటించింది. 

45 రోజులకే మళ్లీ స్టార్ట్‌...

తిరిగేకాళ్లు ఓ చోట నిలవవు అన్న మాట ఆమెకు సరిగ్గా సరిపోతుంది. డెలివరీ అయిన తర్వాత కేవలం 45 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకుంది. పాపకు ఏడాది పూర్తయ్యేసరికి 14 దేశాల్లో పర్యటించి అక్కడి విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించేది. ట్రావెలింగ్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అనందిత 87 దేశాల్లో పర్యటించింది.

ఆత్మస్థైర్యం కోల్పోవద్దు...

చిన్న చిన్న కారణాలతో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని అనిందిత చెబుతుంది. మన కలలను నెరవేర్చుకునేందుకు శ్రమించినప్పుడే.. మన పిల్లలు కూడా వాటిని చూస్తూ పెరిగి.. వాళ్ల కలలను సాకారం చేసుకుంటారని ఆమె చెప్తుంది. ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ముందుగా దాని గురించి పరిశోధన చేసి, అక్కడ చూడదగ్గ విశేషాలను తెలుసుకున్న తర్వాతనే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటోంది అనందిత. చిన్నారి కూడా తమ ట్రావెలింగ్‌కు సహకరిస్తోందని, పాప కూడా ట్రిప్‌ని ఎంజాయ్‌ చేస్తుండటంతో ఆనందంగా ట్రావెలింగ్‌ను పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అనందిత చటర్జీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement